- మండుటెండల్లో అర కిలోమీటర్ దూరం నడక
- ఎండలతో సెగలుగక్కుతున్న ప్రాంగణంలోని వాహనాలు
- తెలంగాణ సర్కార్కు మానవత్వం లేదా?
విధాత, హైదరాబాద్:
సచివాలయం ప్రారంభించి ఇన్నాళ్లయినా.. సందర్శకుల కష్టాలు మాత్రం తీరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి వేసవిలోనూ ఇదే పరిస్థితి రీపీట్ అవుతూ వస్తున్నది. అయినా.. సందర్శకుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాసులు జారీ చేసే కేంద్రం నుంచి సచివాలయం లోపలికి వెళ్లే వరకు చలువ దారిని ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఇంత చిన్న పనిలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కనీసం బ్యాటరీ వాహనాలు సమకూర్చడం లేదని పలువురు వాపోతున్నారు. ముఖ్యంగా అరవై సంవత్సరాల వయస్సు దాటిన పెద్దవాళ్లు ఊసురోమంటున్నారు.
మండిపోతున్న వాహనాలు
వాహనాలు పార్కింగ్ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పినప్పటికీ అంతా అబద్ధమేనని అక్కడికి వచ్చే డ్రైవర్లు చెబుతున్నారు. సందర్శకులు తమ కార్లను పార్కింగ్ చేసేందుకు ప్రతి రోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఇలా ఉంటే మండుటెండల్లో పార్కింగ్ చేయడం మరో సమస్యగా మారింది. ఫలితంగా వాహనాలు ఎండలకు మాడిపోతున్నాయి. యజమానులు పనులు నిమిత్తం లోపలికి వెళ్తే, డ్రైవర్లు ఏసీ ఆన్ చేసి లోపలే కూర్చుంటున్నారు. అటు ఎండలు, ఇటు కార్ల ఏసీల నుంచి వెలువడే ఎక్స్‌ట్రా వేడితో ప్రాంతమంతా నిప్పుల కుంపటిని తలపిస్తూ దారినపోయేవారికి సెగలు అంటిస్తున్నది. దానికితోడు ఆయిల్ కూడా ఆవిరైపోతున్నదని డ్రైవర్లు చెబుతున్నారు. ఉన్నతాధికారుల డ్రైవర్ల దుస్థితి మరోలా ఉంది. కార్లను ఎండలో పార్కింగ్ చేసి, నీట పట్టున కూర్చుంటున్నారు. వడదెబ్బతో పాటు మూత్ర సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది డ్రైవర్లు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉన్నతాధికారులు తమ చాంబర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పావు గంట ముందే ఫోన్ చేసి రావాలని డ్రైవర్లు షరతు విధిస్తున్నారు. వచ్చే లోగా వాహనంలో ఏసీ ఆన్ చేసి చల్లబరుస్తున్నారు. ప్రతి ఎండాకాలంలో ఇదే సమస్య అని పలువురు డ్రైవర్లు వాపోతున్నారు.
ఎండల్లో మాడుతున్న సందర్శకులు
- సచివాలయంలో సౌతీస్ట్ గేటు నుంచి సందర్శకులను ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు అనుమతిస్తున్నారు.
- ఈ గేటుకు సమీపంలో రిసెప్షన్ సెంటర్ ఉంది. సందర్శకులకు ఇక్కడ పాసులు జారీ చేస్తారు.
- ఈ పాసును తీసుకుని సౌతీస్ట్ గేటు ద్వారా సచివాలయం లోపలికి వెళ్తారు.
- పాసులు జారీ చేసే కేంద్రం నుంచి సచివాలయం లోపలకు చేరుకోవడానికి అర కిలోమీటర్ దూరం ఉంది.
- ఇంత దూరం వెళ్లడానికి సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. మండు టెండల్లో నడవలేకపోతున్నామని పలువురు పెద్దవాళ్లు వాపోతున్నారు.
- కొందరైతే నీళ్ల బాటిళ్లను, గొడుగులను వెంట తీసుకుని భయం భయంగా అడుగులు వేసుకుంటూ లోపలికి చేరుకుంటున్నారు.
దరఖాస్తులు ఇవ్వడానికి, ఆర్డర్ కాపీలు తీసుకోవడానికి వచ్చేవారు కూడా లోపలికి వెళ్లక తప్పడం లేదు. కనీసం ఇన్ వార్డు, ఔట్ వార్డు సెక్షన్లు అయినా బయట ఏర్పాటు చేస్తే లోపలికి వెళ్ళే సమస్య తప్పుతుందని పలువురు కోరతున్నారు. రిసెప్షన్ నుంచి సచివాలయం లోపల ప్రధాన భవనం వరకు సందర్శల కోసం నీడ వచ్చేలా పాలీ కార్బనేట్ షెడ్ లేదా ఫైబర్ లేదా గ్రీన్ షీట్ ఏర్పాటు చేయాలని పలువురు సందర్శకులు కోరుతున్నారు. సందర్శకులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఒక వ్యక్తి హైకోర్టులో కేసు కూడా వేశారు. ఈ కేసు పై ఇంకా తుది తీర్పు రాలేదు. మరి సందర్శకుల బాధలు ఇంకా ఎన్నేళ్లు కొనసాగుతాయో!