Telangana BJP | ఈటలకు అడ్డాలు తెడ్డేలు..! బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కోల్డ్ వార్?
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటమే కాకుండా.. తెలంగాణవ్యాప్తంగా ఉద్యమ నాయకుడిగా ఈటల గుర్తింపు పొందారు. బీజేపీ రాష్ట్ర బాధ్యతలను బీసీలకు ఇవ్వాలని నిర్ణయిస్తే రేసులో ఈటల రాజేందరే ముందువరుసలో ఉంటారు.

- గ్రూపు రాజకీయాలతో తలపట్టుకున్న ఢిల్లీ పెద్దలు
- మరో ఏడాది పాటు కిషన్ రెడ్డి కొనసాగింపు?
- బీజేపీ వర్గాల్లో రసవత్తరంగా చర్చలు
(విధాత ప్రత్యేకం)
Telangana BJP |
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి విషయం గత ఆరు నెలలుగా మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. కేంద్ర గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి పదవీకాలం ముగిసినా.. నూతన అధ్యక్షుడి నియామకం విషయాన్ని ఢిల్లీ పెద్దలు ఎటూ తేల్చడం లేదు. ఆధిపత్యపోరులో పార్టీ మూడు ముక్కలుగా మారడంతో గ్రూపు రాజకీయాల కంపు కొడుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా జీ కిషన్ రెడ్డి గతేడాది గెలుపొందారు. బీజేపీ నియామావళి ప్రకారం ఒకే వ్యక్తి ఒకే పదవి ఉంటుంది. దీనితో రాష్ట్రంలోని ఇతర ముఖ్య నాయకులు పీఠం దక్కించుకునేందుకు తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పది నెలల నుంచీ ఈ తతంగం కొనసాగుతూ వస్తున్నది. అధిష్ఠానం పెద్దలు అందరి మాటలూ ఆలకిస్తున్నారు తప్పితే నిర్ణయాన్ని ప్రకటించడం లేదు. దీంతో అధ్యక్ష పీఠం ఒక పాదరసంగా మారిపోయింది.
నాడు బండి దూకుడుకు కళ్లెం
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కుమార్.. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించారు. అయితే.. బండి సంజయ్ కుమార్‌ను ఢిల్లీ పెద్దలు పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. ఆ తరువాత అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుతో అంతర్గత ఒప్పందం కుదరడం మూలంగానే సంజయ్‌ను అకస్మాత్తుగా తప్పించారనే విమర్శలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమయం దొరికినప్పుడల్లా కిషన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సన్నిహిత వ్యక్తిగా ఆరోపిస్తున్నారు.
పది నెలలుగా నాన్చుడు ధోరణి
పది నెలల నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవిపై అదిగో ఇదిగో అంటూ అధిష్ఠానం పెద్దలు కాలం నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖలో ఆరెస్సెస్ గ్రూపు, బీఆర్ఎస్ అనుకూల గ్రూపు, బయట నుంచి చేరిన వారి నాయకత్వంలో గ్రూపులు కొనసాగుతున్నాయి. ఒక గ్రూపు అంటే మరో గ్రూపునకు సరిపడకపోవడం మూలంగా విభేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తలంటినప్పటికీ విభేదాలు సమసిపోలేదని కార్యకర్తలే అంగీకరిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నాయకులు తిరిగి వెళ్లిపోయారు. పార్టీ కోసం ఎంత పాటుపడ్డా విలువ ఇవ్వడం లేదని, అంటరాని నాయకులుగా చూస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎపీ జితేందర్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా ముందే ఆవేదన వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్‌తో అంటకాగుతున్నందున ఇక పార్టీ కోసం పనిచేయడం వృథా అంటూ ఆ ఇద్దరు నాయకులు బీజేపీకి గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామంతో ఢిల్లీ పెద్దలు కంగుతిన్నారు. అదే సమయంలో ఈటల రాజేందర్ కూడా.. కేసీఆర్‌తో పోరాడేందుకు బీజేపీ సిద్ధంగా లేదని, ఇలాగైతే తన దారి తాను చూసుకోవాల్సి వస్తుందని సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా.. ఈటలను బుజ్జగించారని సమాచారం. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తూ.. పక్క చూపులు వద్దని కోరినట్టు ప్రచారం సాగింది. మల్కాజిగిరి నుంచి పోటీచేయడం, గెలవడం కూడా అయిపోవడంతో ఆయన తన స్థాయిలో రాష్ట్ర అధ్యక్ష పదవికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
ఈటలకు అడ్డుపడుతున్న గ్రూపులు!
రాజేందర్‌కు ఉన్న కమ్యూనిస్టు నేపథ్యమే ఆయన అధ్యక్ష పదవికి అడ్డంకిగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన కమ్యూనిస్టు నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ రాజేందర్‌ను అడ్డుకునేందుకు రాష్ట్ర బీజేపీలోని కేసీఆర్ అనుకూల గ్రూపుతోపాటు ఆరెస్సెస్ అనుకూల నాయకులు పావులు కదుపుతున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ముదిరాజ్ కులం వారు అధిక సంఖ్యలో ఉన్నారు. రాజకీయంగా వెనుకబడినప్పటికీ, అభ్యర్థుల గెలుపు ఓటములలో మున్నూరు కాపులు, యాదవులు, ముదిరాజులు, పద్మశాలీలు కీలకంగా ఉన్నారు. బీసీ కుల సంఘాలతో ఈటలకు సన్నిహిత సంబంధాలు ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ కుటుంబాన్ని ఢీ కొట్టే సత్తా, కేసీఆర్ బలహీనతలు, బలాలు తెలిసిన నాయకుడిగా ఈటలకు బీజేపీ పెద్దల వద్ద సానుకూల వాతావరణమే ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని రాజేందర్ వర్గం నేతలు చెబుతున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసి, తెలంగాణవ్యాప్తంగా ఉద్యమ నాయకుడిగా ఈటల గుర్తింపు పొందారు. బీజేపీ రాష్ట్ర బాధ్యతలను బీసీలకు ఇవ్వాలని నిర్ణయిస్తే రేసులో ఈటల రాజేందరే ముందువరుసలో ఉంటారు. రాష్ట్ర నాయకత్వంలో కుమ్ములాటల మూలంగా ఈటల కూడా గుంభనంగా వ్యవహరిస్తూ పార్టీ అప్పచెప్పిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మాకే పీఠం దక్కాలి
రాష్ట్ర బాధ్యతలు తమకు ఇవ్వాలంటే.. కాదు తమకే ఇవ్వాలని బీజేపీ నాయకులు ఎస్ రామచందర్ రావు, ఎంపీలు ధర్మపురి అర్వింద్, ఎం రఘునందన్ రావు, డీకే అరుణతో పాటు బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, కాసం వెంకటేశ్వర్లు ఇలా ఎవరికి వారుగా అధిష్టానం పెద్దలను కలుస్తున్నారని తెలుస్తున్నది. దీంతో అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి అధిష్ఠానానికి ఎదురైందని అంటున్నారు. గత నెలలో మరో ఏడాది పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతారంటూ పత్రికల్లో వార్తలొచ్చాయి. ఈ వార్తను చూసిన పలువురు కార్యకర్తలు, నాయకులు కంగుతిన్నారు. ఆ మరుసటి రోజే రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకుడు డాక్టర్ కే లక్ష్మణ్ స్పందిస్తూ, అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని, త్వరలో కొత్త అధ్యక్షుడిపై ప్రకటన ఉంటుందని స్పష్టం చేయడంతో కార్యకర్తలు చల్లబడ్డారు.
నేను పోటీలో లేనంటున్న బండి
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేరు నాలుగు నెలల క్రితం జరిగిన సంస్థాగత ఎన్నికల సందర్భంగా బయటకు వచ్చింది. మరోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేనని, కేంద్ర మంత్రిగా సుఖంగా ఉన్నానని ఆయన ప్రకటన చేసుకునే పరిస్థితికి తెచ్చారు. ఒకవేళ అప్పగించినా తీసుకునేది లేదని ప్రకటించి ప్రచారానికి ముగింపు పలికారు. ఆ వార్తలు ఊహాగానాలేనంటూ కొట్టిపారేశారు. దీంతో ఇతర నేతలు పోటీని ముమ్మరం చేసుకున్నారని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో తమిళనాడుతో పాటు తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమిస్తుందా లేదా అనే విషయంలో సస్పెన్స్ నెలకొన్నది.
మరో ఏడాది ఇలాగేనా?
మరో ఏడాది పాటు అధ్యక్ష పదవిలో కిషన్‌రెడ్డిని కొనసాగించేలా పెద్దల వైఖరి ఉందని పార్టీలో అంతర్గత చర్చ జరుగుతున్నది. అధ్యక్ష పదవిని కోల్డ్ స్టోరేజీలో పెట్టారని, అధినాయకత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోకుండా తికమక పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారని అంటున్నారు. గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరడంతో ఎంపిక ప్రక్రియ మరో ఏడాది పాటు చర్చల్లో ఉంటుంది తప్పితే ఖరారు కాదని కార్యకర్తలే చెబుతుండడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఆ తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 17 సీట్లలో 8 సీట్లను గెలుపొంది సంచలనం సృష్టించింది. మిగతా తొమ్మిదిలో ఒకటి ఎంఐఎం, 8 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకున్నది.