Loksabha Elections 2024 | నీరుగారిపోతున్న మోదీ నినాదాలు!
ప్రధాని నరేంద్రమోదీ ముస్లింల కోసం విపక్షాలు 'ముజ్రా' డ్యాన్స్ చేస్తాయంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నది. ప్రతిపక్ష నేతలు మోదీపై విరుచుకుపడుతున్నారు.

ముజ్రా డ్యాన్స్ వ్యాఖ్యలపై దుమారం
ముగింపు దశకొచ్చిన ఎన్నికలు
తీవ్ర ఆందోళనలో ప్రధాని మోదీ
గల్లీ లీడర్ స్థాయిలో విమర్శలు
మండిపడుతున్న ప్రతిపక్షాలు
(విధాత ప్రత్యేకం)
ప్రధాని నరేంద్రమోదీ ముస్లింల కోసం విపక్షాలు ‘ముజ్రా’ డ్యాన్స్ చేస్తాయంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నది. ప్రతిపక్ష నేతలు మోదీపై విరుచుకుపడుతున్నారు. తుది దశ పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రధానిలో ఆందోళన కనిపిస్తున్నదని, అందుకే మోదీ చవకబారు ఉపన్యాసాలకు సైతం వెనుకాడటం లేదని విమర్శిస్తున్నారు. ‘మోదీ గ్యారెంటీ’, ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ నినాదాలు నీరుకారిపోతున్నాయనేది యోగేంద్ర యాదవ్ సహా అనేకమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. విపక్ష నేతలపై ప్రధాని తన స్థాయి మరిచి దిగజారి చేస్తున్న విమర్శలపై పౌర సమాజం నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ఆయన ఢిల్లీ నేతలా కాకుండా గల్లీ లీడర్‌లా ఓట్ల కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రజాస్వామికవాదులు సైతం మండిపడుతున్నారు.
ప్రధాని వ్యాఖ్యలపై విపక్ష నేతల కౌంటర్
మోదీ లాంటి బలమైన నేత నేతృత్వంలోనే దేశం సుభిక్షంగా, భద్రంగా ఉంటుందని బీజేపీ నేతలు వాదనలు చేస్తున్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికి ఒకరు ప్రధాని పదవి పంచుకుంటారని, వాళ్లలో సమర్థులు లేరని ప్రధాని చేస్తున్న ప్రచారానికి విపక్ష నేతలు వేస్తున్న కౌంటర్లకు మోదీ మౌనం వహించడం మినహా సమాధానం చెప్పే స్థితిలో లేరు. పీవోకే గురించి మాట్లాడుతున్న ప్రధాని, బీజేపీ నేతలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఘాటుగానే బదులిచ్చారు. ‘నాటి భారత ప్రభుత్వం (కాంగ్రెస్ హయాంలో) పాకిస్థాన్‌తో పోరాడి బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టింది.
భారత్ భూభాగాలను చైనా ఆక్రమించింది. ఇక్కడ రోడ్లు, ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. అయినా.. దీనిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మీ 56 ఇంచుల ఛాతీ ఎక్కడ ఉన్నది?’ అని ఖర్గే ప్రశ్నించారు. మోదీ ‘ముజ్రా’ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఉపయోగించదగిన భాషేనా ఇది? అని ప్రశ్నించారు. ‘చైనా మన భూభాగాన్ని సుమారు 2 వేల చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించింది. కానీ ఆ విషయంలో మోదీ ఏమీ చేయలేదు. నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆక్రమణల అంశంలో స్పందించకుండా ఆయనేమైనా డిస్కో డ్యాన్స్ చేస్తున్నారా?’ అంటూ ఎద్దేవా చేశారు. ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్ స్పందిస్తూ.. ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడే ప్రసంగాలు తడబడుతాయని అన్నారు.
అసహనంతోనే మోదీ అలాంటి వ్యాఖ్యలు!
పనిచేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నినాదాలు, భావోద్వేగ ప్రచారాలతోనే నెట్టుకురావొచ్చని బీజేపీ జాతీయ నేతల ఆలోచన. వాట్సాప్‌లో అబద్ధాలు ప్రచారం చేయండంటూ సాక్షాత్తూ అమిత్‌షానే తమ పార్టీ శ్రేణులకు గతంలో పిలుపునిచ్చారు. 2014లో అచ్ఛే దిన్, 2019లో మోదీ ఉంటేనే సాధ్యం (మోదీ హైతో ముమ్కిన్ హై) నినాదాలతో నెట్టుకొచ్చామని ఆ పార్టీ నేతల భావన. అయితే 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను బీజేపీ నాడు ప్రచారాస్త్రాలుగా ఎంచుకున్నది. ప్రజలు కూడా ఆదరించి సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఒకే పార్టీకి సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టారు.
దేశంలో జరిగిన ఉగ్రవాదుల దాడులు, కేంద్రం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, దేశ భద్రత అనే అంశంతో పాటు మోదీ నినదించిన నేను కాపాలాదారు ‘మై బీ చౌకీదార్’ అన్నవి జనంలోకి వెళ్లాయి. 2014, 2019లలో బీజేపీ నినాదాలను ఆ పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశాయి. వాటిని ట్రెండింగ్ గా మార్చాయి. 2014 నుంచి 2019 మధ్య కాలంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ చాలా రాష్ట్రాల్లో ఓడిపోయినా లోక్‌సభ ఎన్నిలకు వచ్చేసరికి ఆయన నాయకత్వానికే ప్రజలు గంపగుత్తగా ఓట్లు వేసే పరిస్థితి (అబద్ధాలనైనా ప్రచారం చేసి)ని క్రియేట్ చేయడంలో కొంత సఫలమయ్యారు. దీంతో 2014 కంటే మించి ఏకంగా 303 స్థానాలు కట్టబెట్టారు.
కానీ ఈ పదేళ్ల కాలంలో బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం, కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు కొంతమంది కార్పొరేటర్లకు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం, రైతులను, నిరుద్యోగులను, మహిళల భద్రత, కనీస మద్దతు ధర, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల వంటివి 2024లో ఈసారి 400లకు పైనే (అబ్ కీ బార్ 400 పార్) నినాదాన్ని అధిగమించాయని ఆరు దశల పోలింగ్ సరళిని బట్టి రాజకీయ విశ్లేషకులు, సెఫాలజిస్టులు చెబుతున్నారు. అందుకే మోదీ ఈ ఫస్ట్రేషన్‌లోనే విపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలకు, వారిని మానసికంగా దెబ్బతీసేందుకు ప్రచారంలో ‘ముజ్రా’ వంటి మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు.
పదేళ్ల వైఫల్యాలను ఎండగట్టిన ప్రతిపక్షాలు
పదేళ్ల పాలనా వైఫల్యాలు, బీజేపీ నేతల అబద్ధాలను ఎండగట్టడంలో విపక్ష నేతలు విజయవంతమయ్యారనే అభిప్రాయాలు సర్వత్రా ఉన్నాయి. భావోద్వేగాల ద్వారా ఓట్లు దక్కించుకోవాలనే వారి వ్యూహాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. వారి విమర్శలకు ధీటుగా సమాధానమిస్తూనే సమస్యలను ఏకరువు పెడుతున్నారు. అందుకే ఈసారి ప్రజల ఆలోచనలోనూ మార్పు వచ్చిందని, బీజేపీ నినాదాల కంటే వాస్తవాలనే పరిగణనలోకి తీసుకుంటున్నారని అంటున్నారు. దానికి అగుణంగానే తమ తీర్పును చెప్పబోతున్నారని తెలుస్తోంది. మళ్లీ మోదీ వస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుందో విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమే అనేలా బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉంటున్నాయి. అందుకే 2014, 2019 నాటి నినాదాలు ఇప్పుడు పనిచేయబోవడం లేదని తేలిపోతున్నదని అంటున్నారు.