Cabinet Expansion | క్యాబినెట్‌లో గ్రేటర్‌కు చోటిస్తారా? రంగారెడ్డి జిల్లా పరిస్థితేంటి?
అతి త్వరలో తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఖాయం అనుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నగరం, పెద్ద జిల్లా అయిన తమ నేతలకు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఒక మంత్రి ఉండటం అవసరమని స్పష్టం చేస్తున్నారు.

హైదరాబాద్, మే 28 (విధాత)
Cabinet Expansion | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఏడాదికాలంగా చర్చ జరుగుతున్నది కానీ కార్యరూపం దాల్చడం లేదు. ఒక కోటి మందికి పైగా జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఈ రెండు ప్రాంతాలపై కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు పెత్తనం సాగించడంతో ఇబ్బంది పడుతున్నామని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో చేపడుతారని చెబుతున్న మంత్రివర్గ విస్తరణలో రెండు జిల్లాలను విస్మరిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని కార్యకర్తలే వ్యాఖ్యానిస్తుండటం విశేషం.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చెబుతారు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా గెలుపొందలేదు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్ తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి నుంచి టీ రామ్మోహన్ రెడ్డి, పరిగి నుంచి బీ మనోహర్ రెడ్డి, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ గెలుపొందారు. చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, టీ ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ నుంచి పార్టీ ఎమ్మెల్యే ఎవరూ లేకపోవడంతో మాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయిన దానం నాగేందర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున ఇద్దరు నాయకులు చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే మంత్రి పదవితో పాటు సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. అదే పనిగా వారు వెంటపడటంతో నాగేందర్ కూడా సరే అని అనక తప్పలేదు.
నెలల తరబడి విస్తరణ లేదు.. పైగా హైడ్రా దూకుడు!
నెలలు గడుస్తున్నా మంత్రివర్గ విస్తరణ ఊసు లేకపోవడం, తన నియోజకవర్గంలో ఇతర కాంగ్రెస్ నాయకుల పెత్తనంతో నాగేందర్ ఒకింత ఆగ్రహానికి గురయ్యారని వార్తలు వచ్చాయి. తన నియోజకవర్గం చింతలబస్తీలో హైడ్రా అధికారులు ఆక్రమణ పేరుతో కూల్చివేతలు చేపట్టడంతో నాగేందర్ మరింత ఆవేశానికి లోనయ్యారు. ఒకనొక సందర్భంలో కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశానా? అని సన్నిహితుల వద్ద బాధపడ్డారని తెలిసింది. ఇదిలా ఉంటే.. తాజా పరిణామాల్లో క్యాబినెట్ విస్తరణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో ఎలాంటి వార్తలు రావడం లేదు. మిగతా జిల్లాల నుంచి పలానావాళ్లకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని, కుల సమీకరణల నేపథ్యంలో పలానా వాళ్లకు పదవి రానున్నదని ప్రచారం మాత్రం జోరుగా సాగుతున్నది. ముస్లిం మైనారిటీ నుంచి ఎమ్మెల్సీ, సియాసత్ పత్రిక అధినేత అమేర్ అలీఖాన్ పేరు ప్రముఖంగా విన్పిస్తున్నది. ఎంఐఎంతో సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అమేర్ అలీకి అవకాశం ఇవ్వకపోవచ్చనే వాదన కూడా ఉన్నది. ఒకవేళ ఇస్తే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. జీహెచ్ఎంసీ పాలక వర్గం ఈ సంవత్సరం ఆఖరుతో ముగుస్తున్నది. ఆ వెంటనే ఎన్నికలు నిర్వహించకపోయినా, మరో ఆరు నెలలకు నిర్వహించక తప్పదు. ఆ లోపు కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేసి, సిద్ధం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌కు మంత్రివర్గంలో చోటు ఇవ్వకుండా ఎన్నికల్లో ఏం ప్రచారం చేస్తారోననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు తప్పేలా లేవని అంటున్నారు.
స్పీకర్ పదవితో సరిపెడతారా!
రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసాద్ కుమార్‌ను అసెంబ్లీ స్పీకర్‌గా ఎంపిక చేశారు. జిల్లా నుంచి సముచిత స్థానం లభించిందని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సంబురపడ్డారు. మరో మంత్రి పదవి కూడా దక్కుతుందని అనుకున్నారు. కానీ ఏడాదిన్నర అవుతున్నా ఉలుకూ పలుకూ లేదు. ఇక్కడి నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి పదవులు ఆశిస్తున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య.. మాదిగ కులం కోటాలో మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారని సమాచారం. ఇంత పెద్ద జిల్లాకు ఒక్క స్పీకర్ పదవి ఇస్తే సరిపోతుందా? అని రంగారెడ్డి జిల్లా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆదాయం రావడంతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని, అలాంటి తరుణంలో ప్రభుత్వంలో సముచిత గౌరవం ఇవ్వరా? అని అడుగుతున్నారు.
త్వరలో కార్పొరేషన్ల విలీనం.. పునర్వ్యవస్థీకరణ!
ఇప్పుడున్న జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మునిసిపల్ కార్పొరేషన్లు, మరికొన్ని గ్రామాలను విలీనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్‌లో పాలకవర్గం పదవీకాలం పూర్తయిన వెంటనే ప్రభుత్వం కార్పొరేషన్లను విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నది. ఆ తరువాత రెండు లేదా నాలుగు గ్రేటర్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ఎన్నికలకు వెళ్లాలనే యోచన ఉందని తెలుస్తున్నది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి, ఎన్నికల్లో సమాయత్తం చేయడానికి రంగారెడ్డి జిల్లా లేదా నగరం నుంచి ఒక సీనియర్ మంత్రి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ నాయకత్వం అభిప్రాయపడుతున్నది.
రెండు జిల్లాల్లో కరీంనగర్ మంత్రుల పెత్తనం
హైదరాబాద్ జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లాలో ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరినీ రేవంత్ రెడ్డి నియమించారు. అయితే.. వారి ఆధిపత్యం కోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏదైనా ఇబ్బంది వస్తే ఏ మంత్రి వద్దకు వెళ్లాలో అర్థం కావడం లేదని అంటున్నారు. గతంలో మాదిరి బీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేల హవా నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు జరిగే ఎన్నికలకు వీరితో ఎలా వెళ్తారో చూస్తామని కుతకుతలాడుతున్నారు. తమ సహాయ, సహకారాలు లేకుండా గ్రేటర్‌లో పార్టీ కార్పొరేటర్లను గెలిపించుకోవడం అంత సులువు కాదని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఆలోచించాలని కోరుతున్నారు.