ఉత్తమ్ కు సవాల్ విసురుతున్న నీళ్లు..ధాన్యం!

నీటి సమస్యలు, ధాన్యం కొనుగోలు ఒత్తిళ్లు ఉత్తమ్‌కు పెద్ద సవాల్‌గా మారాయి.. రైతుల అసంతృప్తి, కేంద్ర పరిమితులు పరిస్థితిని క్లిష్టం చేస్తున్నాయి.

ఉత్తమ్ కు సవాల్ విసురుతున్న నీళ్లు..ధాన్యం!

విధాత, హైదరాబాద్ :

రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీళ్లు, ధాన్యం కొనుగోలు సమస్యలు సవాల్ విసురుతున్నాయి. కేబినెట్‌లోని మరే మంత్రికీ లేనట్లుగా ఉత్తమ్‌కు తాను నిర్వహిస్తున్న శాఖలే సవాలుగా తయారయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా, గోదావరి నీటి వాటాలు, ప్రాజెక్టుల నిర్మాణ సమస్యలు, భూసేకరణ, నిధుల మంజూరు సమస్యలు ఓ వైపు.. యాసంగి ధాన్యం చెల్లింపులు, రేషన్ బియ్యం సరఫరా సమస్యలు ఇంకోవైపు.. ఉత్తమ్ సామర్ధ్యానికి పరీక్షగా నిలుస్తున్నాయి. రెండున్నరేళ్లుగా తన శాఖల పరిధిలో విపక్షాల నుంచి రైతుల నుంచి ఎదురైన సవాళ్లను విజయవంతగా అధిగమిస్తూ వస్తున్నప్పటికి…ఒక సీజన్‌లో సమస్యలను పరిష్కరించగానే మరో సీజన్ ముంచుకొస్తుండటంతో ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖల నిర్వహణ ఆయనకు నిరంతర పరీక్షగా మారిపోతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

కృష్ణా, గోదావరి నీళ్లతో ప్రతిపక్షాల దాడి

కృష్ణా, గోదావరి నీళ్లలో తెలంగాణ వాటాలు, నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు రైతులకు నీటి సరఫరా సమస్యలను లేవనెత్తుతూ… ప్రతిపక్షాలు తరుచూ మంత్రి ఉత్తమ్ పై దాడికి దిగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా జలాలను సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని, ఏపీ జలదోపిడీకి పరోక్షంగా సహకరిస్తున్నదంటూ అసెంబ్లీ వేదికగా, బయట దాడి కొనసాగిస్తోంది. నల్లమల సాగర్ ప్రాజెక్టును ఏపీ నిర్మిస్తుంటే.. రేవంత్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడ్డుకోవడం లేదని, శ్రీశైలం, నాగార్జున సాగర్ ల నుంచి వాట జలాలను వాడుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడుతోంది. మెదక్, సిద్దిపేట జిల్లాల రైతులకు నీళ్లు ఇవ్వడంలేదంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ముందుకు సాగడం లేదని, ఎస్ఎల్బీసీపై కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తోంది. తాజాగా కాళేశ్వరం, దేవాదుల మోటర్ల నిర్వహణ సక్రమంగా లేదంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు.

దీటైన సమాధానం..

ఇరిగేషన్ అంశాలపై బీఆర్ఎస్ లేవనెత్తిన అభ్యంతరాలు, చేసిన విమర్శలను.. మంత్రి ఉత్తమ్ ఎప్పటికప్పుడు దీటుగా తిప్పికొడుతునే ఉన్నారు. అయితే ప్రతి సీజన్ లోనూ ఇరిగేషన్ అంశాలపై వివరణ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి నెలకొనడం ఉత్తమ్‌కు ఇబ్బందికరంగా పరిణమించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇరిగేషన్‌ అంశాలు… వర్షాలు, వరదలతో…. పొరుగు రాష్ట్రాలతో, కేంద్ర జలసంఘంతో, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటాయి. ఇవి ఒక్కో సీజన్‌కు ఒక్కోరకంగా మారిపోతుండటంతో తగిన సమాచారంతో ప్రతిపక్షాలకు, ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్తమ్ కు ఎప్పటికప్పుడు పరీక్షగా ఉంటోంది. ప్రస్తుత వేసవిలో నీటి కొరత, రానున్న వర్షాకాలంలో వరదల పరిస్థితుల రూపంలో మరోసారి ఇరిగేషన్ మంత్రి ముందు మరిన్ని సమస్యలు ఎదురుకానున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు..రైతులకు డబ్బుల చెల్లింపులు, సన్న బియ్యం బోనస్, కస్టమ్ మిల్లింగ్, రేషన్ బియ్యం సరఫరా వంటి సమస్యలను అధిగమించే క్రమంలోనే.. రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ఇప్పుడు ఉత్తమ్‌కు తలనొప్పులు తెచ్చిపెడుతున్నది. కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియలో మిల్లర్ల అక్రమాలపై చర్యలతో పాటు, ధాన్యం కొనుగోలు, ఎగుమతుల వ్యవహారం సమస్యల పరిష్కారానికి మంత్రి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

సవాల్ గా ధాన్యం కొనుగోలు

ప్రధానంగా ప్రస్తుతం యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలైంది. అయితే మంత్రి ఉత్తమ్ సొంత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ధాన్యం కొనుగోలు సమస్యలపై రైతులు రోడ్డెక్కడం గమనార్హం. మిల్లర్లు సిండికేట్‌గా మారిపోయి… ధాన్యం కొనుగోలు ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సరిహద్దు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ధాన్యం జిల్లాలోని మిల్లులకు తరలివస్తుందని, దీంతో తమ ధాన్యం కొనుగోలులో మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు.

కేంద్రం అనుమతి 52 లక్షల టన్నులు..వచ్చేది 70లక్షల టన్నులు

యాసంగి సీజన్ లో రాష్ట్రం నుంచి కేంద్రం 35 లక్షల టన్నుల బియ్యం అంటే.. సుమారు 52 లక్షల టన్నుల ధాన్యం… సేకరించేందుకు అనుమతించింది. ఈ సీజన్ దొడ్డు, సన్నరకం ధాన్యం కలిపి 1.21 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు కొనేదిపోను … 70 లక్షల టన్నుల పైచిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8,200 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం క్వింటాకు ‘ఏ’ గ్రేడ్‌ ధాన్యానికి రూ.2,320గా, సాధారణ రకానికి రూ2,300గా మద్దతు ధర ప్రకటించింది. కేంద్రం ఇచ్చిన అనుమతి కంటే మరో 20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మంత్రిగా ఉత్తమ్ కు సవాల్ గా నిలువనుంది. దీనిపై మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ ఖరీఫ్ సీజన్ లో కేంద్రం 56లక్షల మెట్రిక్ టన్నులకే అనుమతించినప్పటికి 70లక్షల టన్నులు కొనుగోలు చేశామని, అదే పద్దతిలో యాసంగి ధాన్యం కూడా ప్రతి గింజ కొంటామని తెలిపారు.

మరో సవాల్ గా సన్న బియ్యం సమీకరణ

అలాగే రాష్ట్రం నుంచి సెంట్రల్‌పూల్‌ (కేంద్ర ప్రభుత్వ కోటా)కు 35 లక్షల టన్నుల బియ్యం ఇచ్చే క్రమంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వడ్లను మిల్లులకు పంపించి అక్కడ మరాడించాక వచ్చే బియ్యాన్ని సెంట్రల్‌పూల్‌ కింద ఎఫ్‌సీఐకి ఇస్తారు. దీంతో పాటు రాష్ట్ర కోటాకు కూడా బియ్యం అవసరం ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి ఒకేసారి మూడు నెలల రేషన్ కోటా సన్నబియ్యం లబ్దిదారులకు సరఫరా అవుతుంది. ఖరీఫ్‌ (వానాకాలం) సీజన్‌లో సేకరించిన సన్న ధాన్యం సంవత్సరమంతా సరిపోదు. ఈ నేపథ్యంలో కేంద్రానికి దొడ్డు బియ్యాన్ని మాత్రమే ఇచ్చి..సన్న బియ్యం రాష్ట్ర అవసరాలకు వినియోగించాలని పౌరసరఫరా శాఖ నిర్ణయించింది. సన్నవడ్లపై క్వింటాకు రూ.500 బోనస్‌ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్న నేపథ్యంలో రైతుల నుంచి సేకరించే సన్నవడ్లను పూర్తిగా రాష్ట్ర అవసరాలకు వాడుకుని, దొడ్డు వడ్లతో వచ్చే బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వడం ద్వారా రేషన్ బియ్యం సరఫరా సమస్యను అధిగమించవచ్చు. అయితే ఇదంతా పక్కాగా నిర్వహించడం పౌరసరఫరా శాఖ మంత్రిగా ఉత్తమ్ కు కీలకం కానుండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

ఘోస్ట్​ మర్మర్: మీ గుండె కొట్టుకుంటే… మేము కనుక్కుంటాం! – అమెరికా సంచలన టెక్నాలజీ

భారతదేశంలో ఎవరి చేతిలో ఎంత భూమి ఉంది? అసమానతలపై షాకింగ్‌ రిపోర్ట్‌