RTA Failures | మామూళ్ల మత్తులో ఆర్టీఏ.. రాజ్యమేలుతున్న ట్రావెల్స్ మాఫియా!

ప్రతినెలా సంబంధిత పోలీసు స్టేషన్ కు మామూళ్లు అందుతాయని, నగరంలో ఎంపిక చేసిన పోలీసు స్టేషన్లకు ప్రతి నెలా ట్రావెల్స్ యజమానులు డబ్బులు ముట్టచెబుతారని తెలుస్తున్నది. ఈ కారణంగానే ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై ఈగ కూడా వాలడం లేదని అంటున్నారు. ఇప్పుడు ఇంతటి ఘోర దుర్ఘటన తర్వాతనైనా రవాణా శాఖ అధికారులు కళ్లు తెరుస్తారా? లేదా తాత్కలికంగా కళ్లు తెరిచి.. రెండు మూడు రోజులు హడావుడి చేసి.. మళ్లీ అదే మామూళ్ల మత్తులో జోగుతూ పడుకుంటారా? కాలమే తేల్చాలి.

RTA Failures | మామూళ్ల మత్తులో ఆర్టీఏ.. రాజ్యమేలుతున్న ట్రావెల్స్ మాఫియా!
  • వేమూరి కావూరి బస్సు దుర్ఘటన వెనుక విస్తుపోయే వాస్తవాలు
  • ఇన్సూరెన్స్ లేదు, పిట్ నెస్ కూడా లేదు
  • బస్సు ప్రమాదం పాపంలో ఆర్డీఏ కు బాధ్యత
  • ప్రతినెలా ట్రాఫిక్ పోలీసులకు మామూళ్లు

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

RTA Failures |  తెలంగాణ రవాణా శాఖ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు నిద్ర పోతున్నారా? ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యజమానులు ప్రతి నెలా ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి ప్రజల ప్రాణాలు తీస్తున్నారా? కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం పాపంలో తెలంగాణ రవాణా శాఖ బాధ్యత కూడా ఉందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇన్సూరెన్స్ లేకుండా నడి రోడ్డు మీద తిరుగుతున్నా, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ తీసుకోకుండా పక్కాగా ప్రయాణికులను ఎక్కించుకుంటున్నా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నెలల తరబడి జాతీయ రహదారులపై బస్సు తిరుగుతున్నా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సీజ్ చేయకుండా, కాంపౌండ్ ఫీజు వేయకుండా వదిలివేశారంటే రవాణా శాఖలో అధికారుల అండదండలు ట్రావెల్స్‌ మాఫియాకు ఎంత పుష్కలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రమాదానికి గురైన బస్సును తొలుత సీటింగ్ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించి.. ఆ తరువాత స్లీపర్‌గా మార్చారు. వేమూరి కావేరి ట్రావెల్స్ స్లీపర్‌ బస్సు విషయంలో నిబంధనల ఉల్లంఘనలకు తెలంగాణ రవాణా శాఖ వెన్నుదన్నుగా ఉందనేది దీనిబట్టే తేలిపోతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గమనించాల్సిన విషయం ఏమంటే గురువారం వరకు బెంగళూరు జాతీయ రహదారిపై రవాణా శాఖ చెక్ పోస్టులు ఉన్నాయి. దుర్ఘటనకు కొన్ని గంటల ముందే తెలంగాణ ప్రభుత్వం చెక్ పోస్టులను ఎత్తివేసింది. అయినా తప్పించుకుని ఈ బస్సు రాకపోకలు సాగించింది అంటే రవాణా అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి అనేది వెల్లడి అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సీటింగ్‌ నుంచి స్లీపర్‌ కోచ్‌!

ఏపీలోని కర్నూలులో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున వేమూరి కావూరి బస్సు అగ్నిప్రమాదానికి గురై.. ఇప్పటి వరకు ఇద్దరు చిన్నారులు సహా 19 మంది చనిపోగా, 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో గాయాలపాలైన 12 మంది కర్నూలు జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు దగ్ధం ఘటనపై కర్నూలు జిల్లాలోని ఉళ్లింద కొండ పోలీసు స్టేషన్‌లో రమేశ్‌ అనే ప్రయాణీకుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించారంటూ 125 సీ/ఏ, నిర్లక్ష్యం మూలంగా ప్రమాదం జరిగిందంటూ 106సీ/1 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు 2018 లో తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఆ తరువాత 2023లో నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూ డామన్‌కు రిజిస్ట్రేషన్ మార్పు చేశారు. డయ్యూ డామన్ రిజిస్ట్రేషన్ నంబర్ మీద బస్సుకు ఆల్ ఇండియా పర్మిట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం టూరిస్టు స్కీమ్ కింద కొత్తగా నిబంధనలు తీసుకువచ్చింది. ఏ రాష్ట్రంలో అయినా టూరిస్టు పర్మిషన్ తీసుకుంటే చాలు దేశంలోనే ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పించారు. దేశంలో పర్మిట్ ఫీజులు మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణ, ఏపీలో అధికంగా ఉన్నాయి. దీంతో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, డయ్యూ డామన్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పర్మిట్లు తీసుకుని ఏపీ, తెలంగాణలో ట్రావెల్స్ బస్సులు ఎలాంటి భయం లేకుండా నడుపుతున్నారు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును సీటింగ్ నుంచి స్లీపర్ సెల్, ఇతర రాష్ట్రాలకు మార్పిడిపై ప్రతి చోట రవాణా శాఖ అధికారులు కుమ్మక్కయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.

దర్జాగా తిరుగుతున్నా సీజ్ చేయలేదు

ఈ ఏడాది మార్చి 31వ తేదీన బస్సు ఫిట్‌నెస్ వాలిడిటీ ముగిసింది. పొల్యూషన్ వాలిడిటీ 2024 ఏప్రిల్ 2వ తేదీతో ముగిసింది. ఇన్సూరెన్స్ వాలిడిటీ కూడా గత ఏడాది ఏప్రిల్ 20న ముగిసింది. అయినా తెలంగాణ, ఏపీ రవాణా అధికారులు బస్సును సీజ్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ లేనట్లయితే ఆర్డీఏ అధికారులు బస్సును సీజ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అప్పగిస్తే కేసు నమోదు చేసు బస్సును వదిలేస్తారు. చాలా సందర్భాలలో కాంపౌండ్ ఫీజు కూడా విధిస్తారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు నిత్యం వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు రాకపోకలు సాగిస్తున్నా రవాణా అధికారులకు కన్పించకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రతినెలా అందాల్సిన మామూళ్లు అందుతుండడంతో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను పట్టించుకోలేదని తెలుస్తోంది. పై పెచ్చు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను చలానాలు వేశారు. హై స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్, నో ఎంట్రీ వంటి తప్పిదాలకు తొమ్మిది నెలల నుంచి చలానాలు విధిస్తున్నా చెల్లించలేదు. రూ.23వేల పెండింగ్ చలానాలను వసూలు చేయడంలో ట్రాఫిక్ పోలీసుల వైఫల్యం కూడా కనిపిస్తున్నది. సాధారణంగా హైదరాబాద్ రోడ్లపై ద్విచక్ర వాహనం లేదా కారుపై వేయి లేదా రెండు వేల రూపాయల చలానాలు పెండింగ్‌లో ఉంటేనే ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపేస్తారు. అప్పటికప్పుడు యజమాని నుంచి చలానా వసూలు చేసిన తరువాతనే వెళ్లేందుకు అనుమతిస్తారు. ఇదే విధానాన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల విషయంలో ఎందుకు పాటించడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి నుంచి ప్రతినెలా సంబంధిత పోలీసు స్టేషన్ కు మామూళ్లు అందుతాయని, నగరంలో ఎంపిక చేసిన పోలీసు స్టేషన్లకు ప్రతి నెలా ట్రావెల్స్ యజమానులు డబ్బులు ముట్టచెబుతారని తెలుస్తున్నది. ఈ కారణంగానే ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై ఈగ కూడా వాలడం లేదని అంటున్నారు. ఇప్పుడు ఇంతటి ఘోర దుర్ఘటన తర్వాతనైనా రవాణా శాఖ అధికారులు కళ్లు తెరుస్తారా? లేదా తాత్కలికంగా కళ్లు తెరిచి.. రెండు మూడు రోజులు హడావుడి చేసి.. మళ్లీ అదే మామూళ్ల మత్తులో జోగుతూ పడుకుంటారా? కాలమే తేల్చాలి.