Kadiyam-Danam | కడియం, దానం మౌనం : భయమా? వ్యూహాత్మకమా?

అసెంబ్లీ స్పీకర్‌ నోటీసుల నేపథ్యంలో అందరి దృష్టి దానం నాగేందర్‌, కడియం శ్రీహరి వేయబోయే అడుగులపైనే కేంద్రీకృతమైంది. తప్పని పపరిస్థితి వస్తే తెగించేందుకు ఇద్దరూ సిద్ధంగా ఉన్నారా? రాజకీయ వర్గాల్లో చర్చలు.

Kadiyam-Danam | కడియం, దానం మౌనం : భయమా? వ్యూహాత్మకమా?

విధాత ప్రత్యేక ప్రతినిధి:

Kadiyam-Danam | పార్టీ ఫిరాయింపుల పైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జారీ చేసే నోటీసులకు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ అడుగులెటువైపనే ఆసక్తి రాజకీయ వర్గాలతో పాటు సర్వత్రా నెలకొంది. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ తాజాగా నోటీసులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నోటీసులపై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తాము ‘పార్టీయే’ మారలేదని వివరణ ఇవ్వగా… ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం, దానం స్పందన ఏ విధంగా ఉంటుందోననే చర్చసాగుతోంది. ఇదిలా ఉండగా తనకు స్పీకర్ నుంచి ఇంకా నోటీసు అందలేదని, అందిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకుని సమాధానమిస్తానంటూ తాజాగా దానం తెలిపారు. స్పీకర్‌కు వివరణ విషయం పై కడియం మాత్రం ఇంకా ఏ విధంగా స్పందించలేదు. తన ప్రత్యర్ధి రాజయ్య తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ ప్రస్తుతానికి కడియం మౌనం వహిస్తున్నారు.

ఇద్దరు దేనికైనా సిద్ధమా!?

ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ పార్టీ మారిన వ్యవహారం పై సమాధానాలివ్వలేదు. తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను కోరినట్లు వార్తలు వెలువడినప్పటికీ, దానం స్పందనతో ఇంకా నోటీసులు అందనట్లు భావించాల్సి వస్తోంది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణ పై ఇప్పటికే రకరకాల చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ ఆరోపణలు, కోర్టు ఆదేశాలు తదితర వాటికి సమాధానంగా ఎనిమిది మంది వ్యూహాత్మకంగా స్పందించినట్లు చర్చసాగుతుండగా ఇద్దరు ఎమ్మెల్యే దానం, కడియం శ్రీహరిలకు మరో వ్యూహం ఉందంటున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆచితూచి అడుగులేస్తున్నట్లు భావిస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు, ఇతరత్రా సమస్యలు రాకుండా ఎలా ముందుకు సాగాలనేదానిపై జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. వీలైనంత మేరకు బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేస్తూనే రాజీనామాకు అవకాశం ఇవ్వకుండా, రాజీపడకుండా వ్యవహరించాలనే అభిప్రాయంతో ఉన్నట్లు భావిస్తున్నారు.

అవసరమైతే ఉప ఎన్నికకు సిద్ధం?

తప్పనిసరి పరిస్థితి ఎదురైతే రాజీనామా చేసి ‘ఉప ఎన్నికలు’ ఎదుర్కొనేందుకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం సిద్ధమవుతున్నట్లు చర్చ సాగుతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ ఎంపీగా పోటీచేసినందున ఆమె ప్రచారంలో అంతా తానై వ్యవహరించడంతో లీగల్‌గా సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయా? అనే అంశాలను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అవసరమైతే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని కడియం కూడా భావిస్తున్నట్లు చర్చసాగుతోంది. అందుకే ఇప్పటికే కడియం పూర్తిగా తన నియోజకవర్గంలో అభివృద్ధి పై కేంద్రీకరించి పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. అవసరమైన ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావడం కూడా వ్యూహంలో ఒక భాగమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ముందస్తు సానుకూల వాతావరణం ఏర్పడగానే రాజీనామా అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. చట్టపరమైన ఇబ్బందులు, కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం, తాజా రాజకీయ పరిస్థితి, నియోజకవర్గంలో సానుకూల, వ్యతిరేక అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుని భవిష్యత్ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు భావిస్తున్నారు.

బీఆర్ఎస్ లోనే ఉన్నాం గదా!

పార్టీ మారలేదని బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని పది మందిలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఇప్పటికే వివరణ ఇచ్చారు. కేవలం అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ ను కలిశామని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అరెకపూడి గాంధీ, సంజయ్‌, గూడెం మహిపాల్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, కాలె యాదయ్య, తెల్లం వెంకట్ రావు శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. పార్టీ ఫిరాయింపు నోటీసులపై సమాధానాలిచ్చిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల వివరణలను ఫిర్యాదు చేసిన సంబంధిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పంపారు. దీనిపై అభ్యంతరాలను 13 తేదీలోపు పంపించాలని కోరారు.