RRR | ట్రిపుల్ ఆర్ సౌత్‌కు రాజకీయ గ్రహణం! ఒక ప్రభుత్వ ఉదాసీనత.. మరో ప్రభుత్వానికి పెను భారం!

RRR | హైదరాబాద్, జూలై 3 (విధాత): తెలంగాణకు ప్రతిష్ఠాత్మకంగా మారనుందని అందరూ ఆశిస్తున్న రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్)లో కీలకమైన దక్షిన భాగం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్న చందాన నడుస్తున్నది. పదేళ్లపాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగంపై చూపిన నిర్లక్ష్యం ఫలితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సుమారు 12వేల కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ భాగంపై కేంద్రం ఇప్పటి వరకూ ఏమీ తేల్చని నేపథ్యం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నదని అధికారవర్గాలు చెబుతున్నాయి. వెరసి.. త్రిపుల్ ఆర్ దక్షిణ భాగానికి రాజకీయ గ్రహణం పట్టిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
2016లో తెరపైకి వచ్చిన రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్‌ను భారత్ మాలలో నిర్మించాలని కేంద్రం తలచింది. దీంతో ఈ ప్రాజెక్ట్ భూ సేకరణకు అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెబుతూ.. వెంటనే చేపట్టాలని కేంద్రాన్ని ఆనాడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. అయితే.. ఉత్తర భాగంపై పెట్టిన శ్రద్దలో ఇసుమంతైనా దక్షిణ భాగంపై పెట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో దక్షిణ భాగం పనులు నత్తనడకను తలపిస్తూ మూలనపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ‘భారత్ మాల’లో చేర్చి, ఉత్తర భాగానికి వేగంగా అనుమతులు ఇచ్చింది. అవార్డులు పాస్ చేసింది. నిధులు కూడా విడుదల చేసింది. కానీ.. దక్షిణ భాగాన్ని అలా వదిలేయడంతో ‘భారత్ మాల’ ప్రాజెక్ట్‌లో దక్షిణ భాగానికి చోటు దక్కకుండా పోయింది. కేసీఆర్ ఉత్తర భాగంపై చూపించిన ప్రేమలో సగం దక్షిణ భాగంపై చూపించినా భారత్ మాలలో చోటు దక్కేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ నాయకత్వంలోని కేంద్రం కూడా దక్షిణ భాగం గురించి ఏమాత్రం మాట్లాడకుండా ఉత్తర భాగానికి ఆమోదం తెలిపి వదిలేసిందని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి టెండర్లు పిలిచింది. చకచకా పనులు చేపడుతున్నది. దక్షిణ భాగానికి 182 కిలోమీటర్ల మేరకు డీపీఆర్ రూపొందించి పార్లమెంటు ఎన్నికలకు ముందు కేంద్రానికి పంపింది. ఏడాదిన్నర అవుతున్నా… ఆ ఫైలును ఎవరూ బయటకు తీయలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత ట్రిపుల్ ఆర్ దక్షిణ ప్రాంతంపై కేంద్రీకరించారు. శ్రీశైలం రోడ్‌కు ఫోర్త్ సిటీ నిర్మిస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్ ఫోర్త్ సిటీని కవర్ చేస్తూ వెళితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చి, సహచర మంత్రులతో చర్చించి పాత అలైన్‌మెంట్ మార్చాలని భావించారు. మంత్రి వర్గం కూడా ఆమోదం తెలిపింది. 182 కిలోమీటర్ల దక్షిణ భాగాన్ని 200 కిలోమీటర్లకు పెంచాలన్న నిర్ణయానికి రేవంత్ సర్కారు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ రూపొందిస్తున్నది. డీపీఆర్ పూర్తయ్యే వరకు ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నదని అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఒకసారి డీపీఆర్ తయారై, కేంద్ర మంత్రిత్వశాఖకు వెళ్లిన తరువాత దానిని మార్చాలంటే తిరిగి రివైజ్డ్ ప్రపోజల్ పంపిస్తామని చెప్పి.. ఇప్పటికే సమర్పించిన డీపీఆర్‌ను వెనక్కు తీసుకు వచ్చి.. రాష్ట్రంలో ఉన్న ఎన్ హెచ్ఏఐ ఇంజినీర్లతో కో ఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్లాలి. కానీ దీనికి విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా మరో డీపీఆర్ తయారీకి పూనుకొన్నదని తెలుస్తున్నది. దక్షిణ భాగాన్ని పూర్తిగా పక్కకు పడేసిన కేంద్రం… రేవంత్ సర్కారు తమ నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం లేదని భావించి స్వయంగా డీపీఆర్ రూపకల్పనకు పూనుకున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ సర్కారుకు కేంద్రం జాతీయ రహదారుల అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నారా? కలిసి పని చేయాల్సిన సంస్థలు ఎందుకు ఒకరి విషయం ఒకరికి తెలియకుండా వ్యవహరిస్తున్నాయో అర్థం కావడం లేదని రాష్ట్ర, జాతీయ రహదారుల వ్యవహారాలను దగ్గరగా పరిశీలించే సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అభిప్రాయ పడ్డారు.
దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని భారత్ మాలలో ప్రవేశపెట్టే అవకాశం పోయింది. తాజాగా కేంద్రం దీనిని చేపట్టాల్సి వస్తే భారత్ విజన్ 2047లో జోడించాలి. కేంద్రం నిధులు కేటాయిస్తేనే అందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య రాజకీయ వైరుధ్యం నడుస్తున్నది. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుందన్న అభిప్రాయం ఉండనే ఉన్నది. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నాయకత్వంలోని కేంద్రం దక్షిణ భాగం నిర్మాణానికి ముందుకు రాకపోయినా.. సరిగ్గా నిధులు విడుదల చేయకపోయినా ఆగిపోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు రేవంత్ ఇచ్చిన హామీ మేరకు నిర్మాణం చేయాలని తలస్తే.. గత సీఎం కేసీఆర్ చేసిన నిర్వాకం కారణంగా ఇప్పడు రాష్ట్ర ఖజానాపై రూ.12 వేల కోట్ల మేరకు భారం పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది పెరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న రేవంత్ సర్కారు.. మరో రూ. 12 వేల కోట్ల భారం అంటే తలకుమించిన భారమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే రీజినల్ రింగ్ రోడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దీని విషయంలో ప్రధానిని, గడ్కరీని త్వరలో కలుస్తామన్నారు.