Telangana RTA Inaction | సీజ్ కన్నా ‘ఛీజ్’ కే ఆర్టీఏ మొగ్గు! అలిపిరి, అదిలాబాద్ జిల్లా నుంచి నేర్చుకోండి!

నిబంధనలు పాటించని ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్ నుంచి వేర్వేరు నగరాలకు యథేచ్ఛగా సర్వీసులు నడుపుతున్నా.. తెలంగాణ ఆర్టీఏ ఇంకా ఎందుకు యాక్షన్లోకి దిగలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Telangana RTA Inaction | సీజ్ కన్నా ‘ఛీజ్’ కే ఆర్టీఏ మొగ్గు! అలిపిరి, అదిలాబాద్ జిల్లా నుంచి నేర్చుకోండి!

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

Telangana RTA Inaction | నిబంధనలు ఉల్లంఘించి, అనుమతులు లేకుండా తిరుగుతున్న ట్రావెల్స్ బస్సులను కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ అధికారులు సోదాలు చేసి సీజ్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచే తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా తెలంగాణ రవాణా అధికారులు మాత్రం ఇంకా మేల్కొన లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొక్కుబడిగా ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఒక్క బస్సును కూడా ఇంత వరకు సీజ్ చేయలేదు. కర్నూలు ప్రమాదంపై సమీక్షలు నిర్వహించి, కఠిన చర్యలకు సమాయత్తమయ్యేందుకు ఉన్నతాధికారులకు ఇంకా ఎంత సమయం పడుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ బస్సులు అంటూ తెలంగాణ రవాణ శాఖ అధికారులు నాటకమాడుతున్నారని, ఏ రాష్ట్రం బస్సు అయినా ఇక్కడ నడిపితే తనిఖీలు చేసి, సీజ్ చేసే అధికారం ఉన్నా ప్రయోగించడం లేదని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రతినెలా ట్రావెల్స్ నుంచి మామూళ్లు అందటమే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. సీజ్ చేస్తే తిరగబడి కొట్టే ప్రమాదం ఉండటంతో అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో అదిలాబాద్ జిల్లాలో అక్రమంగా అనుమతులు లేకుండా తిరుగుతున్న ట్రావెల్స్ బస్సుల పై డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ (డీటీసీ) కఠినంగా వ్యవహరించారు. అనుమతులు ఉల్లంఘించిన బస్సులను సీజ్ చేశారు. బస్సు యజమానులు హైకోర్టు వెళ్లినప్పటికీ ఉపశమనం లభించలేదు. ఇదే విధానాన్ని అమలు చేస్తే ట్రావెల్స్ యజమానులు దారికి రావడమే కాకుండా ప్రమాదాలు తప్పుతాయని ఒక రిటైర్డ్ అధికారి వ్యాఖ్యానించారు.

ఇదీ ఆదిలాబాద్ అనుభవం..

రాజకీయ పలుకుబడితో నాగపూర్ నుంచి హైదరాబాద్ కు ట్రావెల్స్ బస్సులను కొన్నేళ్లుగా నడుపుతున్నారు. 2013 సంవత్సరంలో అనుమతులు లేకుండా నడుస్తున్నాయంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో అదిలాబాద్ జిల్లా డీటీసీ రంగంలోకి దిగారు. ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము వరకు తనిఖీలు చేయడం మొదలు పెట్టారు. తనిఖీల్లో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలిన వెంటనే సదరు బస్సును సీజ్ చేసేవారు. ఇలా మొత్తం 36 బస్సులను సీజ్ చేసి నిర్మల్, అదిలాబాద్ ఆర్టీసీ డిపోల్లో పార్కింగ్ చేయించారు. రోజుల తరబడి అక్కడే మగ్గి, వాటికి దుమ్ము దూళి పట్టాయి. దీంతో మిగతా యజమానులు భయపడి నడిపించడం మానేశారు. మంచిర్యాల మీదుగా బస్సులు తిప్పుతామని ఆపరేటర్లు చెప్పగా, జిల్లా పరిధిలో ఎక్కడ తిప్పినా సీజ్ చేస్తామని డీటీసీ హెచ్చరించారు. సుమారు ఎనిమిది నెలల పాటు హైదరాబాద్ నుంచి నాగపూర్ మధ్య ప్రైవేటు బస్సులు రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. పై స్థాయి నుంచి ఎంతగా ఒత్తిడి చేసినా డీటీసీ విన్పించుకోకపోవడంతో హైకోర్టు లో కేసు వేశారు. కాంపౌండ్ ఫీజు తీసుకుని బస్సులను వదిలేయాలని, ప్రాసిక్యూషన్ వద్దని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశం మేరకు నిర్మల్ తో పాటు అదిలాబాద్ డిపోలలో పార్కింగ్ చేసిన 36 బస్సులను రిలీజ్ చేశారు. ఒక్కో బస్సు విలువ కనీసం రూ.2 కోట్ల వరకు ఉండడం, ఏదైనా డ్యామేజీ అయితే ప్రభుత్వం నుంచి పరిహారం చెల్లించాల్సి ఉండడంతో రిలీజ్ చేయడానికి కారణంగా చెబుతున్నారు.

నిరంతర అకస్మిక తనిఖీలతోనే ప్రాణాలకు భద్రత

రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేటు బస్సులు, స్కూలు బస్సులు, ట్రావెల్స్ పై నిరంతరం తనిఖీలు నిర్వహించాలని గతంలో సిఫారసులు చేశారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం మూలంగా బస్సు ఆపరేటర్లు అప్రమత్తమై, ఎప్పటికప్పుడు అనుమతులు తీసుకుంటారు. అప్పటికప్పుడు ఏ అంశంపై తనిఖీ చేయాలనే దానిపై ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వాలి. ఇలా చేయడం మూలంగా ఏ రోజు ఏ సమస్యపై తనిఖీలు చేస్తారనేది అటు కింది స్థాయి ఉద్యోగులు, బస్సు ఆపరేటర్లకు తెలిసే అవకాశం ఉండదు. ఒకసారి ఓవర్ స్పీడ్, మరోసారి ఇన్సూరెన్స్ ఇలా ఫిట్ నెస్, ఓవర్ లోడ్, డ్రంకన్ డ్రైవ్ పై తనిఖీలు చేస్తే తప్పులు చేసే వారు, నిర్లక్ష్యం వహించేవారు తప్పించుకునే వీలుండదు. ఫలితంగా యజమానులు అన్ని రకాల అనుమతులు తీసుకుంటారు. ప్రయాణికుల ప్రాణాలకు భద్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్ టూ బెంగళూరుకు ఆర్టీసీ బస్సులు పెంచాలి

ప్రైవేటు ఆపరేటర్లకు పోటీగా తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ టూ బెంగళూరు, హైదరాబాద్ టూ విజయవాడ రూట్లో బస్సుల సంఖ్య పెంచాలన్న అభిప్రాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆర్టీసీ బస్టాండ్లలో కాకుండా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే హోటళ్ల వద్ద కూడా బస్సులు నిలిపేలా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బస్టాండ్ క్యాంటిన్లలో ఆహారం రుచిగా, శుభ్రంగా ఉండకపోవడం వంటి కారణాలతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రయాణికులు కూడా లేకపోలేదని చెబుతున్నారు. బస్టాండ్లలో టాయ్ లెట్లు కూడా శుభ్రంగా లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. ప్రైవేటు బస్సుల మాదిరే జాతీయ రహదారిపై రుచి, శుభ్రత ఉన్న హోటళ్ల వద్ద ఆపితే ప్రయాణికులు పెరిగే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు. ఇదే కాకుండా ప్రైవేటు బస్సుల్లో వెళ్తే జరిగే ప్రమాదాల పట్ల ప్రజలను చైతన్యవంతులు చేయాలి. ప్రసార, ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించాలి. ప్రయాణీకుల అభిప్రాయం మేరకు ఆర్టీసీ బస్సులను నడిపితే ఆక్యుపెన్సీ పెరుగుతుందని, ప్రైవేటు ఆపరేటర్ల అరాచకాలు తగ్గుతాయని అంటున్నారు.

అలిపిరిలో కఠిన నిబంధనలు

తిరుపతిలోని అలిపిరి గేట్ నుంచి తిరుమల వెళ్లే బస్సులకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అలిపిరి గేట్ నుంచి తిరుమలకు వెళ్లడానికి ప్రయాణ సమయం 45 నిమిషాలుగా నిర్ణయించారు. రెండు మూడు నిమిషాల ముందుగానే చేరుకుంటే సదరు బస్సుపై పోలీసులు చలానా విధిస్తారు. ప్రతి బస్సుకు స్పీడ్ కంట్రోల్ పరికరం అమర్చారు. భక్తుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ రవాణా అధికారులు తెలిపారు.

చెక్ పోస్టు నుంచి చెక్ పోస్టు మధ్య నిఘా పెంచాలి

ప్రైవేటు బస్సులకు వేగ నియంత్రణ అమలు చేయాలని రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ రహదారులపై తిరిగే బస్సుల వేగ నియంత్రణ అమలు చాలా సులువు అని అంటున్నారు. ఒక చెక్ పోస్టు నుంచి మరో చెక్ పోస్టు మధ్య ఎంత సమయంలో ప్రయాణించింది లెక్కవేయాలి. స్పీడ్ పరిమితి మించి ప్రయాణిస్తే తరువాత వచ్చే చెక్ పోస్టు వద్ద ఆపేసి కేసు నమోదు చేయాలి. అప్పటికీ విన్పించుకోకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే బస్సును సీజ్ చేయాలని అంటున్నారు. ఆర్టీసీ బస్సుల మాదిరే ప్రైవేటు బస్సుల వేగం నియంత్రించాలని సూచిస్తున్నారు.