Congress MLAs Revolt | ప్రజల ఒత్తిడి, నిధుల లేమితో అసహనం.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటు!

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో అసహనం కట్టలు తెంచుకుంటున్నదా? నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే అందుకు కారణమా?

Congress MLAs Revolt | ప్రజల ఒత్తిడి, నిధుల లేమితో అసహనం.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటు!

హైదరాబాద్, అక్టోబర్‌ 3 (విధాత ప్రతినిధి):

Congress MLAs Revolt | నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు లేకపోవడం, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడం, చిన్న చిన్న పనుల కోసం కూడా నెలల తరబడి ఎదురు చూడాల్సి రావడం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసహనానికి, ఆగ్రహానికి కారణమవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్గతంగా ఆగ్రహంతో రగిలిపోతున్నా.. పైకి మాత్రం కొందరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. అయినప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చురకలు అంటిస్తూనే ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు. జడ్చర్లలో అరబిందో ఫార్మా కంపెనీ వ్యర్థ జలాలను వదిలేస్తూ పరిసర ప్రాంతాల పంట భూములను, చెరువును కలుషితం చేస్తున్నదని, 24 గంటల్లో సరిదిద్దకపోతే కంపెనీని తగులబెడ్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జే అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొయినాబాద్ మండలంలోని రెడ్డిపల్లిలోని తన ఫామ్ హౌస్‌కు వెళ్తుండగా దారి మధ్యలో చిల్కూరు చెరువు వద్ద స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కన్పించడంతో ఆగారు. పార్టీలోకి ఎందుకొచ్చావే అనగా యాదయ్య చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. తన నియోజకవర్గంలో పునరుద్ధరణ పనులకు రూ.100 కోట్లు మంజూరు చేయాలని ఏకంగా ప్రపంచ బ్యాంకు (వరల్డ్ బ్యాంకు)కు ఎమ్మెల్యే కే మదన్ మోహన్ రావు లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతోనే ఈ లేఖ రాశారని జిల్లాలో ప్రజలు అనుకుంటున్నారు. ఈ వరుస విమర్శల పరంపర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనను ఇరుకున పెట్టే విధంగా ఉందనే చర్చలు గాంధీ భవన్ లో జోరుగా సాగుతున్నాయి. కొందరు ప్రత్యక్షంగా విమర్శలు గుప్పిస్తుండగా మరికొందరు పరోక్షంగా ఇరుకునబెట్టే పనులు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారని కాంగ్రెస్ ముఖ్య నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి గట్టిగా చురకలు అంటించారు. ఎమ్మెల్యేల విమర్శలు ప్రతిదీ రికార్డు అవుతుందని, తీరు మార్చుకోనట్లయితే నష్టం జరుగుతుందని హెచ్చరించినా పెడచెవిన పెడుతున్నారంటే ఎమ్మెల్యేల్లో అసహనం, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక ఎన్నికల తరువాత తారస్థాయికి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంటున్నారు. అంతర్గతంగా చాలా మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని, కొందరు బయటపడుతుండగా, మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రం అవకాశం, అదను కోసం చూస్తున్నారని కాంగ్రెస్ లోనే చర్చ జరుగుతోంది.

24 గంటల్లో అరబిందోను తగులబెడతా

‘పోలేపల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లోని అరబిందో ఫార్మా కంపెనీ కి ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను, హెచ్చరించాను. అయినా వినకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నందున 24 గంటల్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోకపోతే నేనే వెళ్లి స్వయంగా కంపెనీ తగులబెడ్తాను’ అని జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మీడియా ముఖంగా హెచ్చరించారు. ఫార్మా వదిలే హానికర వ్యర్థ జలాల కారణంగా ముదిరెడ్డి పల్లె చెరువులోకి రావడంతో చేపలు చనిపోతున్నాయన్నారు. చెరువు కింద ఉన్న భూముల్లో సాగు కలుషితమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. టీజీ పీసీబీ అధికారులకు, ఫార్మా మధ్య ఏమి లాలూచీ ఉందో తెలియదు కాని చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే 24 గంటల గడువు నేపథ్యంలో మరుసటి రోజు హడావుడిగా మహబూబ్ నగర్ జిల్లా పీసీబీ అధికారులు తనిఖీ చేసి నమూనాలు సేకరించి వెళ్లిపోయారు. తనిఖీలు చేసి వారం రోజులు అవుతున్నా ఇంత వరకు నమూనాలపై అధికారిక ప్రకటన వెలువడ లేదు. అంతకు ముందు ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు ను లక్ష్యంగా చేసుకుని అనిరుధ్‌ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు బలంగా ఉన్నారని, నీటి పారుదల ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు దక్కించుకోవడమే కాకుండా హైదరాబాద్‌లో భయం లేకుండా దందాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తరువాత వారికి ఇక్కడ ఏం పని అంటూ… ఇంటి నల్లా కనెక్షన్, కరెంట్ కనెక్షన్ తీసేస్తే వాళ్లే చంద్రబాబు వద్దకు పరుగులు తీస్తారని, వెంటనే బనకచర్ల ప్రాజెక్టు ఆపమని కాళ్లా వేళ్లా పడతారని వ్యాఖ్యానించారు. ఆంధ్రావాళ్లు మంచిగా చెబితే వినరంటూ అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల మధ్య సామరస్యతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అప్పట్లో అనుకున్నారు. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలు అంగీకరించకపోతే, ఆంధ్రా వాళ్లను తెలంగాణలో తిరగనివ్వబోమని హెచ్చరించారు కూడా. ఈయన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే విధంగా, సూటిగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తున్నారు. ఈయనకు ప్రస్తుత క్యాబినెట్ లో ఉన్న ఒక మంత్రి గత ఎన్నికల్లో పట్టుబట్టి టిక్కెట్ ఇప్పించిన విషయం అందరికీ తెలిసిందే.

టార్గెట్ రేవంత్ రెడ్డి

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సొంత పార్టీ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తరువాత మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోకుండా యువతను మోసం చేసిందన్నారు. రెండు లక్షలు చెప్పి 50వేల ఉద్యోగాలు మాత్రం ఇచ్చారని, అయినా నిరాశ చెందవద్దని, మీకు అన్న లాగా అండగా ఉంటానని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. గ్రూప్ వన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, సరిచేయకపోతే యువత తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. యువత అనుకుంటే ఏదైనా చేస్తారని, నేపాల్ దేశంలో తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కుప్పకూల్చారని గుర్తు చేశారు. నేపాల్ తరహాలో మన ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయమని రాజగోపాల్ హెచ్చరించారు. అంతకు ముందు చౌటుప్పల్ మండలం ఎల్లగిరి లో మాట్లాడుతూ, గత ఇరవై నెలలుగా తన నియోజకవర్గంలో రోడ్లు, భవన నిర్మాణాల కోసం ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదని ఆరోపించారు. ఈ విషయమై మంత్రిని వందసార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. పదవులు మీరే తీసుకుని అనుభవిస్తున్నారు, నిధులు కూడా మీరే తీసుకుంటున్నారనేది అడగాలా.. వద్దా అని ఆయన ప్రశ్నించారు. వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు పనులు నిధులు రాక స్థంభించిపోయాయని, అందుకే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్ధేశించి పదవులు మీకే ఉన్నాయి, పైసలు కూడా మీకేనా అని విమర్శిస్తున్నట్లు రోజగోపాల్ రెడ్డి సమర్థించుకున్నారు. తాజాగా చిలుకూరు పెద్ద చెరువు వద్ద స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో మాట్లాడిన మాటలు కూడా చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీలో హాయిగా ఉండకుండా, కాంగ్రెస్ లోకి ఎందుకు వచ్చావని అన్నారు. ఎన్నో కష్టాలు పడి పార్టీని గెలిపించిన తమకే గౌరవ మర్యాదలు దక్కడం లేదని, అన్నీ తెలిసి ఎందుకొచ్చావంటూ రాజగోపాల్ ప్రశ్నించారు. అన్నింటికీ ఆయన మౌనమేదాల్చారు. రేవంత్ రెడ్డి టార్గెట్ గా రాజగోపాల్ చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆయన సీఎం వ్యాఖ్యలు, వైఖరిని తప్పుపడుతున్నా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి.

ఏకంగా ప్రపంచ బ్యాంకు కే నిధుల కోసం లేఖ

ఎన్నడూ లేని విధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురవడంతో అనేక గ్రామాలు ముంపునకు గురై పంటలు నాశనం అయ్యాయని ఎమ్మెల్యే కే మదన్ మోహన్ రావు ఏకంగా ప్రపంచ బ్యాంకుకే లేఖ రాసి వివరించారు. తాగునీటి వనరులు ధ్వంసమయ్యాయని, వందలాది ఇళ్లు కూలిపోయాయని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పునరావాసం, పునర్ నిర్మాణం, భవిష్యత్తు విపత్తుల సన్నద్ధత కోసం రూ.100 కోట్లు సహాయం మంజూరు చేయాలని వరల్డ్ గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీ (జీ.ఎఫ్.డీ.ఆర్.ఆర్) కు విన్నవించారు. ప్రజల జీవితాలను సాధారణ స్థితికి తీసుకువచ్చే క్రమంలో దీర్ఘకాలిక రక్షణ చర్యల కోసం ఈ సాయం అవసరమని వారికి తెలిపారు. సాధారణంగా కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, న్యూ డెవలప్ మెంట్ బ్యాంకుల కు అప్పుల కోసం లేఖలు రాస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా లేఖ రాయడం సంచలనం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అసహనం, ఆగ్రహంతోనే ఈ లేఖ రాసి బద్నాం చేశారనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది.

వరంగల్ జిల్లాలో మరో సమస్య

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మహిళా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు సీనియర్ మంత్రి కొండా సురేఖ కాగా, మరొకరు ధనసరి సీతక్క. సురేఖ పద్మశాలీ కులం కాగా, సీతక్క ఆదివాసీ బిడ్డ. ఈ జిల్లాలో వీరిద్దరినీ రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా నియంత్రిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సురేఖకు వ్యతిరేకంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు జట్టు కట్టడం వెనకాల వీరిద్దరి ప్రోద్బలం, సంపూర్ణ సహకారం ఉందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. జిల్లాలో తమ ఆధిపత్యం చేజారకుండా ఉండేందుకే ఇద్దరూ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని సురేఖ వర్గీయులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, సురేఖ మధ్య కొద్ది రోజుల క్రితం మీడియా ముఖంగా విమర్శల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు లు పీసీసీ నాయకత్వం ముందు సంజాయిషీ ఇచ్చుకోవడం, ఆ తరువాత పార్టీ పెద్దల జోక్యంతో తాత్కాలికంగా సద్ధుమణిగింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ విభేధాలు రచ్చకెక్కే అవకాశాన్ని తొసిపుచ్చలేమని అంటున్నారు.

ఇవి కూడా చదవండి..
Prashant Kishore | ప్రశాంత్ కిషోర్ హెచ్చరిక: తెలంగాణకు వస్తా.. రేవంత్​ను ఓడించి తీరుతా..
Comet season October | గగన సీమలో మరోసారి తోకచుక్కల సీజన్‌.. కంటితో చూడగలిగేది ఎప్పుడంటే..
No cough syrup to Children | చిన్నారులకు దగ్గు మందులు వద్దు – కేంద్రం అత్యవసర హెచ్చరిక