Vote Theft | రాహుల్ ఆటం బాంబుతో కిందికి మీదికైతున్న ఎన్నికల సంఘం
రాహుల్ గాంధీ పేల్చిన ఓటు చోరీ బాంబ్‌తో కర్ణాటక మహదేవపురలో కలకలం – ఈసీ ప్రతిస్పందనపై జాతీయ చర్చ!
Vote Theft | లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓట్ల చోరీ ఎలా జరిగిందో సవివరంగా, ఆధారాలతో సహా కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ పేల్చిన ఆటం బాంబుతో కేంద్ర ఎన్నికల సంఘం కకావికలవుతున్నది. ఇవి ఆధార రహిత ఆరోపణలన్న ఎన్నికల సంఘం.. అఫిడవిట్‌పై రాహుల్ సంతకం చేయాలని తొలుత వింత వాదన తీసుకొచ్చింది. వాటిలో తప్పులున్నాయా? ఒప్పులున్నాయా పరిశీలిస్తామన్న మాట కూడా చెప్పడానికి సాహసించలేక పోయింది. తాజాగా ఈ ఆరోపణలు రాజ్యాంగాన్ని అవమానించడమేనంటూ వ్యాఖ్యానించింది. పోలింగ్ ప్రక్రియను నిఘా కెమెరాల నీడలో నిర్వహించేదే అందులో ఏమైనా అవకతవకలు ఉంటే బయటపడతాయని. కానీ.. ఈసీ మాత్రం మరో వితండ వాదన తీసుకొచ్చింది. పైగా సెంటిమెంట్ అస్త్రం బయటకు తీసింది. ‘మన తల్లులు, చెల్లెళ్లు ఓటు వేస్తున్న వీడియోలను బయటపెట్టమంటారా?’ అంటూ హూంకరించింది. ఆదివారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఓట్ చోరీ అనే పదాన్నివాడటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు విఫల ప్రయత్నాలు చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమే’ అని అన్నారు. ‘ఈసీ భుజాలపై తుపాకీని పెట్టి ఓటర్లను కాల్చుతున్న సమయంలో మేం ఒకటి స్పష్టం చేయదల్చుకున్నాం.. ఈ సమయంలో మేం కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా ఓటర్ల తరఫున రాయిలా నిలబడి ఉన్నాం’ అని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ వంటి పార్టీలకు మిషీన్ రీడబుల్ ఓటర్ లిస్టులు ఎందుకు ఇవ్వలేదన్న అంశంపై ఆయన మాట్లాడుతూ.. అలా ఇస్తే అది ఓటర్ల ఆంతరంగిక గోప్యతకు భంగం కలిగించినట్టేనని 2019లోనే సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. రాహుల్ గాంధీ పేరును నేరుగా ప్రస్తావించని జ్ఞానేశ్ కుమార్.. ‘ఇటీవల కొందరు ఓటర్ల ఫొటోలను వారి అనుమతి లేకుండా మీడియాకు చూపిన అంశాన్ని మేం గమనించాం. వాటిని చూపుతూ అరోపణలు చేశారు’ అని సీఈసీ అన్నారు. పోలింగ్ బూత్‌లలో డూప్లికేట్ ఓటర్లు వచ్చారన్న ఆరోపణపై ఆయన మాట్లాడుతూ ‘ఒకరి తల్లి, కోడలు, చెల్లెలు లేదా ఇంకెవరి సీసీటీవీ ఫుజేజ్‌ను ఎన్నికల సంఘం బయటపెట్టాలా? ఓటరు లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్లే ఎన్నికల్లో ఓటు వేస్తారు’ అని వింత వాదన చేశారు. ఎన్నికల ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఎన్నికల అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, అభ్యర్థులు.. ఇలా సుమారు కోటీ 30 లక్షల మంది ఉంటారన్న సీఈసీ.. ఇంత పారదర్శక ప్రక్రియలో ఓట్ల చోరీ సాధ్యమేనా?’ అని ఎదురు ప్రశ్నించారు. ఒకే ఓటరు రెండు సార్లు ఓటేశారనేందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదని అన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram