Defacto | మున్సిపల్‌ శాఖలో డీ ఫ్యాక్టో.. తానొచ్చేవరకూ ఫైళ్లు ఆపాలని హుకుం!

వేస‌వి కావ‌డంతో ఆయ‌న విదేశాల‌కు వెళ్లారో దేశంలో మ‌రో ప్రాంతానికి ప‌య‌న‌మ‌య్యారో తెలియ‌దు. తాను వ‌చ్చేంత వ‌ర‌కు ముఖ్య‌మైన ఫైళ్ల‌ను తాక‌రాద‌ని, అప్ప‌టి వ‌ర‌కు పెండింగ్‌లో పెట్టాల‌ని ఉన్న‌తాధికారుల‌కు హుకుం జారీ చేసి వెళ్లిపోయారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది. దీంతో నాలుగైదు రోజుల నుంచి ముఖ్య‌మైన ఫైళ్లు ఎక్క‌డిక‌క్క‌డే ఆగిపోయాయ‌ని ఉద్యోగులు అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకుంటున్నారు.

Defacto | మున్సిపల్‌ శాఖలో డీ ఫ్యాక్టో.. తానొచ్చేవరకూ ఫైళ్లు ఆపాలని హుకుం!
  • సింహభాగంపై పెత్తనం అయనదేనని చర్చ
  • రెండుమూడ్రోజులకోసారి హెచ్‌ఎండీఏకు
  • ప్లానింగ్‌ విభాగానికి వచ్చే ఫైళ్లపై ఆరాలు
  • భారీ భూమార్పిడి వ్యవహారాలపైనే నజర్‌
  • సంబంధిత వ్యక్తులతో ఫోన్‌లో మంతనాలు
  • ముఖ్యమంత్రికి సన్నిహితుడని చర్చలు
  • అసలా వ్యక్తి సీఎంకు తెలుసా? అని డౌట్లు

హైద‌రాబాద్‌, మే 24 (విధాత‌)
Defacto | ‘నేను విదేశాల‌కు వెళ్తున్నాను, వ‌చ్చే వ‌ర‌కు కీల‌క‌మైన ఫైళ్ల‌పై ఏ విధ‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్దు’.. ఇటువంటి ఆదేశాలను.. ఇస్తేగిస్తే సంబంధిత శాఖల మంత్రి లేదా ఆ శాఖ కార్యదర్శి ఇస్తారు. కానీ.. మున్సిపల్‌ శాఖలో మాత్రం విచిత్ర వ్యవహారం సాగుతున్నదని తెలుస్తున్నది. ఈ శాఖతో ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఒక వ్యక్తి డీఫ్యాక్టో ఉన్నతాధికారిలా అజమాయిషీ చెలాయిస్తున్నారని సమాచారం. ఈయన ఇటీవల విదేశాలకు వెళుతూ.. తాను తిరిగి వచ్చే వరకూ కీలక ఫైళ్లపై ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దని మున్సిప‌ల్ వ్య‌వ‌హారాలు, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌కు హుకుం జారీ చేసి వెళ్లారనే చర్చ జరుగుతున్నది. ఆయ‌న సోమ‌వారం తిరిగి హైద‌రాబాద్ రానున్నారని తెలుస్తున్నది. ఒక ప్రైవేటు వ్య‌క్తి తాను వ‌చ్చే వ‌ర‌కు ముఖ్య‌మైన ఫైళ్ల‌పై నిర్ణ‌యాలు నిలిపేయాలని చెప్పారంటూ ఆ వ్యక్తికి ఏ స్థాయిలో ప‌లుకుబ‌డి ఉందో ఊహించుకోవ‌చ్చు. ఆయ‌న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అనుచ‌రుడు అని కొందరు అధికారులు చర్చించుకుంటున్నారు. మరికొందరు అసలు ఈయన ముఖ్యమంత్రికి తెలుసా? అనే అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. మునిసిప‌ల్ శాఖ ఉద్యోగులు చ‌ర్చించుకుంటున్న దాని ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి.

హెచ్‌ఎండీఏలో ఫైళ్లపై ఆరా

స‌చివాల‌యంలోని మున్సిప‌ల్ వ్య‌వ‌హారాలు, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ (ఇటీవ‌లే రెండు విభాగాలుగా చీల్చారు)తో పాటు హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ డెవ‌ల‌ప్‌మెంట్‌ అథారిటీ (హెచ్ఎండీఏ)లను ఆయ‌న‌కు అప్ప‌గించార‌ని మునిసిప‌ల్ శాఖ‌ కోడై కూస్తున్న‌ది. రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన మ‌రుక్ష‌ణం నుంచే ఆయ‌న డీ ఫ్యాక్టో ఉన్న‌తాధికారిగా పెత్త‌నం చెలాయిస్తున్నార‌ని న‌లుగురు ఉద్యోగులు క‌లిసిన చోట చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌తి రెండు మూడు రోజుల‌కు ఒక‌సారి ఆయ‌న అమీర్‌పేట స్వ‌ర్ణ జ‌యంతి కాంప్లెక్స్‌లోని హెచ్ఎండీఏ కార్యాల‌యానికి వ‌స్తారని ఉద్యోగుల చర్చల ద్వారా తెలుస్తున్నది. ఉన్న‌తాధికారి చాంబ‌ర్‌లో కూర్చుని ప్లానింగ్ విభాగానికి ఏ ఫైళ్లు వ‌చ్చాయి? అందులో అనుమ‌తుల కోసం వ‌చ్చిన‌వి ఎన్ని, భూ మార్పిడి కోసం ఎన్ని వ‌చ్చాయి? అనే వివ‌రాలు తెప్పించుకుంటారని సమాచారం. అందులో భారీ ప‌రిమాణంలో ఉన్న ఫైళ్ల‌ను మాత్ర‌మే ఎంపిక చేసి, వారికే నేరుగా ఫోన్ చేస్తారని తెలిసింది ‘మీ ఫైలు ప‌రిశీల‌న‌లో ఉంది, నేరుగా క‌లిస్తే మీ ప‌ని పూర్తవుతుంది’ అంటూ సలహాలు ఇస్తారని అంటున్నారు. సదరు వ్యక్తులు కలిస్తే సరి. లేదంటే వ‌స్తే స‌రి లేదంటే ఇక ఆ ఫైలు అట‌కెక్కిన‌ట్టేనని చర్చించుకుంటున్నారు.

సచివాలయంలోనూ అంతే!

స‌చివాల‌యంలో కూడా మున్సిప‌ల్ శాఖ ఉన్న‌తాధికారుల వ‌ద్ద హ‌వా చెలాయిస్తున్నారని తెలుస్తున్నది. ఉన్నతాధికారుల చాంబర్లలోనే కూర్చుని ఫైళ్ల అనుమ‌తులు, సిఫార‌సుల‌పై చ‌ర్చించి, మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి ఆయ‌న ప‌నులు చక్క‌బెడుతున్నార‌ని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. వేస‌వి కావ‌డంతో ఆయ‌న విదేశాల‌కు వెళ్లారో దేశంలో మ‌రో ప్రాంతానికి ప‌య‌న‌మ‌య్యారో తెలియ‌దు. తాను వ‌చ్చేంత వ‌ర‌కు ముఖ్య‌మైన ఫైళ్ల‌ను తాక‌రాద‌ని, అప్ప‌టి వ‌ర‌కు పెండింగ్‌లో పెట్టాల‌ని ఉన్న‌తాధికారుల‌కు హుకుం జారీ చేసి వెళ్లిపోయారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది. దీంతో నాలుగైదు రోజుల నుంచి ముఖ్య‌మైన ఫైళ్లు ఎక్క‌డిక‌క్క‌డే ఆగిపోయాయ‌ని ఉద్యోగులు అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకుంటున్నారు. సోమ‌వారం (26వ తేదీ) తిరిగి హైద‌రాబాద్ వ‌స్తున్నార‌ని, అప్ప‌టి వ‌ర‌కు వేచి ఉండాల‌ని అధికారులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఒక ప్రైవేటు వ్య‌క్తి ఆధిప‌త్యం చెలాయిస్తున్నార‌ని, ఈ విష‌యం ముఖ్య‌మంత్రికి తెలుసా, తెలియ‌దా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఆయ‌న దృష్టికి తీసుకువెళ్తే ఏమ‌వుతుందోన‌న్న ఆందోళ‌న కూడా ఉంది.

ఇవి కూడా చదవండి..

Kavitha | కేసీఆర్‌ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
First Corona Case In Telanganaa: తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదు!
Telangana Cabinet Expansion: కాంగ్రెస్ లో ఆగని మంత్రి పదవుల లొల్లి!..హైకమాండ్ కు మరో లేఖ!!