Jubilee Hills Naveen Yadav| జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ యాదవ్‌కే ఖరారు? నేడో రేపో అధికారికంగా ప్రకటన!
ఉప ఎన్నిక నిర్వహించనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కు టికెట్ దక్కే చాన్స్ ఉన్నదని విశ్వసనీయంగా తెలుస్తున్నది.

హైదరాబాద్, అక్టోబర్ 7 (విధాత ప్రతినిధి):
Jubilee Hills Naveen Yadav| జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ముగ్గురు నలుగురు పోటీపడుతున్నప్పటికీ, యువకుడు, విద్యావంతుడు నవీన్ యాదవ్ కే టిక్కెట్ ఖరారు అయినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అగ్రనాయత్వం కూడా స్థానికుడికే టికెట్ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటి వరకు పోటీలో ఉన్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తాను బరిలో లేనని మంగళవారం నాడు ప్రకటించారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆదేశం మేరకే రామ్మోహన్ వెనక్కి తగ్గారంటున్నారు.
కీలకమైన నియోజకవర్గం కావడంతో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసేందుకు పలువురు పోటీపడుతున్నారు. నవీన్ యాదవ్ తో పాటు మాజీ కార్పొరేటర్ అంజన్ కుమార్ యాదవ్, రహ్మత్ నగర్ కార్పొరేటర్ సీఎన్.రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పోటీపడుతున్నారు. ఒక్కో ఫ్యామిలీ నుంచి ఇద్దరికి టికెట్లు ఇచ్చారు, తనకు కూడా టికెట్ ఇస్తే తప్పేంటని మాజీ ఎంపీ అంజన్ కుమార్ వాదిస్తున్నారు. తన కుమారుడు రాజ్యసభ సభ్యుడు అయితే, తనకు జూబ్లీహిల్స్ సీట్ ఇవ్వరా అంటూ ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. స్థానికుడు అయిన తనకు టికెట్ ఇవ్వాలని సీఎన్.రెడ్డి కోరుతున్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పార్టీలోకి వచ్చారు. ఇటీవలే పార్టీలోకి వచ్చిన ఆయనకు ఎలా ఇస్తారంటూ స్థానిక కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.
పార్టీ ఫిరాయింపు కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇక్కడి నుంచి బరిలో ఉండేందుకు తనవంతు ప్రయత్నాలు చేశారు. పార్టీ నాయకత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో ఆయన వెనక్కి తగ్గారు. రెండు రోజులు క్రితం తను పోటీ చేయడం లేదని, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతానని నాగేందర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నిన్నటి వరకు రేసులో బలంగా విన్పించిన పేరు రామ్మోహన్. ఆయన కూడా ఇవాళ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పార్టీ నాయకులు సూచించారో లేదా ఆయనే ముందుకు వచ్చారో తెలియదు. జూబ్లీహిల్స్ బరి నుంచి పోటీచేయడం లేదని, పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా గెలిపిస్తానని ఆయన ప్రకటించారు. ఇంకో విషయం ఏమంటే తను టికెట్ కూడా అడగేలేదన్నారు. పార్టీ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేయాలనే దానిపై కొద్ది రోజులు గా సర్వేలు నిర్వహించారు. మెజారిటీ ఓటర్లు స్థానికుడికే ఇవ్వాలని కోరారు. విద్యావంతులు, వివాదరహితులకు సీటు ఇస్తే గెలుపొందుతుందని తమ అభిప్రాయాలు వెల్లడించారు. పోటీలో ఉన్నవారిలో ఎవరికి ఇస్తే గెలుపు సాధ్యం అవుతుందనే దానిపై పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా సర్వే లు చేశారు. తన సర్వే నివేదికను ఢిల్లీలోని పార్టీ నాయకత్వానికి అందచేశారు.
గతంలో పోటీ చేసి ఓటమి పాలు కావడం, ఓటర్లలో సానుభూతి, బీసీలోని యాదవ కులానికి చెందిన వ్యక్తి కావడం (caste equations) కలిసివచ్చే అవకాశంగా చెబుతున్నారు. ఆర్థిక బలంతో పాటు నియోజకవర్గంలో కుల బలగం కూడా ఉండడంతో ఆయన వైపే పార్టీ ముఖ్య నాయకులు మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ మంత్రులు సేకరించిన అభిప్రాయం ప్రకారం, అంతర్గత సర్వేల్లో కూడా నవీన్ పేరు ప్రథమ స్థానంలో ఉందంటున్నారు.