Double Bedroom Houses | బీఆరెస్‌ పాలిట ట్రాజెడీగా మారిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ 

రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ సందర్భంగా బీఆర్ఎస్ పరిస్థితి కుడితిలోపడ్డ ఎలుక మాదిరిగా మారుతోంది. తమ హయంలో పూర్తి చేసిన ప్రాంతాల్లో కూడా పంపిణీ చేయకపోవడం ఆ పార్టీకి ఇప్పుడు శాపమైంది. పైకి కక్కలేరు... మింగలేరు... కాకుంటే నిర్మాణం మేం చేస్తే, మీరు ప్రారంభించి సంకలు గుద్దుకుంటున్నారంటూ విమర్శించి తమను తాము ఓదార్చుకుంటున్నారనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

Double Bedroom Houses | బీఆరెస్‌ పాలిట ట్రాజెడీగా మారిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ 

Double Bedroom Houses | విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ సందర్భంగా బీఆర్ఎస్ పరిస్థితి కుడితిలోపడ్డ ఎలుక మాదిరిగా మారుతోంది. తమ హయంలో పూర్తి చేసిన ప్రాంతాల్లో కూడా పంపిణీ చేయకపోవడం ఆ పార్టీకి ఇప్పుడు శాపమైంది. పైకి కక్కలేరు… మింగలేరు… కాకుంటే నిర్మాణం మేం చేస్తే, మీరు ప్రారంభించి సంకలు గుద్దుకుంటున్నారంటూ విమర్శించి తమను తాము ఓదార్చుకుంటున్నారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. నిజమే.. కొన్నిచోట్ల ఇండ్లు బీఆర్ఎస్ హయంలోనే నిర్మించినప్పటికీ.. వాటిని పేదలకు ఎందుకు పంపిణీ చేయలేదు? అవకాశం ఉన్నా మీరెందుకు పూర్తిచేసి ప్రారంభించలేదు? అంటూ ఎదురు ప్రశ్నిస్తే.. తమ పార్టీ శ్రేణులను సంతృప్తిపరిచేందుకు డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారంటూ కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉండి చేయకపోగా, ఇప్పుడు కాంగ్రెస్ ను విమర్శించడం వల్ల ఒనగూరే ప్రయోజనం లేదంటున్నారు.

రాజకీయ చిత్తశుద్ధి ప్రధానం

బీఆర్ఎస్ హయంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టినపుడు చూపిన నిజాయతీ ఆ తర్వాత పూర్తి చేసి, పంపిణీ చేయడంలో లోపించిందనే ప్రశ్నకు ఆ పార్టీ నాయకులనుంచి సమాధానం లేదు. కొన్ని పనులు చేపట్టిన సందర్భాల్లో అనుకోని అవాంతరాలు ఎదురవుతుంటాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో తెలిసిమరీ పంపిణీ ఆపివేశారు. అర్ధాంతరంగా పథకాన్ని నిలిపివేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇండ్ల పంపిణీ పూర్తి చేస్తుంటే విమర్శలు చేయడం చిత్తశుద్ధిలోపంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఈ ఇండ్ల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య క్రెడిట్ వార్ సాగుతోంది. ఈ అంశంలో బీజేపీ కూడా తమ వాటా క్రెడిట్ కోరుతోంది. ఎవరికి వారు తమ ఖాతాలోనే వేసుకునేందుకు మూడు పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారు.

డబుల్ బెడ్ రూమ్ ట్రాజెడీ

ఒక మాటలో చెప్పాలంటే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అనేది కేసీఆర్ మానస పుత్రిక, తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఒక నినాదంగా మారిన ప్రజాకర్షణీయ కార్యక్రమం. కాంగ్రెస్ నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లపై వ్యంగ్యాస్త్రాలు వేస్తూ ‘అల్లుడొస్తే.. మేక పిల్ల ఉంటే’ అంటూ కేసీఆర్ చిన్న పిట్ట కథే చెప్పేవారు. తాము డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ గూడులేని పేదలకు ‘ఇంద ధనస్సు ఇల్లు’ చూపెట్టారు. రాష్ట్రం వచ్చింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక పేదల సొంత డబుల్ బెడ్ రూమ్ కల తీరినట్లేనని అనుకున్నారు. అనుకున్నట్లుగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టింది. వరంగల్ లాంటి నగరంలో పేదల గుడిసెవాసులను తొలగించి అద్భుత కాలనీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో జర్నలిస్టుకాలనీ కూడా ఉంది. అనుకున్నట్లుగా శుక్రవారం ప్రారంభించిన అంబేద్కర్ నగర్‌లో ఏడేండ్ల క్రితమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు. దేశాయిపేట, పైడిపల్లి, దూపకుంటతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా అన్ని నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. పలు చోట్ల చిన్నచిన్న పనులు మినహా మొదటి టర్మ్‌ ముగిసేనాటికే పూర్తయ్యాయి. రేపోమాపో ఇండ్లొస్తాయని ఆశించారు. కానీ అది జరుగలేదు.

పట్టించుకోని బీఆర్ఎస్

ఎన్నికలకు ముందు ఇండ్లు పంపిణీ చేస్తారని పేదలతోపాటు ఆ పార్టీ కేడర్ కూడా ఆశించారు. ఎమ్మెల్యేలు పంపిణీని పెండింగ్ పెట్టారు. ఎన్నికలు పూర్తయ్యాయి. తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మెజార్టీ స్థానాల్లో పాత ఎమ్మెల్యేలే తిరిగి విజయం సాధించారు. విజయోత్సవాల తర్వాత తొలి కార్యక్రమం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీయే అనుకున్నారు. కానీ.. అది మళ్లీ పెండింగ్‌లో పడింది. ఇక అప్పటి నుంచి డబుల్ బెడ్ రూమ్‌లనేది కొందరికి ఒక ఆదాయవనరుగా మారింది. పార్టీలోని దళారులు, అనుచరులు, కొన్నిచోట్ల ఎమ్మెల్యేలే ఏకంగా లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేసే పనిని చేపట్టారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. పలు చోట్ల జనం ఇండ్లను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని కాలనీలు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారాయి. దర్వాజాలు, కిటికీలు మాయమయ్యాయి. మధ్యలో పథకానికే మంగళపాడారు. పేదల ఆశలు నీరుగార్చారు. ఎన్నికలకు ముందు ‘గృహలక్ష్మీ’ పథకాన్ని ప్రకటించి వేలాది మంది లబ్దిదారులను ప్రకటించారు. 2‌‌023 ఎన్నికల నాటికి కూడా డబుల్ బెడ్ రూములను పడావుబెట్టారు. ఆశావహులు, పార్టీ శ్రేణుల జాబితా చాంతడంతై ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారడంతో చేతులెత్తేశారు.

కాంగ్రెస్ కు పంపిణీ చాన్స్‌

రాష్ట్రంలో అధికారం మారింది. కాంగ్రెస్ చెప్పినట్లుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించింది. ఇదే సమయంలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆగస్టు 15 నాటికి పూర్తి చేసేందుకు నిర్ణయించి ఆ పనిలో నిమగ్నమయ్యారు. పూర్తికాని ఇండ్లకు రూ.5లక్షల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఇప్పుడు బీఆర్ఎస్ నోట్లో వెలక్కాయపడింది. ఇపుడు లబ్ధిదారుల జాబితాలో అయితే అర్హులైన పేదలు, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కుతున్నదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం ఇండ్లపై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ శ్రేణులకు చుక్కెదురవుతోంది. తమ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేస్తే తమకే ప్రాధాన్యం దక్కేది కదా? అనే అవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల పాత నాయకులే పార్టీ మారి ఇండ్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇదంతా తమ ఘనతేనంటూ చెప్పుకుని ఆత్మసంతృప్తి చెందుతున్నారు. ఇదిలా ఉండగా కేంద్రం నిధులతోనే ఈ ఇండ్ల నిర్మాణం సాగుతోందని బీజేపీ నాయకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

Padmanabhaswamy Temple | పద్మనాభ స్వామి ఆరో నేలమాళిగను తెరుస్తారా!
ఈ ఐదు ప్రశ్నలకు ఎన్నికల సంఘం జవాబేంటి? : ఎక్స్‌లో రాహుల్‌గాంధీ
GPT-5 | చాట్ జీపీటీ కొత్త అవతారం.. ‘ప్రొఫెసర్’ జీపీటీ–5 ఆవిష్కరణ