Loksabha Elections 2024 | మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలేంటి?
మరొక్క దశ పోలింగ్ మాత్రమే మిగిలి ఉన్నది. ఏడు దశల లోక్‌సభ ఎన్నికల సమరాంగణం ముగింపునకు వస్తున్నది. జూన్ 1వ తేదీన జరిగే ఆఖరి దశ పోలింగ్ అనంతరం ఎగ్జిట్‌పోల్స్ వెల్లువెత్తనున్నాయి.

కనిష్ఠంగా 210.. గరిష్ఠంగా 310
ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లు అవసరం
సొంతగా సాధిస్తే మోదీకి సమస్య లేదు
బొటాబొటీ సీట్లతో మిత్రులపైనే భారం
మెజార్టీకి దూరంగా ఉండిపోతే?
ఇతర పక్షాలతో కలిసి సంకీర్ణం ఏర్పడితే?
దానికి మోదీ నాయకత్వం వహిస్తారా?
కొత్త ప్రధానిని ఆరెస్సెస్ ఎంపిక చేస్తుందా?
రాజకీయ విశ్లేషకుల్లో జోరుగా చర్చలు
న్యూఢిల్లీ : మరొక్క దశ పోలింగ్ మాత్రమే మిగిలి ఉన్నది. ఏడు దశల లోక్‌సభ ఎన్నికల సమరాంగణం ముగింపునకు వస్తున్నది. జూన్ 1వ తేదీన జరిగే ఆఖరి దశ పోలింగ్ అనంతరం ఎగ్జిట్‌పోల్స్ వెల్లువెత్తనున్నాయి. లక్షల మంది ఓటర్లలో కొన్ని వేల నమూనాలు మాత్రమే సేకరించిన రూపొందించే ఎగ్జిట్‌పోల్స్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రజాస్పందన స్పష్టంగా తెలిసిపోయిన సందర్భాలు మినహా మిగిలిన సమయాల్లో ఎగ్జిట్‌పోల్స్ బోల్తా కొట్టిన ఉదంతాలు కొత్తేమీ కాదు. ఇదిలా పక్కనపెడితే.. జూన్ 4న నిర్వహించే ఫలితాలు.. అంతిమంగా ప్రజా తీర్పును ప్రకటిస్తాయి.
మోదీ మూడోసారి ప్రధాని అవుతారా? లేదా? బీజేపీ ఊదరగొడుతూ వచ్చిన చార్ సౌ పార్ నిజమవుతుందా? లేదా? బీజేపీ సాధారణ మెజార్టీ సాధిస్తుందా? లేక పలువురు విశ్లేషకులు చెబుతున్నట్టు ఎన్డీయే సైతం మెజార్టీకి దూరంగానే ఉండిపోతుందా? 20 ఏళ్ల క్రితం చరిత్రను పునరావృతం చేస్తూ ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తుందా? అనేది తేలిపోతుంది. 543 స్థానాలు ఉన్న లోక్‌సభలో 272 స్థానాలు గెలిచిన పార్టీ లేదా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ ఫలితాల కోసం అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. స్థూలంగా బీజేపీకి కనిష్ఠంగా 210 నుంచి గరిష్ఠంగా 310 సీట్లు వచ్చే అవకాశం ఉన్నదనే చర్చలు ఉన్నాయి. అయితే.. ఈ పరిస్థితి నుంచి రాజకీయ విశ్లేషకులు మూడు రకాల పరిస్థితులను అంచనా వేస్తున్నారు.
సీన్ 1
కొనసాగనున్న నిరంకుశత్వం!
సాధారణ మెజార్టీ దాటి.. 272 నుంచి 310 సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం. కొంతమంది రాజకీయ విశ్లేషకులు 2019 నాటి ఫలితాలనే బీజేపీ తిరిగి సాధించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ పార్టీకి 303 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. వాటిలో 30 తగ్గినా.. బీజేపీ సాధారణ మెజార్టీ కలిగి ఉంటుందని, దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇబ్బందులు ఏమీ ఉండబోవని, సహజంగానే మోదీ తాను ఈ దేశాన్ని గొప్ప స్థితికి ఎలా తీసుకొచ్చిందీ ఉపన్యాసాలు దంచుతారని ఒక రాజకీయ విశ్లేషకుడు చెప్పారు.
బీజేపీకి గణనీయంగా తగ్గిపోయిన సీట్ల సంఖ్యకు మసిపూసి మాసి మారేడుకాయ చేసి.. ఆహా ఓహో అంటూ భజనలు ప్రారంభిస్తాయని అన్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 2014లో ఒక పార్టీ సాధారణ మెజార్టీని సాధించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 31 శాతం ఓట్లతో 282 సీట్లు సాధించింది. వాస్తవానికి 2009 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ 18.8శాతం ఓట్లు పొందింది. అంటే.. తదుపరి ఎన్నికల నాటికి ఆ పార్టీకి 12శాతం ఓట్లు మాత్రమే పెరిగాయి. నరేంద్రమోదీ, అమిత్‌షా నాయకత్వంలోని బీజేపీకి ఎన్నికలకు సంబంధించిన సాంకేతిక అంశాలు, వ్యవస్థాగత అంశాలపై పూర్తి పట్టు ఉన్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రతిపక్షాల ఐక్యతను ఎలా విచ్ఛిన్నం చేయాలో కూడా వారికి బాగా తెలుసని గత సందర్భాలను ఉదహరిస్తున్నారు. అందుకు నిదర్శనంగా 2014 ఎన్నికలను ప్రస్తావిస్తున్నారు. ఆ ఎన్నికల్లో యూపీలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 20 శాతం ఓట్లు సాధించింది. కానీ.. ఒక్క సీటు కూడా గెలువలేక పోయిందని గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ 37.36 శాతం ఓట్లతో 303 సీట్లు గెలుపొందింది. 2024 ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ అబ్ కీ బార్ చార్ సౌ పార్ అని నినాదం ఇచ్చింది.
అయితే.. లోక్‌సభ ఎన్నికలు మొదలైన తర్వాతి తొలి మూడు దశల్లో అంత సీన్ లేదని, 300 దాటితే గొప్పేనని క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే.. మొదటి అంచనాలో నిరంకుశవాదం నుంచి మళ్లించడం కష్టంగానే కనిపిస్తున్నదని అంటున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున చేసిన ప్రచారం నేపథ్యంలో మైనార్టీల పట్ల శత్రుత్వ వైఖరి కూడా పెరిగే అవకాశం ఉన్నదని వారు చెబుతున్నారు.
యోగి ఆదిత్యనాథ్‌కు చెక్!
ఇక్కడ బీజేపీ అంతర్గత రాజకీయాలను కూడా పరిశీలించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ సర్వశక్తిమంతుడిగా ముందుకు వస్తే.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్థానం సందేహాస్పదంగా ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే.. మోదీ కాలపు బీజేపీలో విధేయులైన నాయకుల జాబితాలో యోగి లేరని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా.. భవిష్యత్తులో బీజేపీలో అమిత్‌షా తర్వాత ప్రధాని అయ్యేందుకు ఆదిత్యనాథ్‌కే అవకాశాలు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ సీట్లు వచ్చినప్పటికీ.. యూపీలో సీట్ల సంఖ్య తగ్గితే దానికి యోగి బాధ్యత వహించాల్సి రావచ్చని అంటున్నారు. అదే సమయంలో యూపీలో మరోసారి క్లీన్ స్వీప్ చేసినప్పటికీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. బీజేపీ అధిష్ఠానం యోగిని తప్పించే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. బొటాబొటీ మెజార్టీ వస్తేనే యోగిని కదిపే పనికి బీజేపీ సాహసించదని అంటున్నారు.
సీన్ 2
మిత్రుల దయాదాక్షిణ్యాలపై మోదీ ఆధారపడతారా?
బీజేపీకి 240 నుంచి 260 మధ్య సీట్లు వచ్చి, మెజార్టీ కోసం ఎన్డీయేలోని ఇతర భాగస్వామ్య పక్షాల మద్దతుపై ఆధారపడాల్సి వస్తే ఏంటనేది మరో అంశం. ఎన్డీయేకుసైతం తగిన సంఖ్యాబలం రాని పక్షంలో మోదీ మేనేజర్లు ఇప్పటికే కేసులను ఎదుర్కొంటున్న తెలంగాణ, ఏపీలోని పార్టీలపై దృష్టి కేంద్రీకరిస్తారని అంచనా వేస్తున్నారు. ఫలితాలు వెలువడిన మరుక్షణమే బీజేపీ ‘ఆపరేషన్ కమల్’ను ప్రారంభిస్తుందనే అంచనాలూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో ఇతర పార్టీలను బీజేపీ చీల్చిన సందర్భాలను వారు గుర్తు చేస్తున్నారు. రెండో అంచనా ప్రకారం అధికారంలోకి వచ్చే మోదీ ప్రభుత్వం.. సొంతగా సంఖ్యాబలం కలిగి ఉండదు.
అదే జరిగితే.. తానే సర్వమని, తన దయపైనే ఇతర పార్టీలు ఆధారపడి ఉంటాయని భావించే మోదీ.. ఇతర పార్టీలపై ఆధారపడి పరిపాలన కొనసాగించాల్సిన మానసిక పరిస్థితిని ఎదుర్కొనడం ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు. గుప్పెడు మంది ఎంపీలు ఉండే ఏక్‌నాథ్ షిండే లేదా నితీశ్‌కుమార్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి లేదా చంద్రబాబు వంటివారి దయాదాక్షిణ్యాలపై మోదీ ఆధారపడాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. మోదీ లాంటి వ్యక్తిత్వం ఉన్నవారికి ఇది ఇబ్బందికర పరిస్థితే అవుతుందని చెబుతున్నారు. అయితే.. అంతటి పరిస్థితిలో కూడా భాగస్వామ్య పక్షాలను, మద్దతు ఇచ్చిన శక్తులను తమ కనుసన్నల్లో మెదిలేలా చేసుకోగల సత్తా మోదీ, అమిత్‌షాకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
సీన్ 3
పార్టీపై మళ్లీ ఆరెస్సెస్ ఆధిపత్యం?
బీజేపీకి 210 నుంచి 230 సీట్లు వచ్చి, అయినా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తే ఏం జరుగుతుందనేది మరో ఆసక్తికర పరిణామం. సహజంగానే ఏకైక పెద్ద పార్టీ కనుక ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తొలి సంకీర్ణ ప్రభుత్వం వాజపేయి నాయకత్వంలోనిది. 1999 నుంచి 2004 వరకు ఆ ప్రభుత్వం కొనసాగింది. ఆ సమయంలో బీజేపీకి వచ్చిన సీట్లు 182 మాత్రమే. అయితే.. ఆ రోజుల్లో వాజ్‌పేయి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ప్రభుత్వాన్ని నడిపారని సీనియర్ జర్నలిస్టు ఒకరు చెప్పారు. కానీ.. మోదీకి అటువంటి ఇచ్చిపుచ్చుకునే అలవాటు లేదని ఆయన అన్నారు. ఇక్కడ ఆరెస్సెస్ చర్యలు కూడా కీలకంగా మారుతాయని ఆయన తెలిపారు.
వాస్తవానికి మోదీ తన పదేళ్ల పాలనా కాలంలో ఆరెస్సెస్‌ను పక్కకు నెట్టేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ.. ఆరెస్సెస్ మౌనంగానే ఉంటూ వచ్చిందని, అనేక మంది అవినీతిపరులను పార్టీలోకి తీసుకున్నా నోరెత్తే సాహసం చేయలేదని సీనియర్ జర్నలిస్టు గుర్తు చేశారు. మోదీ చరిష్మా పనిచేయని పరిస్థితుల్లో ఆరెస్సెస్ మళ్లీ పార్టీపై ఆధిపత్యం చెలాయిస్తుందని, నాయకత్వ మార్పునకు సిద్ధపడినా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు. అదే జరిగితే.. ఆరెస్సెస్‌కు అత్యంత విధేయుడిగా పేరున్న నితిన్ గడ్కరీ లేదా రాజ్‌నాథ్‌సింగ్ పేర్లు తెరపైకి రావచ్చని అంచనా వేశారు.
నిజానికి పార్టీకి అధ్యక్షులుగా వీరిద్దరినీ గతంలో ఆరెస్సెస్ ప్రతిపాదించింది. ఈ పరిస్థితిలో మహారాష్ట్రలోని బడా పెట్టుబడిదారులు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. మోదీ బదులుగా మరో నాయకుడిని ఎంపిక చేసి, ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలను బీజేపీవైపు తిప్పే అవకాశాలు ఉండొచ్చిన ఆయన అంచనా వేశారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడేకంటే.. మోదీ రహిత బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వారు మొగ్గు చూపుతారని, తద్వారా తమ ప్రయోజనాలు రక్షించేందుకునేందుకు ఆఖరి నిమిషం వరకూ ప్రయత్నిస్తారని ఆయన విశ్లేషించారు.
మోదీ తన ఎన్నికల ప్రచారంలో అకస్మాత్తుగా అదానీ, అంబానీలపై దాడి చేసిన విషయాన్ని ఇక్కడ మరువరాదని ఆయన అన్నారు. ఒకవేళ రాజకీయ యవనికపై నుంచి మోదీని తప్పిస్తే.. సంకీర్ణ కూటమి ఏర్పాటులో ఎలాంటి పరిణామాలైనా చోటు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ స్వశక్తితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? లేక సంకీర్ణాలు మళ్లీ మొదలవుతాయా? అది ఏ పార్టీ సారథ్యంలో అనేది తేలాలంటే.. జూన్ 4 వరకూ ఆగక తప్పదు.