NDSA | రజతోత్సవ నాయకుడిపై ‘కాళేశ్వరం’ నీలినీడలు!

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఎ నివేదిక వచ్చిన ఇదే సమయంలో ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ ఎల్కతుర్తిలో తమ పార్టీ రజతోత్సవ సభలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. సభ నిర్వహిస్తున్న సందర్భం కావడంతో ‘కాళేశ్వరం’ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు అధికార పార్టీ నేతల విమర్శలు, ఎన్డీఎస్ఏ నివేదికపై ఎల్కతుర్తి సభావేదికగా బీఆర్ఎస్ అధినేత, కాళేశ్వరం నిర్మాత కేసీఆర్ ఏ విధంగా ప్రతిస్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

NDSA | రజతోత్సవ నాయకుడిపై ‘కాళేశ్వరం’ నీలినీడలు!
  • బీఆరెస్‌ను వీడని కూలిన కాళేశ్వరం 
  • ఎల్కతుర్తి సభ నేపథ్యంలో ఎజెండాపైకి
  • ఎన్‌డీఎస్‌ఏ నివేదికతో జోరుగా చర్చలు
  • ఉపయోగించడానికి వీల్లేదన్న నిపుణులు
  • నాడు ప్రపంచ అద్భుతంగా ప్రచారాలు
  • మేడిగడ్డతోపాటే.. బీఆరెస్‌ కుంగుబాటు
  • గత అసెంబ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం
  • 27న ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ భారీ సభ
  • అందులో కేసీఆర్‌ మరోసారి స్పందిస్తారా?
  • జస్టిస్ ఘోష్‌ కమిషన్ విచారిస్తుందా?
  • రాజకీయంగా ఆసక్తి రేపిన నివేదిక

విధాత ప్రత్యేక ప్రతినిధి:
NDSA | రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలేదన్నట్లు కేసీఆర్, బీఆర్ఎస్ విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీలినీడలు నిత్యం ఏదోరూపంలో వెంటాడుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అండపిండ బ్రహ్మాండమంటూ ఘోషించారు. ఈ భూమ్మీద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఇప్పటి వరకు మరొకటి లేదు.. కట్టినవారూ లేరూ.. కట్టబోయేవారూ లేరంటూ అంతర్జాతీయ స్థాయి ప్రచారం చేసుకున్నారు. అది నిజమేననే చర్చ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఉండేది. కానీ, పరిస్థితి తిరగబడింది. సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయింది. అది బీఆర్ఎస్‌కు శాపంగా మారింది. చివరకు బీఆరెస్‌కు కుంగుబాటుగా పరిణమించింది. మేడిగడ్డ కుంగుబాటును బీఆర్ఎస్ పాపంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సమయం, సందర్భమేదైనా కేసీఆర్ సహా ఆ పార్టీ నాయకులెవరి నోట విన్నా ‘కాళేశ్వరం’ గొప్పదనం గురించిన మాటే వినిపించేది. ఆ పార్టీకి ఎత్తుపల్లాల్లో కాళేశ్వరం తోడు నీడగా మారిందేమో.. అధికారంలో ఉండగా పొగడ్తల రూపంలో కనిపించిన కాళేశ్వరం, ఇప్పుడు విమర్శల రూపంలో వారిని వెంటాడుతున్నది. ఎన్నికలు.. ఆ తర్వాత ఫలితాలు, రాజకీయ విమర్శల్లో కాళేశ్వరం కాస్తా ‘కూలే’శ్వరంగా మారిపోయింది. తాజాగా మరోసారి కాళేశ్వరం అంశం తెరపైకి వచ్చింది. కాళేశ్వరం పరిస్థితి, ప్రత్యామ్నాయ చర్యలపై ఎన్‌డీఎస్‌ఏ తుది నివేదిక గత డిసెంబర్ నాటికే సమర్పించాల్సి ఉంది. జాప్యం అనంతరం గురువారం రాత్రి సమర్పించడంతో బలమైన ఎజెండాగా ముందుకు వచ్చింది.

కాళేశ్వరం విఫల ప్రాజెక్టు!
కాళేశ్వరంలో భాగంగా కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు ఉపయోగపడవని, ఉపయోగిస్తే ఎప్పుడైనా కొట్టుకుపోవచ్చనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ (ఎన్డీఎస్ఎ) నివేదిక సారాంశం. వీటిని రీ డిజైన్ చేసి, మళ్లీ నిర్మించాలని సిఫారసు చేసింది. నిర్మాణం, డిజైన్‌లో అన్నీ లోపాలేనని స్పష్టం చేసింది. మూడు బరాజ్‌లలోనూ సీకెంట్‌ పైల్స్‌ కూలిపోవడం, బరాజ్‌ ఎగువ, దిగువల్లో రంధ్రాలు గుర్తించారు. పలు పరీక్షలు చేసి, 14 నెలల అధ్యయనం తర్వాత ఎన్‌డీఎస్‌ఏ ఈ రిపోర్టు ఇచ్చింది. బరాజ్‌ల నిర్మాణానికి చేయాల్సిన భూసార పరీక్షలు కూడా చేయలేదని ఎన్‌డీఎస్‌ఏ గుర్తించింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను ఒకచోట ప్రతిపాదించి, మరో చోటికి మార్చారు. జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021 ప్రకారం వానాకాలానికి ముందు, తర్వాత బరాజ్‌లు ఏ విధంగా ఉన్నాయనే దాన్ని పరిశీలించాలి. కానీ అలాంటి ప్రయత్నం చేయలేదని రిపోర్టు స్పష్టం చేసింది. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టులో నిర్మాణ, నిర్వహణ, డిజైన్‌ లోపాలే మూడు బరాజ్‌లకు ముప్పు తెచ్చాయని తేల్చేయడంతో రాజకీయంగానూ కలకలం రేపే అవకాశాలు ఉన్నాయి.

ఘోష్‌ కమిషన్‌కు ఈ నివేదికే కీలకం
కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్‌కు ఈ రిపోర్టు అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే పలుమార్లు జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. ఫైనల్‌గా కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి సమయంలో ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు రావడం బీఆర్ఎస్‌కు షాక్ లాంటిదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు సాధారణ ప్రజలు, పాలక పార్టీ నుంచి వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది.

రజతోత్సవ సభ వేళ రాజకీయ రచ్చ
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఎ నివేదిక వచ్చిన ఇదే సమయంలో ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ ఎల్కతుర్తిలో తమ పార్టీ రజతోత్సవ సభలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. సభ నిర్వహిస్తున్న సందర్భం కావడంతో ‘కాళేశ్వరం’ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు అధికార పార్టీ నేతల విమర్శలు, ఎన్డీఎస్ఏ నివేదికపై ఎల్కతుర్తి సభావేదికగా బీఆర్ఎస్ అధినేత, కాళేశ్వరం నిర్మాత కేసీఆర్ ఏ విధంగా ప్రతిస్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.