Minister Konda Surekha | కమీషన్లపై వ్యాఖ్యలతో కొండా సురేఖ సెల్ఫ్ గోల్.. వివాదాస్పదమవుతున్న మంత్రి తీరు

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా.. వాటికి వివరణ ఇచ్చుకున్నా.. అప్పటికే ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయింది. దీనంతటికీ సురేఖ మాట్లాడిన తీరే కారణమనే విమర్శలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. గతంలో సమంత విషయంలో కూడా ఇదేవిధంగా నోరు జారిందని మండిపడుతున్నారు.

Minister Konda Surekha | కమీషన్లపై వ్యాఖ్యలతో కొండా సురేఖ సెల్ఫ్ గోల్.. వివాదాస్పదమవుతున్న మంత్రి తీరు
  • ఈ దఫా మంత్రి పదవి గల్లంతేనా?
  • మొన్న సమంతపై.. నేడు కమీషన్
  • ఇరకాటంలో కాంగ్రెస్, ప్రభుత్వం
  • కట్టడి చేయలేకపోతున్న రేవంత్‌
  • సీఎం పై కూడా తీవ్ర విమర్శలు
  • సంజాయిషీలతో నేతల ఇబ్బంది

విధాత ప్రత్యేక ప్రతినిధి:
Minister Konda Surekha | బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీరు ఉంది. తన గొప్పదనం చాటుకునేందుకో.. సీఎం రేవంత్ మెప్పు పొందేందుకోగానీ.. ముందూవెనుకా ఆలోచించకుండా ఆమె మాట్లాడుతున్న మాటలు సెల్ప్‌గోల్‌గా తయారవుతున్నాయి. ఫైర్ బ్రాండ్ నేతగా ముద్రపడిన కొండా సురేఖ.. మారిన పరిస్థితులను అర్థం చేసుకోకుండా తాను పై చేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కాస్తా తిరగబడుతున్నాయి. అవి ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పై విమర్శలు చేస్తూ.. చేస్తూ మధ్యలో నటుడు నాగార్జున కుటుంబాన్ని, నటి సమంతను వివాదంలోకి లాగారు. సురేఖ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు జుగుప్సాకరంగా ఉండటంతో అవి తీవ్రస్థాయిలో బూమర్యాంగ్‌ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మహిళ పట్ల తప్పుడు పద్ధతిలో మాట్లాడారని ఆగ్రహం కూడా వ్యక్తం అయింది. నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో మంత్రి స్థానంలో ఉంటూ కోర్టులో కేసు ఎదుర్కోవాల్సిన పరిస్థితి సురేఖకు ఏర్పడింది. తాజాగా ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులు డబ్బులు తీసుకుంటారన్నట్లుగా ఆమె మాటలు ఉండటం కాంగ్రెస్‌ సర్కారుకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది.

ఫైళ్ల క్లియరెన్స్‌కు మంత్రుల కమిషన్?

వరంగల్ నగరంలోని బాలికల కాలేజీ నూతన భవన నిర్మాణానికి అరబిందో సంస్థ సహకారంతో గురువారం శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడిన సురేఖ.. కొత్త వివాదానికి ఆజ్యం పోశారు.
మంత్రుల వద్దకు పలు కంపెనీలు ఫైళ్ల క్లియరెన్స్ కోసం వస్తుంటాయని, అలాంటి వాళ్ళ దగ్గర మంత్రులు డబ్బులు తీసుకుంటారని, తాను మాత్రం కాలేజీ భవన నిర్మాణానికి సహకరించాలని కోరానని, దీంతో అరబిందో కంపెనీ కాలేజీ భవన నిర్మాణానికి నాలుగున్నర కోట్లు ఇచ్చిందని తన గొప్ప చెప్పుకోబోయారు. ఇతర మంత్రులు పనుల కోసం డబ్బులు తీసుకుంటున్నట్లు అర్థం వచ్చేలా మంత్రి మాటలు స్పష్టంగానే ఉండటంతో గగ్గోలు రేగింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల ప్రభుత్వంగా మారిందని, 20 నుంచి 30 శాతం కమీషన్లు మంత్రులు తీసుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో కొండా సురేఖ మాట్లాడటంతో.. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కేటీఆర్‌, కిషన్ రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కమీషన్ల ప్రభుత్వంగా అభివర్ణించారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా.. వాటికి వివరణ ఇచ్చుకున్నా.. అప్పటికే ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయింది. దీనంతటికీ సురేఖ మాట్లాడిన తీరే కారణమనే విమర్శలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. గతంలో సమంత విషయంలో కూడా ఇదేవిధంగా నోరు జారిందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను కట్టడి చేయాలని, ప్రభుత్వం పూర్తిగా బదనాం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.

సీఎం రేవంత్ పై విమర్శలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన మంత్రివర్గ సహచరులపైన కనీస పట్టు కూడా లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంత్రుల్లో కూడా ముఖ్యమంత్రి పట్ల కనీస భయం, భక్తి లేకుండా పోతున్నదని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, కనీసం విపక్ష పార్టీల విమర్శలను కూడా తిప్పికొట్టలేకపోతున్నారని అంటున్నారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ మహిళ కోటాలో కొండా సురేఖ మంత్రి పదవి పొందారు. ఈ పరిణామాలతో ఆమె మంత్రి పదవి ఉంటుందా? ఊడుతుందా? అనే చర్చ మరోసారి ప్రారంభమైంది. మొన్ననే మంత్రివర్గ విస్తరణ చేపడుతారని వార్తలు వెలువడిన సందర్భంగా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నారని ప్రచారం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా సాగింది. ఆమె పని తీరుతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు కూడా మంత్రి తీరుపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జోరుగా సాగింది. అనూహ్యంగా మంత్రివర్గ విస్తరణ ఆగిపోవడంతో తాత్కాలికంగా ఈ ప్రచారానికి బ్రేక్ పడింది. తాజాగా మంత్రి మాటలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఈసారి మంత్రివర్గ విస్తరణ జరిగితే సురేఖ మంత్రి స్థానం గల్లంతు కావడం ఖాయమనే అభిప్రాయాలు పార్టీవర్గాల్లో తాజాగా షురూ అయ్యాయి.

ఇవి కూడా చదవండి..

Brain ‘Stent’ | బ్రెయిన్‌ ద్వారా ఐఫోన్‌ను కంట్రోల్‌ చేసే ప్రయత్నాల్లో యాపిల్‌!
ktr, harish: హరీశ్.. కేటీఆర్ భేటీ.. ఏం చర్చించారు?.. రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..విచారణకు కేటీఆర్..కిషన్ రెడ్డి డిమాండ్!
Minister Konda Surekha: నా మాటలను వక్రీకరించారు : మంత్రి కొండా సురేఖ
Revanth Reddy Govt | పథకాల అమలులో జాప్యమే కాంగ్రెస్‌ సర్కార్‌కు డేంజర్‌ బెల్?