Infighting in government | రేవంత్‌ రెడ్డికి మంత్రుల మద్దతు ఏది? బీఆరెస్‌ విమర్శలకు కౌంటర్‌ ఏది?

Infighting in government | రేవంత్‌ రెడ్డికి మంత్రుల మద్దతు ఏది? బీఆరెస్‌ విమర్శలకు కౌంటర్‌ ఏది?

Infighting in government | రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్య‌మంత్రి.. ఆయ‌న మంత్రివ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు 12 మంది మంత్రులుగా ఉండగా, తాజాగా మ‌రో ముగ్గురు చేరారు. దీంతో మంత్రుల సంఖ్య 15కు చేరింది. వీరంతా రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లోని వారే. కానీ ఏ ఒక్క‌రు కూడా కీలక సమయాల్లో ఆయనకు అండగా నిలుస్తున్న సందర్భాలు కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి వింత ప‌రిస్థితి ఈ కాలంలో దాదాపు ఏ ముఖ్య‌మంత్రికీ ఎదురు కాలేద‌ని చెబుతున్నారు. బీఆరెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు నాటి సీఎం కేసీఆర్‌పై మంత్రులు ఈగ‌ వాల‌నివ్వ‌లేదు. పొరుగు రాష్ట్రం ఆంధ్రాలో సీఎంగా జగన్ ఏలినప్పుడు టీడీపీ నేత‌లు ఏ చిన్నపాటి విమ‌ర్శ చేసినా దానిని వైసీపీ మంత్రులు రాద్ధాంతం చేసేవారు. ఆమోదయోగ్యం కాదు కానీ పద్ధతుల్లో వ్యక్తిగత దూషణలకు సైతం వెనుకాడలేదు. ఇప్పుడు టీడీపీ మంత్రులు కూడా అదేతీరుగా చంద్ర‌బాబుపై ఈగ‌ వాల‌నివ్వ‌డం లేదు. వైసీపీ నేతలకు ఎక్కడికక్కడ గట్టిగా రిటార్టులిస్తున్నారు.

హుందా విమర్శలు పోయి.. తిట్లు శాపనార్ధాలు

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అది హుందాగా సాగినంత కాలం ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ.. కొన్నేండ్లుగా ఆ పరిస్థితి మారిపోయింది. విమర్శలు తిట్లుగా పరిణమిస్తున్నాయి. హద్దులు దాటి వ్యక్తిగత జీవితాలను టార్గెట్‌ చేస్తున్న దయనీయ దృశ్యాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. అయితే.. ఇక్కడ మాత్రం చిన్న తేడా కనిపిస్తున్నది. ఎవరూ ప్రత్యర్థి విమర్శలకు శృతిమించిన స్థాయిలో కౌంటర్లు ఇవ్వాల్సి అవసరంలేదు కానీ.. కనీసం వాటిని ఎదుర్కొనాల్సిన అవసరం మాత్రం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో బీఆరెస్‌ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా చేసే విమర్శలకు సొంత మంత్రులు, పార్టీలోని ముఖ్య నేతలు తగిన విధంగా స్పందించడం లేదనే అభిప్రాయాలను మాత్రం వారు వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు రేవంత్‌కు అండగా లేరా? అనే అనుమానాలు వచ్చేలా పరిస్థితి ఉన్నదని చెబుతున్నారు. బీఆరెస్‌ నేతల తిట్ల దండకానికి ఒకరిద్దరు కిందిస్థాయి నేతలు మాత్రమే స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది.

కేసీఆర్‌ను విచారణకు పిలవడంతో బీఆరెస్‌ గుర్రు

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌ అక్రమాలు, అవినీతిపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ క‌మిష‌న్.. మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణకు పిలిచింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టీ హరీశ్ రావు ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ విచారణకు వచ్చిన రోజు ఒక అడుగు ముందుకు వేసి కేటీఆర్‌.. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించి హద్దులు దాటారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గౌరవ వాచకాలు ఎప్పుడో పోయాయి.. వాడు వీడు.. సన్నాసి, చిల్లరగాడు.. అంటూ కొత్త పదజాలాలు విమర్శలకు తోడవుతున్నాయి. నీకు కేసీఆర్‌ను విచారణకు పిలిచే దమ్ముందా? అంటూ నిలదీస్తున్న బీఆరెస్‌ నాయకులు.. కేసీఆర్‌ను విచారణకు పిలవడం అంటే.. తెలంగాణను అవమానించడమేననే తీరులో ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్‌ కుమార్తె కవిత ఏకంగా ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాకు దిగితే.. బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ముఖ్యమంత్రిని చిల్లరగాడు అని అభివర్ణించారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇవన్నీ మీడియాలో ప్రముఖంగా కూడా వచ్చాయి.

తీవ్ర విమర్శలకూ మంత్రుల కౌంటర్‌లు లేవు!

విచిత్రం ఏమిటంటే.. రేవంత్‌రెడ్డిని వ్యక్తిగతం టార్గెట్‌ చేసి బీఆరెస్‌ నేతలు చేస్తున్న విమర్శలకు సహచర మంత్రులు స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అంతకు మించి అనుమానాలను రేకెత్తిస్తున్నది. వారి తీరుపై కాంగ్రెస్ పార్టీవర్గాలు సైతం విస్మయానికి గురవుతున్నాయి. నిజానికి రేవంత్‌రెడ్డి మీద కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన పార్టీ అధ్యక్షుడు అయిన సందర్భంలో నేరుగానే వ్యతిరేకించారు. కానీ.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయనపై విమర్శలకు తోటి నేతలు, సహచర మంత్రులు స్పందించకపోవడం విడ్డూరమేనని కాంగ్రెస్‌ వ్యవహారాలను నిశితంగా పరిశీలించే ఒక జర్నలిస్టు అన్నారు. రేవంత్ రెడ్డిని బీఆరెస్ పొట్టు పొట్టుగా అనరాని మాటలు అంటే త‌మ‌కేమి సంబంధం.. ఆయ‌న‌ను తిడుతున్నారు.. ఆయ‌నే వాటిని తిప్పికొడతారు.. అనే తీరులో కొందరు మంత్రులు ఉన్నట్టు కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకుడొకరు వ్యాఖ్యానించారు.

వ్యతిరేకత కొనసాగుతున్నదా?

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి నియామకం సమయంలోనే ఆయన పట్ల వ్యతిరేకత బయటపడింది. తట్టుకొని ఒక్కడై అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడిన రేవంత్‌.. బీఆరెస్‌పై వ్యతిరేకత అనేక కీలక అంశంతోపాటు అనేక విషయాలు కూడా కలిసి రావడంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో కూడా మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వంటి కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నాయకులు.. సీఎం సీటు కోసం పోటీ పడ్డారు. కానీ.. ముఖ్యమంత్రి పదవికి అధిష్ఠానం రేవంత్‌రెడ్డినే ఎంపిక చేసింది. ఇదే ధోరణి ఇప్పుడు కూడా కొనసాగుతున్నదా? అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ రేవంత్‌కు రాహుల్‌ అపాయింట్‌మెంట్లు లభించకపోవడం, దాన్నుంచి అధిష్ఠానంతో ఆయనకు చెడిందనే ప్రచారాలు తోడవడంతో మంత్రులు మరింత ఉదాశీన వైఖరిని అనుసరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిష్ఠానమే లెక్కచేయని రేవంత్‌ను తాము రక్షించేది ఏంటన్న భావనలో ఉన్నారా? అని సందేహాలు వెలిబుచ్చుతున్నారు. ఇది రానురాను ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనే చర్చలు సాగుతున్నాయి.