komatireddy rajagopal reddy | తమ్ముడు రెడ్డి వార్నింగ్ వెనుక ఆంతర్యం?

komatireddy rajagopal reddy | హైదరాబాద్, ఆగస్ట్ 6 (విధాత): మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజుకో సంచలన ప్రకటన చేస్తూ తన అసంతృప్తిని బయటపెడుతున్నారు. ‘పదవుల కోసం కాళ్లు పట్టుకొనేది లేదు. పదవి ఇస్తారో ఇవ్వరో అది మీ ఇష్టం’ అంటూనే అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన సంకేతాల వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ రాజకీవర్గాల్లో సాగుతోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎంను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుండటం కాంగ్రెస్ నాయకత్వంలో కలకలం రేపుతున్నది. హస్తం పార్టీ హైకమాండ్‌ను బెదిరించేందుకే ఆయన రాజీనామా వ్యాఖ్యలు చేశారా? లేక భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి మనోగతాన్ని బయటపెట్టారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో అంతర్గతంగా ‘ఆల్ నాట్ వెల్’ అనే వాదనను మరోసారి చర్చల్లోకి తెచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రేవంత్ టార్గెట్‌గా రాజగోపాల్ రెడ్డి విమర్శలు
సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఈ ఏడాది జూన్ 8న విస్తరించారు. మొత్తం ఆరు బెర్తులు భర్తీ చేయాల్సి ఉండగా.. ముగ్గురితో ప్రస్తుతానికి సరిపెట్టారు. మరో మూడు మంత్రి పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకట్ స్వామిని రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రి పదవులు దక్కని నాయకులు అసంతృప్తికి గురయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి వంటి నాయకులను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఇతర నాయకులు బుజ్జగించారు. విస్తరణలో చోటు దక్కకపోవడంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం ఆయన మాటల్లోనే బయటపడుతున్నది. విస్తరణ జరిగిన రెండు మూడు రోజులకు సోషల్ మీడియాలో స్పందించిన రాజగోపాల్.. క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని ట్వీట్ పెట్టారు. విస్తరణకు ముందు అసెంబ్లీ లోపల, బయట కూడా బీఆర్ఎస్‌పై ఒంటికాలిపై విమర్శలు చేశారు. మంత్రి పదవి కోసం విమర్శలు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎదురుదాడి చేసింది. తీరా చూస్తే క్యాబినెట్‌లో ఆయనకు స్థానం లభించలేదు. దీంతో రాజగోపాల్ రెడ్డి స్వరం పెంచారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలోని జటప్రోల్‌లో జూలై 18న జరిగిన సభలో వచ్చే పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పడాన్ని తప్పపట్టడం ద్వారా తన అసంతృప్తి ప్రకటనలను రాజగోపాల్‌రెడ్డి ప్రారంభించారనే వాదనలు ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించబోరని ఎక్స్‌లో హెచ్చరిక పూర్వక పోస్టు పెట్టారు. ఈ నెల 1న జర్నలిస్టుల గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబడుతూ సోషల్ మీడియాలో మరో పోస్టు పెట్టారు. అవినీతి, అక్రమాలను సోషల్ మీడియా జర్నలిస్టులు బయటపెడుతున్నారని వారికి మద్దతు పలికారు. అలాంటి జర్నలిస్టుల గురించి సీఎం వ్యాఖ్యలను తప్పపట్టారు. మునుగోడు నియోజకవర్గానికే పరిమితమైన రాజగోపాల్‌రెడ్డి.. గాంధీ భవన్ కూడా దూరంగా ఉంటున్నారు. మంగళవారం తన నియోజకవర్గంలోని లచ్చమ్మగూడెంలో జరిగిన కార్యక్రమంలో అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌లో కలకలం రేపాయి.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం జరిగింది?
2023 నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంతకు కొన్ని రోజుల ముందే రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2022 ఆగస్టులో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడానికి ముందే కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం హామీ ఇచ్చిందనేది రాజగోపాల్ రెడ్డి వాదన. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2024 మే లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో భువనగిరి ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవిని ఇస్తామని కూడా పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. చామల గెలిచారు కానీ.. రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తే ఒకే ఇంట్లో రెండు పదవులు ఇచ్చినట్టు అవుతుంది. ఇదే ఢిల్లీ పెద్దల్లో చర్చల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. మరో వైపు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కూడా మంత్రి పదవి అడుగుతున్నారనే చర్చ తెరమీదికి వచ్చింది. ఇప్పటికే పద్మావతి భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. నాలుగైదు నెలల క్రితం నల్లగొండలో జరిగిన సమీక్షలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అంటూ రాజగోపాల్ రెడ్డి సంబోధించారు. ఈసారి కాకపోయినా భవిష్యత్తులో ఆయన సీఎం అవుతారని రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. తనకు మంత్రి పదవి విషయంలో అడ్డు చెప్పకుండా ఉండేందుకు రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ అప్పట్లో జరిగింది. బీజేపీ నుంచి చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరిన వివేక్ వెంకటస్వామికి రేవంత్ క్యాబినెట్ చోటు దక్కింది. కానీ, తనకు మంత్రి పదవి దక్కలేదని రాజగోపాల్ రెడ్డి తన మాటల ద్వారా బయటపెట్టారు. సామాజిక సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉన్నందున రాజగోపాల్ రెడ్డికి చోటు ఇవ్వలేదని హస్తం నాయకులు చెబుతున్నారు. ఈ వాదనతో రాజగోపాల్ రెడ్డి ఏకీభవించడం లేదు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే తనకు మంత్రి పదవి దక్కేదని ఆయన అన్నారు.
కోమటిరెడ్డి సోదరుల మధ్య గ్యాప్?
గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి సోదరుల మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరాలనే రాజగోపాల్ రెడ్డి నిర్ణయాన్ని అప్పట్లో వెంకట్ రెడ్డి వ్యతిరేకించారనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు వెంకట్ రెడ్డి ఫోన్ చేసినట్టుగా ప్రచారం జరిగిన ఆడియో అప్పట్లో లీకైంది. దీనిపై కాంగ్రెస్ నాయకత్వం విచారించింది. రాజగోపాల్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పరిణామాలు ఈ ఇద్దరి మధ్య గ్యాప్‌ను పెంచాయనే ప్రచారం సాగుతోంది. మంత్రి పదవిని తనకు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని పట్టుబట్టే విషయంలో అన్న పట్టించుకోవడం లేదనేది తమ్ముడి భావనగా ఆయన వర్గాలు చెబుతున్నాయి. గతంలో పార్టీ కార్యక్రమాలకు ఇద్దరు కలిసి వెళ్లేవారు. ఇటీవల కాలంలో అలాంటి సందర్భాలు కనిపించడం లేదని పార్టీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. రేవంత్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి పోస్టులు పెడుతుంటే.. వెంకట్ రెడ్డి మాత్రం సీఎంతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. సలార్ సినిమాలో ఓ పాట బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించేలా వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఫోటోతో ఎక్స్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోస్టు పెట్టారు. రేవంత్ రెడ్డి మరో పదేళ్లు సీఎంగా ఉంటారని గత ఏడాది రెండు సందర్భాల్లో వెంకట్ రెడ్డి ప్రకటించారు. నల్లగొండలో క్యాంప్ కార్యాలయం ప్రారంభించిన తర్వాత మళ్లీ సీఎం రేవంత్ కావాలని గణపతి పూజ చేయించినట్టు వెంకట్ రెడ్డి ఫోన్‌లో సీఎంకు చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం రాలేదు. తమ్ముడికి మంత్రి పదవి విషయంలో మంగళవారం ఢిల్లీలో వెంకట్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం మాటిచ్చిన విషయం తనకు తెలియదన్నారు. తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో తాను లేనని తేల్చి చెప్పారు. సీఎం, హైకమాండే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.