Explained | తెలంగాణలో రోడ్లపై పొగబండ్లు 42 లక్షలు.. ఒక్క గ్రేటర్‌లోనే ఎన్నో తెలుసా?

కాలం చెల్లిన వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల వరకు ఉన్నాయని తెలుస్తున్నది. ఇందులో టూ వీలర్స్ సింహభాగం ఉన్నట్టు చెబుతున్నారు. మొత్తం 42 లక్షల వాహనాల్లో టూ వీలర్స్ 31 లక్షల వరకు ఉండగా, నాలుగు చక్రాల వాహనాలు 5.5 లక్షల వరకు ఉన్నట్లు రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి.

Explained | తెలంగాణలో రోడ్లపై పొగబండ్లు 42 లక్షలు.. ఒక్క గ్రేటర్‌లోనే ఎన్నో తెలుసా?

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

Explained | రాష్ట్రంలో దట్టంగా పొగ వెదజల్లుతూ వాహనాలు తిరుగుతూ ఉంటాయి! చాలావాటికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌లు కూడా ఉండవు! కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను తుక్కుగా మార్చే సాహసం కూడా చేయరు! ఓవర్‌లోడ్‌తో ప్రయాణించే టిప్పర్లను.. అవి ప్రమాదానికి కారణమైనప్పుడే గుర్తిస్తారు! గతంలో బూరేలాల్‌ కమిటీ సిఫారసులు ఏమయ్యాయో తెలియదు! ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి.. కానీ.. ఏ ప్రభుత్వం కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలు లేవని పరిశీలకులు అంటున్నారు. 19 మంది మరణానికి కారణమైన చేవెళ్ల ప్రమాదం తర్వాత ఓవర్‌లోడ్‌, కాలం చెల్లినవాహనాల అంశాలు మళ్లీ చర్చనీయాంశమవుతున్నాయి.

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ లేని వాహనాలు 39వేలు!

తెలంగాణలో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ లేకుండా సుమారు 39వేల వరకు తిరగుతున్నట్లు రవాణా శాఖ అధికారుల అంచనా. ఇందులో క్యాబ్‌లు, హెవీ, మీడియం గూడ్స్ వాహనాలు, కాంట్రాక్టు క్యారేజ్ బస్సులు ఉన్నాయి. వీటిలో కూడా పన్నులు చెల్లించకుండా తరుగుతున్నవి పాతిక వేలు ఉండగా, పర్మిట్లు లేకుండా తిరిగేవి 11వేల దాకా ఉన్నాయని రవాణాశాఖ అధికారుల ద్వారా తెలుస్తున్నది. ఇవి రోడ్ల మీద తిరగకుండా పోలీసులు లేదా రవాణా అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ‘ఇలాంటి వాహనాలతో ప్రమాదాలు జరిగితే ప్రజల ప్రాణాలు గాల్లో కలవడమే కాకుండా తీవ్ర గాయాల పాలైతే ఎటువంటి ఇన్సూరెన్స్ కూడా పొందలేరు. తమ జేబులో నుంచి సొమ్ములు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది. తొలుత వీటిని తుక్కుగా మార్చాల్సిన అవసరం ఉంది’ అని రవాణా రంగ నిపుణుడొకరు అన్నారు.

కాలం చెల్లినవి 42 లక్షలు

కాలం చెల్లిన వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల వరకు ఉన్నాయని తెలుస్తున్నది. ఇందులో టూ వీలర్స్ సింహభాగం ఉన్నట్టు చెబుతున్నారు. మొత్తం 42 లక్షల వాహనాల్లో టూ వీలర్స్ 31 లక్షల వరకు ఉండగా, నాలుగు చక్రాల వాహనాలు 5.5 లక్షల వరకు ఉన్నట్లు రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కాలం చెల్లిన వాహనాలు 23.5 లక్షల వరకు ఉన్నాయని సమాచారం. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడే తిరుగుతూ ప్రజల ప్రాణాలకు సంకటంగా మారినా కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా వాహనాల జీవిత కాలం అంటే పదిహేను సంవత్సరాలు. అంతకు మించి వాహనం నడిపితే ఫిట్‌నెస్‌ తగ్గి ప్రమాదాలకు దారితీస్తుంది. రోడ్డుపై నడిపేటప్పుడు దట్టమైన పొగ రావడం, బ్రేకులు సరిగా పనిచేయకపోవడం, రోడ్లపై అకస్మాత్తుగా ఆగిపోవడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి. వాహనాలు వదిలే పొగలోని కార్బన్ డై ఆక్సైడ్ మూలంగా పర్యావరణం దెబ్బతింటుంది. బ్రేకులు పనిచేయకపోవడం తో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతాయి.

ఫిట్‌నెస్‌ పరిశీలన డొల్ల?

ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రారంభించిన ఫిట్‌నెస్‌ విధానమే ఇంకా కొనసాగుతున్నదని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. చాలా దేశాల్లో ఆటోమెటిక్ ఫిట్‌నెస్‌ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండు ఆటోమెటిక్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో మాత్రం పురాతన విధానంతోనే నెట్టుకు వస్తున్నారు. ఈ విధానం మూలంగా ఆర్టీఏ అధికారుల సంచులు నిండుతుండగా, ప్రజల ప్రాణాలు హరీమంటున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎంవీఐ, ఏఎంవీఐలు మాన్యువల్ గా పరిశీలించి, సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో స్కూలు బస్సులను తనిఖీలు చేస్తారు. సంక్రాంతి పండుగ సమయంలో కాంట్రాక్టు క్యారేజ్ ప్రైవేటు బస్సులను తనిఖీ చేస్తారు. మిగతా సమయాల్లో వాటి గురించి పట్టుంచుకోరనే వాదనలు ఉన్నాయి. మాన్యువల్ విధానం తీసివేసి, ఆటోమెటిక్ వ్యవస్థను తీసుకువస్తే రవాణా అధికారుల అవినీతికి చెక్ పడుతుందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. అదే జరిగితే ఫిట్‌నెస్‌ లేని వాహనాలు తుక్కు కిందకి పోతాయని అంటున్నారు.

ఫిట్‌నెస్‌ లేని వాటితోనే ప్రమాదాలు

రవాణా శాఖ లెక్కల ప్రకారం పదిహేను సంవత్సరాలు దాటి ఫిట్‌నెస్‌ లేకుండా తిరుగుతున్న వాహనాల మూలంగా 2022 లో 1,306 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 418 మంది చనిపోగా, 1,100 మందికి పైగా గాయాల పాలై ఆసుపత్రుల్లో చేరారు. కొందరికి కాళ్లు, మరికొందరికి చేతులు, ఇలా నడుము విరిగిపోవడం జరిగింది. కొందరైతే మంచానికే పరిమితమై జీవిస్తున్నారు. కాలం చెల్లిన వాహనాల్లో సడన్‌గా బ్రేకులు పనిచేయకపోవడం, క్లచ్ పట్టేయడం, వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాల పైకి దూసుకువెళ్లడం జరుగుతుంటాయని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.

భారీగా పెరగనున్న ఫీజులు

కేంద్ర ప్రభుత్వం గత మూడు నాలుగు సంవత్సరాలుగా కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు చర్యలు ప్రారంభించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలను ప్రోత్సహిస్తున్నది. వీటికి సబ్సిడీ కూడా మంజూరు చేస్తున్నది. దీంతో ఈ–వాహనాల కొనుగోలు ఊపందుకున్నది. ఫలితంగా రోడ్లపై ఈ టూ వీలర్లు, ఫోర్ వీలర్లు రయ్ రయ్ మంటూ తిరుగుతున్నాయి. అదే సమయంలో ఫిట్‌నెస్‌ లేని వాహనాలను యజమానులే వదిలించుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకువచ్చింది. 20 సంవత్సరాలు దాటిన ట్రక్కులు, బస్సులు ఫిట్ నెస్ కోసం వెళ్తే రూ.25 వేలు చెల్లించేలా నిబంధనలు సవరిస్తున్నారు. ఇక నుంచి 10, 13, 15, 20 సంవత్సరాలకు ఫిట్ నెస్ పరీక్షలు జరిపేలా నిబంధనలు తీసుకురానున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన రవాణా అధికారులు పలు ప్రతిపాదనలు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖకు పంపించారు. వాణిజ్య వాహనాలకు 8 సంవత్సరాల తరువాత వ్యక్తిగత వాహనాలకు పది సంవత్సరాల తరువాత ఫిటనెస్ పరీక్ష ను తప్పనిసరి చేయాలని సూచించారు. ప్రైవేటు అయినా, వాణిజ్య వాహనం అయినా ఫిట్ నెస్ ముఖ్యమని స్పష్టం చేశారు. పనికిరాని వాహనం రోడ్డు మీదకు వస్తే ప్రజలకు ప్రమాదమని, ప్రభుత్వానిక చెడ్డపేరు వస్తుందని తెలిపారు.

లారీలు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులకు తప్పనిసరి

చేవెళ్ల లో ఆర్టీసీ బస్సు – టిప్పర్ ప్రమాదం ఘటనపై సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ సమీక్షించింది. గురువారం కమిటీ చైర్మన్ అభయ్ మనోహర్ సప్రే, సభ్యుడు సంజయ్ బందోపాధ్యాయ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా వారు పోలీసులు, రవాణా, ఆర్టీసీ, అధికారులతో సమావేశమయ్యారు. ప్రమాదాలకు కారణాలు, ఎలా పరిష్కరించాలనేది కూడా అధికారులకు తెలుసని, అయినా పట్టించుకోవడం లేదని కమిటీ అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సమిష్టి కార్యాచరణ చేపట్టాలని ఆదేశించింది. ఆర్టీసీ బస్సులు, కాంట్రాక్టు క్యారేజ్ బస్సులు, వాణిజ్య వాహనాలన్నింటికి ఇప్పటి నుంచి ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. పరీక్షలో ఫెయిల్ అయితే తుక్కుగా మార్చాలని, సర్టిఫికెట్ లేని వాహనాలను జప్తు చేయాలన్నారు. టీజీ ఆర్టీసీలో ప్రభుత్వ బస్సులు ఎన్ని ఉన్నాయి, ప్రైవేటు బస్సులు ఎన్ని ఉన్నాయనే లెక్కలు ఆరా తీశారు. వీటిలో రాజకీయ నాయకులకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా అని ఆర్టీసీ అధికారులను ప్రశ్నించారు. ప్రయాణీకులు, సరకులు రవాణా చేసే వాణిజ్య ప్రతి వాహనానికి పర్మిట్, ఫిట్ నెస్, ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించింది. రోడ్లపై వెళ్లే ఇసుక, కంకర, రోబో శాండ్ వాహనాలు అధిక లోడ్ తో వెళ్తే సీజ్ చేయాలని కమిటీ అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చేవెళ్ల ప్రమాద ఘటనపై సవివరంగా నివేదిక పంపించాలని సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ కోరిందంటున్నారు.

Read Also |

Ancient Gold Coins Found in Tamilnadu Temple | ఆలయం పునర్ నిర్మాణంలో బయటపడిన బంగారు నాణేలు

Donald Trump : మా అణ్వాయుధాలతో ప్రపంచాన్ని 150సార్లు పేల్చేయవచ్చు

Private Bus Travels| బిగ్ బాస్ చూస్తూ..ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవింగ్