Outsourcing Employees | 74 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఊస్టింగ్! మిగులు సిబ్బంది పేరుతో తొలగింపు?

Outsourcing Employees | 74 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఊస్టింగ్! మిగులు సిబ్బంది పేరుతో తొలగింపు?

Outsourcing Employees | ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలోని మరో 74 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ సచివాలయంలో గత రెండు నెలలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. చాలీ చాలనీ జీతాలతో పనిచేస్తున్న వీరిపై కన్నెర్ర చేయడం సచివాలయంలోని శాశ్వత ఉద్యోగులను సైతం ఆలోచింప చేస్తున్నది. గత పదిహేను సంవత్సరాలుగా సచివాలయంలో పనిచేస్తున్న వారిలో 74 మందిని తొలగించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. వీరిని ఇంటికి పంపించిన తరువాతే మిగతా వారికి వేతనాలు మంజూరు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారని తెలిసింది. మిగులు సిబ్బంది పేరుతో వీరిని అకారణంగా తొలగిస్తున్నారని, 74 మంది తొలగింపుతో ఆదా అయ్యేది రూ.10 లక్షలు మాత్రమేనని చెబుతున్నా సందీప్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు.

కొలువుల భర్తీ లేక..

రాష్ట్రంలో పదేళ్లు అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్.. శాశ్వత నియామకాలు చేపట్టకపోవడంతో సచివాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. మంత్రులు, కార్యదర్శుల విభాగాలతోపాటు వివిధ సెక్షన్లలో శాశ్వత ఉద్యోగులకు సహాయంగా ఉంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తక్కువ జీతంతో శాశ్వత ఉద్యోగులకు సమానంగా పనిచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తున్న వారిని కొనసాగించకుండా పొదుపు చర్యల పేరుతో తొలగింపు మొదలు పెట్టింది. పేషీలు, సెక్షన్లలో డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా, ఆఫీసు బాయ్‌లుగా పనిచేస్తున్న తమపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎందుకు ఆగ్రహంగా ఉన్నారో తెలియడం లేదని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు వాపోతున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి చివరితో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితి ముగుస్తుంది. మళ్లీ ఏప్రిల్ 1 నుంచి ఏడాది పాటు కొనసాగించేందుకు వీలుగా రెన్యూవల్ చేస్తారు. ఈ ఏడాది రెన్యూవల్ చేయకుండా పక్కనబెట్టడమే కాకుండా వేతనాలు కూడా పెండింగ్‌లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేమంటే మిగులు సిబ్బంది ఉన్నారని, తొలగించాలని అంటున్నారు.

ఇచ్చేది కొంతే.. గొడ్డు చాకిరీ

సచివాలయంలో సుమారు 74 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో డీఈవోలు, ఆఫీసు బాయ్స్ ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.18వేల వరకు వేతనం చెల్లిస్తున్నప్పటికీ, ఈఎస్ఐ, పీఎఫ్, ఏజెన్సీ కమీషన్ మినహాయిస్తే వారికి అందేది రూ.15వేలు మాత్రమే. ఈ రూ.15వేల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు గొడ్డు చాకిరీ చేస్తున్నారు. శాశ్వత ఉద్యోగులతో పాటు, అధికారులు చెప్పే పనిని చేస్తున్నారని చెబుతున్నారు. వీరిని తొలగించవద్దని కొద్ది రోజుల క్రితం సచివాలయం ఉద్యోగుల సంఘం నాయకులు వెళ్లి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయాను కలిసి విన్నవించారు. తక్కువ వేతనాలతో రెట్టింపు పనిచేస్తున్నారని, వారిని కొనసాగించాలని కోరారు. అయినప్పటికీ ఆయన వినిపించుకోకుండా తొలగించాలనే మొండి పట్టుదలతో ఉన్నారని అంటున్నారు. వారిని తొలగించడం మూలంగా ప్రతి రూ.10 లక్షల దాకా ఆదా అవుతుందని, ఈ సొమ్ముతో ప్రాజెక్టులు కడతారా? అని ప్రశ్నించినా కూడా ఆయన స్పందించడం లేదని తెలిసింది. పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని అకస్మాత్తుగా తొలగిస్తే, ఎక్కడకు వెళ్లాలని మొత్తుకున్నా ఆయన ససేమిరా అంటున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. సచివాలయంలో వీలు కానట్లయితే కనీసం హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాల్లో సర్ధుబాటు చేయాలని కోరుతున్నారు.

ఆందోళనకు దిగుతాం!

సందీప్ కుమార్ సుల్తానియా వైఖరితో అగ్రహంగా ఉన్న సచివాలయం ఉద్యోగుల సంఘం నాయకులు.. ప్రత్యక్ష ఆందోళనకు దిగాలనే యోచనలో ఉన్నారు. నాలుగైదు రోజుల్లో జీతాలు చెల్లిస్తే సరి లేదంటే ఆయన చాంబర్ ముందు ఆందోళనకు దిగడం ఖాయమని నాయకులు అల్టిమేటం జారీ చేశారు. శాశ్వత ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విషయంలో కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామ‌కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. తమకు స్వంత పనులు ఏమీ ఉండవని, సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆయన వద్దకు వెళ్తుంటామని చెప్పారు. వాటిని కూడా పరిష్కరించేందుకు సమయం ఇవ్వకపోతే ఎలా అని ప్రధాన కార్యదర్శిని అడిగారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తన వైఖరిని మార్చుకుంటే మంచిదని, లేదంటే ఆయన చాంబర్ ముందు ఆందోళన చేపట్టడం ఖాయమని ప్రధాన కార్యదర్శికి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవహరించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవహరిస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదని సచివాలయం ఉద్యోగుల సంఘం నాయకులు అంటున్నారు.