డబుల్ బెడ్‌రూమ్.. దగా.. దగా..!
గ్రామీణ ప్రాంతంలో 18,672, మండల కేంద్రంతోపాటు.. జిల్లా కేంద్రాల్లో 10,756, గ్రేటర్ హైదరాబాద్‌లో 17,427 ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇందులో ఇండిపెండెంట్ ఇండ్లు 11,860, రెండు లేదా మూడు అంతస్తుల్లో నిర్మాణం చేసినవి 34,995 ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న 11,860 ఇండిపెండెంట్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడానికి రూ.460 కోట్లు, గ్రౌండ్ ప్లస్ ఆ పైన ఉన్న 34,995 ఇండ్లను పూర్తి చేసేందుకు రూ.1,372 కోట్లు సమకూర్చాలని తేల్చారు. పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేసేందుకు మొత్తం రూ.1,833 కోట్ల నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు రూపొందించారు.

- లక్ష్యంగా పెట్టుకున్న ఇండ్లు 5.72 లక్షలు…
- పదేండ్లలో నిర్మించి, ఇచ్చినవి 27,100
- వేల కోట్ల రూపాయల ప్రజాధనం నేల పాలు
- ఎర్రవల్లి మోడల్ పేరుతో ప్రజానీకానికి ఎర
- కొల్లూరు ఇండ్లలో తిరుగుతున్న పందికొక్కులు
- కాంగ్రెస్‌కూ గుదిబండగా ‘డబుల్’ వ్యవహారం
హైదరాబాద్, మే 3 (విధాత)
ఇంటికి అల్లుడు వస్తే ఏడ పండుకోవాలి? చుట్టపోడు వస్తే కాళ్లు సాపుకోవడానికి కూడా రూమ్ లేకపోతే ఎట్ల? ఇలాంటి మాటలు చెప్పి ప్రతి పేదవాడికి ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కే చంద్రశేఖర్‌రావు చాలా ముచ్చట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇంటిలో కాళ్లు సాపుకుని పంటే ఈ గోడకు తలకాయ, ఆ గోడకు కాళ్లు తగులుతాయంటూ గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇంతచేసీ.. తాను కట్టి ఇస్తానని చెప్పిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. ఒక విధంగా పేద ప్రజలను నిండా మోసం చేశారు. మాటలు కోటలు దాటాయి కాని పనులు గడప దాటలేదనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం.
గొప్పగా ప్రకటించి..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామని, అదిగో ఇస్తున్నామని, ఇదిగో ఇచ్చామని ఎమ్మెల్యేలు, ఎంపీలు గొప్పలు చెప్పుకొన్నారు. ఈ పథకాన్ని 2015 అక్టోబర్ నెలలో ప్రకటించారు. రూ.10 లక్షల విలువ చేసే ఇంటిని పూర్తి ఉచితంగా ఇస్తున్నామని ప్రచారం చేసుకోవడంతో ప్రజలు ఎగబడి దరఖాస్తులు అందచేశారు. హైదరాబాద్ నగరంలో సంపన్నులే అపార్ట్ మెంట్లలో ఉండాలా? పేదలు ఉండకూడదా? అంటూ కేసీఆర్ అప్పట్లో ప్రశ్నల వర్షమే కురిపించారు. నెక్లెస్ రోడ్డు చుట్టు పక్కల ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తామని మీడియా సమావేశాల్లో ప్రకటించారు. మహా నగరంలో మురికివాడలు ఉండకూడదనేది తమ లక్ష్యమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.72 లక్షల ఇండ్లను నిర్మిస్తే.. ఇందులో హైదరాబాద్‌లోనే 2 లక్షల ఇండ్లు ఉన్నాయని చెప్పారు. పేదల ఆత్మగౌరవ ఇండ్లు అంటూ డప్పు కొట్టుకొన్నారు. మొత్తం 5.72 లక్షల మందికి ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పిన కేసీఆర్ తన పదేళ్ల హయాంలో 27,100 మందికి మాత్రమే ఇచ్చేసి చేతులు దులుపుకొన్నారు. కొల్లూరులో పూర్తయిన పదివేల ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి ఎందుకు అక్కరకు రాకుండా వృథా చేశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు.
ఎర్రవల్లిని చూపించి..
కేసీఆర్ తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ పైలట్ ప్రాజెక్టుకు 2016 మార్చి నెలలో అంకురార్పణ చేశారు. 560 చదరపు అడుగుల్లో రెండు బెడ్‌రూమ్‌లు, ఒక కిచెన్, ఒక హాలు, రెండు బాత్రూమ్‌లు ఉంటాయని చెప్పారు. అర్భాటంగా గృహ ప్రవేశాలు కూడా చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించే ఇళ్లకు ఇదే మోడల్ అని ప్రకటించారు. ఎర్రవల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఫొటోలను మీడియాలో చూసి తమకూ వస్తాయని ప్రజలు ఆశపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తులు, గ్రేటర్ హైదరాబాద్‌లో తొమ్మిది అంతస్తుల్లో నిర్మాణం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే ఏడు లక్షల మంది దరఖాస్తు సమర్పించారు. ఇక జిల్లాల్లో కూడా ఇంతకు మించి దరఖాస్తులు రాగా.. విచారణ పేరుతో కాలయాపన చేసి మొదటి టర్మ్ పాలన పూర్తి చేశారు. మరోసారి అధికారం ఇస్తే తమకు ఇళ్లు వస్తాయనే గంపెడాశతో పేదలు ఓట్లు వేసినా వారి కలను బీఆర్ఎస్ అధినేత నిజం చేయలేదు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరికే ఇండ్లు
సెప్టెంబర్ 2, 2023లో మొదటి విడత కింద 9 ప్రాంతాల్లో 11,900, సెప్టెంబర్ 21, 2023లో రెండో విడత కింద 9 ప్రాంతాల్లో 13,300, అక్టోబర్ 2, 2023లో 19,000 మంది లబ్ధిదారులకు లాటరీ విధానంలో స్థానిక ఎమ్మెల్యేలు ఇళ్లను అందచేశారు. మొత్తం మూడు విడతల్లో 27,100 మందికి మాత్రమే ఇండ్లు అందాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రెండు నెలల ముందు ఈ ఇండ్లను కొందరికే అందచేయడం, మిగతా వారికి మొండి చేయి చూపడం లక్షల సంఖ్యలో ఉన్న పేద ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. పెద్ద ఎత్తున కట్టించామని చెబుతున్న నాయకులు, వాటిని ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటనీ నిలదీశారు. అయినప్పటికీ పూర్తి చేసిన ఇండ్లను కూడా లబ్ధిదారులకు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. మౌలిక సదుపాయాల కల్పన పూర్తి కాకపోవడం, లబ్ధిదారుల జాబితా చాంతాడంత ఉండటం, కొన్ని ఇండ్లే ఉండటంతో వెనకంజ వేశారనేది అర్థమవుతోంది.
లక్ష్యం 5,72 లక్షల ఇండ్లు… టెండర్లు పిలిచినవి 2.30 లక్షలు
బీఆర్ఎస్ ఏలుబడిలో 2014 నుంచి 2023 వరకు 2,30,727 ఇళ్లకు టెండర్లు ఆహ్వానించి, కాంట్రాక్టర్లను ఖరారు చేశారు. పూర్తి చేసిన ఇళ్లు 1,50,000 వరకు ఉండగా మొండి గోడలతో మిగిలిన ఇండ్లు 80,000 వరకు ఉన్నాయని అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తున్నది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించిన ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా వదిలేశారు. నీటి సరఫరా ఉంటే కరెంటు ఉండదు, కరెంటు ఉంటే డ్రైనేజీ ఉండదు! ఈ రెండు ఉంటే మొండి గోడలు దర్శనమిస్తాయి. ఇలా సవాలక్ష కారణాలతో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూస్తే ఎవరికైనా గుండె తరుక్కు పోతుంది. తన పాదయాత్రలో డబుల్ బెడ్ రూమ్ కాలనీలకు వెళ్లగా ముట్టుకుంటే పడిపోయేలా ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అప్పట్లో విమర్శలు చేశారు. ఈ పథకం కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్నింటిని పూర్తి చేశారు? ఎందరికి ఇచ్చారని కేంద్ర ప్రభుత్వం అడిగితే కేసీఆర్ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
సిద్ధంగా ఉన్న ఇండ్లు 46,885
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఈ పథకం కింద నిర్మాణం చేసిన ఇళ్లపై జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్నది. ప్రస్తుతం లబ్ధిదారులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాటిపై వివరాలు సేకరించారు. గ్రామీణ ప్రాంతంలో 18,672, మండల కేంద్రంతోపాటు.. జిల్లా కేంద్రాల్లో 10,756, గ్రేటర్ హైదరాబాద్‌లో 17,427 ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇందులో ఇండిపెండెంట్ ఇండ్లు 11,860, రెండు లేదా మూడు అంతస్తుల్లో నిర్మాణం చేసినవి 34,995 ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న 11,860 ఇండిపెండెంట్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడానికి రూ.460 కోట్లు, గ్రౌండ్ ప్లస్ ఆ పైన ఉన్న 34,995 ఇండ్లను పూర్తి చేసేందుకు రూ.1,372 కోట్లు సమకూర్చాలని తేల్చారు. పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేసేందుకు మొత్తం రూ.1,833 కోట్ల నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు రూపొందించారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో పదివేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి మూడేళ్లు అవుతున్నది. గ్రౌండ్ ప్లస్ ఐదారు అంతస్తుల్లో వీటిని నిర్మాణం చేసి లబ్ధిదారులకు ఇవ్వకుండా వదిలేయడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎలుకలు, పందికొక్కులు, పక్షలు సంచరిస్తున్నాయి. ఒక వేళ కేటాయించినా ప్రజలు నివాసం ఉండటానికి అనువుగా లేవని స్థానిక ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.