బడి నిర్మాణం చుట్టూ గుడి ‘రాజకీయం’ – అశోక్​నగర్​లో ఉద్రిక్తత

వరంగల్ జిల్లా అశోక్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం సందర్భంగా కాకతీయుల కాలంనాటి పురాతన శివాలయం కూల్చివేత రాజకీయంగా పెను దుమారం లేపుతోంది. గుప్తనిధుల కోసమే తవ్వకాలు జరిగాయని బీఆర్ఎస్ నేత హరీశ్​ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.

బడి నిర్మాణం చుట్టూ గుడి ‘రాజకీయం’ – అశోక్​నగర్​లో ఉద్రిక్తత గుప్తనిధుల ఆరోపణల మధ్య అశోక్‌నగర్‌లో కూల్చివేసిన పురాతన శివాలయ అవశేషాలు

BRS Alleges Hidden Treasure Hunt Behind Historic Temple Demolition

  • పురాతన దేవాలయ కూల్చివేతపై విమర్శలు
  • కాంగ్రెస్​పై బీఆర్ఎస్, బీజేపీ తీవ్ర ఆరోపణలు
  • గుడిని సందర్శించిన బీఆర్ఎస్ బృందం
  • గుప్తనిధుల కోసమే తవ్వకాలు… హరీశ్​ రావు సంచలన ఆరోపణలు

విధాత ప్రత్యేక ప్రతినిధి | వరంగల్​:

​ Temple Demolition | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం సందర్భంగా  అక్కడ ఉన్న పురాతన గుడి కూల్చివేయడం ఇప్పుడు  రాష్ట్ర స్థాయిలో  రాజకీయంగా మారింది. ఈ సంఘటనపై బీఆర్ఎస్, బీజేపీ  నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  గుప్త నిధుల కోసమే కాంగ్రెస్ నాయకులు, కాంట్రాక్టర్ అర్ధరాత్రి కాకతీయుల నాటి ఈ చారిత్రక శివాలయం కూల్చివేశారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

కూల్చివేత తర్వాత నేలమట్టమైన కాకతీయుల కాలం నాటి శివాలయ రాతి నిర్మాణాలు

అశోక్‌నగర్‌లో ధ్వంసమైన పురాతన దేవాలయ నిర్మాణ భాగాలు

లంకె బిందెల కోసం చేపట్టిన వేటలో భాగంగా గుడి వద్ద 24 అడుగులలోతు తవ్వకాలు చేపట్టారని, ఈ విషయం బయటపడకుండా గుడిని కూల్చివేసి మట్టితో నింపారంటున్నారు.  వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ లో జరిగిన ఈ సంఘటన పై  గత వారం రోజులుగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,  ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు .గుడి కూల్చివేసిన ఈ ప్రాంతంలో వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం స్కూల్ నిర్మాణం కోసం స్థలం చదును చేస్తుండగా ఈ గుడి కూల్చివేత జరిగింది.  ఉద్ధేశ్యపూర్వకంగా జరిగిందా? గుప్త నిధుల కోసం చేశారా?  ఈ పురాతన గుడి ప్రాధాన్యతను గుర్తించకుండా కూల్చివేశారా?  అనే భిన్న కోణాల్లో చర్చ సాగుతోంది. ఈ సంఘటన జరిగిన వెంటనే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూల్చివేత పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంట్రాక్టర్, పనులు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్య శారద సందర్శించారు. ఇది ప్రభుత్వ స్థలమని, పురావస్తుశాఖలో గుడి రికార్డు కాలేదని, జరిగిన పొరపాటును సరిదిద్దుతూ పునర్నర్మాణం చేస్తామంటూ ప్రకటించారు.

ధరణిలో దేవాలయ భూమి – భూభారతిలో ప్రభుత్వ భూమి

గుడి కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలిస్తున్న హరీశ్​ రావు మరియు బీఆర్ఎస్ నాయకులు

అశోక్‌నగర్‌లో గుడి కూల్చివేత ప్రాంతాన్ని సందర్శించిన బీఆర్ఎస్ బృందం

కలెక్టర్​ అన్నట్లు నిజానికి ఇది ప్రభుత్వభూమి కాదని, దేవాలయ భూమేనని స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.  గతంలోనే  ఈ స్థలంలో గుడి ఉన్నట్లు గుర్తించారని, అప్పుడు దేవాలయ భూమిగా ధరణిలో నమోదైందని, ఇటీవలే ఈ భూమిని భూ భారతిలో ప్రభుత్వ భూమిగా మార్పు చేశారని  మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.  స్కూల్ నిర్మాణం పేరుతో ఈ దేవాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని కోసమే 24 అడుగుల లోతు తవ్వకాలు జరిపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ సంఘటన వల్ల రాజకీయ పక్షాల నిరసనలతోపాటు పలువురు నిత్యం అశోక్ నగర్ లోని ఈ పురాతన దేవాలయ స్థలాన్ని సందర్శించడంతో  రద్దీగా మారడంతో పాటు రోజూ పార్టీల నిరసనలతో ఉద్రిక్తత నెలకొంటోంది. ఇప్పటికే ఈ గుడి కూల్చివేత పై బీఆర్ఎస్, బీజేపీ అగ్రనాయకులు  కేటీఆర్, హరీశ్​ రావు, రామచందర్​రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు తీవ్రంగా స్పందించారు. హిందూ దేవాలయాల పై కాంగ్రెస్ పార్టీకి శ్రద్ధ లేదంటూ మండిపడ్డారు.  బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, స్థానిక నాయకులు కూల్చివేత ప్రాంతాన్ని సందర్శించి ఆగ్రహం వ్యక్తం చేసారు. తాజాగా ఈ ప్రాంతాన్ని బీఆర్ఎస్ నేతల బృందం సందర్శించింది.  బీఆర్ఎస్ నేత హరీశ్​ రావు, ఎర్రబెల్లి, వినయ్, పెద్ది తదితరులు ఈ ప్రాంతాన్ని సందర్శించి కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం పై మండిపడ్డారు.

గుప్త నిధుల కోసమే గుడి కూల్చివేత : హరీశ్​ రావు

అశోక్‌నగర్ గుడి కూల్చివేత ఘటనపై మీడియాతో మాట్లాడుతున్న హరీశ్​ రావు మరియు బీఆర్ఎస్ నేతలు

అశోక్‌నగర్ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన హరీశ్​ రావు, ఎర్రబెల్లి, పెద్ది సుదర్శన్​ రెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలు

గుప్త నిధుల కోసమే కాకతీయుల నాటి శివాలయాన్ని ధ్వంసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్  హరీశ్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ పాలనలో గుడుల విధ్వంసం కూడా జరుగుతోందంటూ, కూల్చివేతలు తప్ప కట్టడం ఈ ప్రభుత్వానికి గిట్టడంలేదన్నారు.  నిజాం  భవనాల్లో  నిధులు  దొరకకపోయే సరికి కాకతీయుల గుడుల మీద పడ్డాడంటూ విమర్శించారు. అర్థరాత్రి 12 గంటల నుండి ఒంటి గంట మధ్య, చీకట్లో గర్భగుడి కింద ఏకంగా 24 అడుగుల లోతు భారీ గుంత తవ్వారంటే ఏంటర్థమని మండిపడ్డారు. పాఠశాల కట్టే పనైతే పగలే చేయొచ్చు కదా? అర్ధరాత్రి ఎందుకు తవ్వారని ప్రశ్నిస్తూ, ఈ గుప్త నిధుల వేట రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే జరిగిందని ఆరోపించారు.  పురావస్తు శాఖ జిల్లా అధికారి బుజ్జి ఈ  నెల 7వ తేదీన కలెక్టర్​కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా, ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, యంత్రాలను జప్తు చేయలేదు, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దీని వెనుక పెద్దల హస్తముందన్న హరీశ్​,  దేవాలయ భూమి  భూభారతిలో రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిగా ఎలా మారిందంటూ పశ్నించారు.  ఈ కూల్చివేత, గుప్త నిధుల వేటపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంటిగ్రేటెడెట్  స్కూళ్ల టెండర్లలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. హ్యమ్ రోడ్ల పేరుతో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల్లో 25% ఎక్సెస్​తో కుంభకోణం జరిగిందంటూ హరీష్ రావు ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో హరీశ్​రావుతో పాటు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్​ రెడ్డి, వినయ్​ భాస్కర్​, శంకర్​ నాయక్​ తదితరులు పాల్గొన్నారు.

కూల్చివేతకు ముందు శిథిల శివాలయం(ఫోటోలు):

పురాతన శిల్పకళతో కూడిన అశోక్‌నగర్ శివాలయ ద్వారం

కాకతీయుల కాలం నాటి శిల్ప సంపదను ప్రతిబింబిస్తున్న అశోక్‌నగర్ శివాలయ ద్వారం

కూల్చివేతకు ముందు అశోక్‌నగర్‌లో ఉన్న కాకతీయుల నాటి శివాలయ నిర్మాణ భాగం

అశోక్‌నగర్‌లో కూల్చివేతకు ముందు కనిపించిన పురాతన కాకతీయ శైలిలోని శివాలయ నిర్మాణం

అశోక్‌నగర్‌లో చెట్ల మధ్య నిలిచిన పురాతన కాకతీయ శివాలయ స్తంభాలు

శిల్పకళా వైభవాన్ని చాటిన అశోక్‌నగర్ పురాతన దేవాలయ స్తంభాలు

కూల్చివేతకు ముందు అశోక్‌నగర్ శివాలయం పరిసర ప్రాంత దృశ్యం

కూల్చివేతకు ముందు ప్రశాంత వాతావరణంలో ఉన్న అశోక్‌నగర్ పురాతన శివాలయం

విధ్వంసం తరువాత శివాలయ అవశేషాలు

కూల్చివేత అనంతరం శిథిలాల కుప్పగా మారిన పురాతన కాకతీయ శివాలయం

పురాతన దేవాలయ కూల్చివేత తర్వాత శిథిలాలుగా మిగిలిన అశోక్‌నగర్ ప్రాంతం

అశోక్‌నగర్ గుడి వద్ద తవ్వకాల తర్వాత కనిపిస్తున్న లోతైన గుంత

గుప్తనిధుల ఆరోపణల మధ్య గుడి ప్రాంతంలో కనిపించిన తవ్వకాల గుంత

కూల్చివేత తర్వాత శిథిలాలుగా మారిన అశోక్‌నగర్ కాకతీయ శివాలయ నిర్మాణాలు

ధ్వంసం అనంతరం రాతి శిల్పాలు, స్తంభాలు చెల్లాచెదురుగా కనిపిస్తున్న అశోక్‌నగర్ గుడి ప్రాంతం