GPT-5 | చాట్ జీపీటీ కొత్త అవతారం.. ‘ప్రొఫెసర్’ జీపీటీ–5 ఆవిష్కరణ
ఓపెన్‌ఏఐ సంస్థ విడుదల చేసిన GPT-5 మోడల్ ఇప్పుడు ఉచిత యూజర్లకూ అందుబాటులోకి వచ్చింది. PhD స్థాయిలో ప్రతిస్పందించే సామర్థ్యం కలిగిన ఈ AI మోడల్, కోడింగ్, రచన, ఆరోగ్యం వంటి రంగాలలో మానవ నైపుణ్యాన్ని మించే విధంగా పని చేస్తుంది. తక్కువ తప్పులు, లోతైన ఆలోచన, వేగవంతమైన స్పందనలతో GPT-5 సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ ధీమాగా చెబుతున్నాడు.

Adharva / Tech News / 08-08-2025
GPT-5 | ఓపెన్‌ఏఐ సంస్థ తన కొత్తతరానికి చెందిన ఏఐ మోడల్ GPT-5ను గురువారం రాత్రి అధికారికంగా పరిచయం చేసింది. గతంలో విడుదలైన GPT-4o, GPT-4.5, GPT-4.1 వంటి మోడళ్లను పూర్తిగా విలీసం చేస్తూ, అభివృద్ధికి కొత్త ప్రమాణాలతో ఇప్పుడు GPT-5 అందుబాటులోకి వచ్చింది. ఇందులో విశేషంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే — ఇది ఒక సాధారణ బోట్ కాదు. ఒక PhD డిగ్రీ ఉన్న నిపుణుడితో మీరు చర్చిస్తున్నట్టే ఉంటుంది. అదేవిధంగా, ఈ మోడల్ ఇప్పుడు ఉచిత వినియోగదారులకు కూడా అందుబాటులోకి రావడం ఒక విశేషమైన మార్పు.
ఈ మోడల్ విశిష్టత గురించి ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ, “GPT-3 అంటే హైస్కూల్ విద్యార్థితో పోల్చినట్లైతే, GPT-4 అనేది డిగ్రీ విద్యార్థిగా ఉందేది. కానీ GPT-5 అనేది నిజంగా ఒక పిహెచ్డీ ప్రొఫెసర్తో మాట్లాడుతున్నట్టు ఉంటుది,” అన్నారు. GPT-5 లో మూడు భాగాలు ఉంటాయి — సాధారణ ప్రశ్నలకు సమాధానాలిచ్చే మోడల్, క్లిష్టమైన ప్రశ్నలకు లోతుగా ఆలోచించే reasoning మోడల్ (GPT5 Thinking), అలాగే ఆ అవసరాన్ని గుర్తించే ఒక రూటింగ్ వ్యవస్థ. ఇది వినియెగదారుడి ప్రశ్న రకం, దాని సంక్లిష్టత, అవసరమైన టూల్స్, ఉద్దేశ్యాన్ని బట్టి స్పందించే మోడల్‌ను ఎంచుకుంటుంది. ప్రత్యేకంగా కోడింగ్ రంగానికి ఇది ఒక వరం అని చెప్పొచ్చు. ఒకే ప్రాంప్ట్‌తో అందమైన వెబ్‌సైట్లు, యాప్స్, గేమ్స్ రూపొందించగల సామర్థ్యం GPT-5లో ఉంది. పెద్ద ప్రాజెక్టులలోని బగ్‌లను గుర్తించగలిగే శక్తి ఇందులో ఉంది. డిజైన్ విషయంలోనూ అద్భుతమైన, మానవీయ భావనలతో స్పందించే సామర్థ్యాన్ని GPT-5 ప్రదర్శిస్తోంది. అంతేకాదు, GPT-4o మోడల్‌తో పోలిస్తే ఇది 45 శాతం తక్కువ యదార్థలోపాలు, అలాగే reasoning మోడ్‌లో 80 శాతం తక్కువ తప్పుడు సమాధానాలు ఇవ్వగలదని ఓపెన్‌ఏఐ వెల్లడించింది.
GPT-5 మూడువిధాలుగా లభించనుంది — మినీ, రెగ్యులర్, ప్రో. రెగ్యులర్ వర్షన్ ఉచిత వినియోగదారులు కూడా వాడుకునే అవకాశం ఉంది. వారు వాడే పరిమితిని అధిగమించిన తరువాత ఆటోమేటిక్‌గా మినీ వర్షన్‌కు మారుతుంది. ప్రో వర్షన్‌ను పొందాలంటే నెలకు $200 చెల్లించాల్సి ఉంటుంది. reasoning మోడ్‌ను ఎప్పుడైనా యాక్టివేట్ చేసే సౌకర్యం ప్రో యూజర్లకు మాత్రమే ఉంటుంది. అయితే, ఉచిత వినియోగదారుల ప్రశ్నలు క్లిష్టత ఆధారంగా reasoning మోడల్‌ను ఆటోమేటిక్‌గా ఉపయోగిస్తుంది.
GPT-5 ప్రస్తుతం Microsoft 365 Copilot, Azure AI Foundry, Box వంటి అనేక ఏఐ టూల్స్లో ఉపయోగించబడుతోంది. Box కంపెనీ సీఈఓ మాట్లాడుతూ, “గత ఏఐ మోడల్స్ తార్కిక పత్రాలను విశ్లేషించడంలో విఫలమయ్యాయి. GPT-5 మాత్రం గణితం, లాజిక్ వంటి అంశాలలో అసాధారణంగా ప్రతిభ కనబరిచింది” అన్నారు. OpenAI ఈ మోడల్‌కు 5,000 గంటల సేఫ్టీ పరీక్షలు నిర్వహించిందని వెల్లడించింది.
ఓపెన్‌ఏఐ ఈ మోడల్‌ను అభివృద్ధి చేయడంలో కేవలం నైపుణ్యమే కాక, బాధ్యతను కూడా మర్చిపోలేదు. హానికరమైన ప్రశ్నలపై నిషేధం విధించడంవల్ల అభివృద్ధి పరిమితమవుతుందని భావించి, ఇప్పుడు GPT-5 “సేఫ్ కంప్లీషన్స్” అనే విధానాన్ని అమలు చేస్తోంది. అంటే స్పష్టంగా సమాధానం చెప్పకపోయినా, ఆలోచించడానికి సహాయపడే, హానికరంగా మారని సూచనలు ఇవ్వగలదు. వినియోగదారుడు ఎలాంటి భావోద్వేగ స్థితిలో ఉన్నా కూడా, AI బోట్ అతనితో మానవీయంగా స్పందించేందుకు ఇది రూపొందించబడింది. ఈ మధ్య చాట్జీపీటి టీనేజ్ పిల్లలకు చెడు సలహాలిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
అంతేకాదు, AIతో మానవులు నెరిపే సంబంధాలు భావోద్వేగతతో కూడినవిగా మారే ప్రమాదం ఉందన్న అంశాన్ని ఓపెన్‌ఏఐ ముందుగానే గుర్తించి, భవిష్యత్‌కు తగిన సామాజిక నియంత్రణలు అవసరం అని సూచిస్తోంది. “ఇవన్నీ మంచివే కాకుండా, కొన్ని సమస్యాత్మక సంబంధాలు కూడా ఏర్పడవచ్చు. సమాజం కొత్త నియమాలపై చర్చించాల్సి ఉంటుంది,” అని ఆల్ట్మన్ స్పష్టం చేశారు.
ప్రపంచానికి GPT-5 ఒక బహుమతి లాంటిది. ఒక్కొక్కరికీ ఒక PhD నిపుణుడిని సహాయకుడిగా నియమించినట్లే. ఇది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదు గానీ, దానికి సమర్థంగా తోడ్పడగలిగే, స్ఫూర్తిదాయకంగా మారగల సాధనం. ఇప్పుడు అది ఉచిత యూజర్లకూ అందుబాటులోకి రావడం విశేషమే. GPT-5తో మానవ నైపుణ్యం మరియు యాంత్రిక మేధస్సు మధ్య ఉన్న గీసిన గీత మెల్లాగా చెరిగిపోతోంది. ఇప్పుడు అసలు ప్రశ్న — మనం దీనిని ఎలా ఉపయోగించుకుంటామన్నది మాత్రమే.
ఇవి కూడా చదవండి..
ChatGPT | తల్లిదండ్రులూ! జాగ్రత్త… టీనేజర్లకు అత్యంత ప్రమాదకర సలహాలిస్తున్న చాట్జీపీటి
Brain Reset | మెదడును రీసెట్ చేసుకోండిలా…
Outsourcing Job Fraud| అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 2లక్షలు వసూలు