Congress Organizational Changes | కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక ట్విస్ట్.. ప్రక్రియను రివర్స్ చేసిన పార్టీ పెద్దలు!
సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా మండల, జిల్లా, రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కమిటీల ఏర్పాటు విషయమై ఆగస్టు 23న జరిగే పీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేని కమిటీలను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతానికి భిన్నంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఉండబోతున్నదని అంటున్నాయి.

Congress Organizational Changes | హైదరాబాద్, ఆగస్ట్ 18 (విధాత) : సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా మండల, జిల్లా, రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కమిటీల ఏర్పాటు విషయమై ఆగస్టు 23న జరిగే పీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేని కమిటీలను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతానికి భిన్నంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఉండబోతున్నదని అంటున్నాయి. గ్రామ, మండల, జిల్లా కమిటీలన్నీ పూర్తైన తర్వాత రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తారు. గతంలో పీపీసీ పూర్తి కార్యవర్గం ప్రకటించేవారు. దాని తర్వాత జిల్లా, మండల, గ్రామ కమిటీల నియామకం ఉండేది. అయితే ఈ సారి క్షేత్ర స్థాయి నుంచి కమిటీల నియామకం ప్రారంభించారు. జిల్లాల్లో ఈ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా ఇన్‌చార్జ్‌లను కూడా నియమించారు. ఆగస్టు 23న నిర్వహించే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో కమిటీల నియామకం గురించి చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో కొన్ని కమిటీల ఏర్పాటు పూర్తికావచ్చింది. వివాదం లేని కమిటీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. సంస్థాగత ప్రక్రియ ఏ మేరకు పూర్తి చేశారనే విషయాలతో పాటు కమిటీలపై చర్చించనున్నారు. గత నెలలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావించారు. కానీ.. అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి.
స్థానిక సంస్థల ఎన్నికలపై తర్జన భర్జన
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రిజర్వేషన్ల అంశం తేలేలా లేదు. అసెంబ్లీ బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పార్టీల్లోనే బీసీలకు 42 శాతం టికెట్లు ఇద్దామనే ప్రతిపాదన పెట్టే యోచనలో కాంగ్రెస్ ఉందనే ప్రచారం సాగుతోంది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో పీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ వీ హనుమంతరావు భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయమై చర్చించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం తేలకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లొద్దని గతంలో జరిగిన క్యాబినెట్ సమావేశం అభిప్రాయపడింది. అయితే సెప్టెంబర్ 30 లోపుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఏం చేయాలనే దానిపై పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
నామినేటెడ్ పదవుల భర్తీ
రాష్ట్రంలో 35 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. మిగిలినవాటిపై కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటింది. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు దక్కిన సంతృప్తి ఉండేదనే చర్చ ఉంది. వీటి భర్తీపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్ర నాయకులతో చర్చించారని సమాచారం. గతంలో అవకాశం దక్కనివారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నామినేటెడ్ పదవులకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, స్థానిక నాయకులు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి ఇవ్వాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అయితే కొన్నిచోట్ల ఏకాభిప్రాయం కుదరడం లేదని, మరికొన్ని చోట్ల సామాజిక సమీకరణాల అంశం తెరమీదికి వస్తున్నదని సమాచారం. వీటన్నింటిని పరిష్కరించి జాబితాను ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నెలాఖరులోపుగా నామినేటేడ్ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. నామినేటేడ్ పదవుల భర్తీపై కూడా పీఏసీలో చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి..
Dharmasthala Files | ధర్మస్థల ఖననాల కేసు : సిట్ మధ్యంతర నివేదిక లేనట్టే!
CP Radhakrishnan | ఉపరాష్ట్రపతి పదవికి సీపీ రాధాకృష్ణన్ పేరు ఖరారు చేసిన ఎన్ డీ ఏ
Vote Theft | రాహుల్ ఆటం బాంబుతో కిందికి మీదికైతున్న ఎన్నికల సంఘం
King Cobra Bite | 15 ఏండ్ల బాలుడికి నాగుపాము కాటు.. 2 గంటల్లో 76 ఇంజక్షన్లు.. మరి బతికాడా..?