Police complaint on mother | అమ్మ, అక్కపై పోలీసులకు ఓ బుడ్డోడి ఫిర్యాదు! : తక్షణమే స్పందించిన పోలీసులు
మధ్యప్రదేశ్‌లో 10 ఏళ్ల బాలుడు కుర్‌కురే కోసం 20 రూపాయలు ఇవ్వలేదని అమ్మ, అక్కపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిరునవ్వులు విరబూయించిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

10-year-old calls police after mother refuses ₹20 for Kurkure; cop’s kind gesture melts hearts
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో ఓ పిల్లాడు తన అమ్మ, అక్కపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. బాగా కొట్టారేమోనని ఫీలవుతున్నారా? కాదు, 20 రూపాయల కుర్‌కురే కొనివ్వలేదని..
ఈ ఫిర్యాదు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం వినగానే ఎవరికైనా చిరునవ్వు వస్తుంది —చిటార్వాయి కళా గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలుడు తన తల్లి, అక్క కుర్‌కురే కోసం 20 రూపాయలు ఇవ్వకపోవడంతో కోపంగా 112 ఎమర్జెన్సీ పోలీస్ హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేశాడు. పోలీసు ఆపరేటర్ సమాధానంగా అడిగాడు, “ఏం జరిగింది బాబూ?” అని. అడగ్గా, బాలుడు కన్నీళ్లు పెట్టుకుంటూ, “నాకు ₹20 కావాలి. అమ్మా, అక్క ఇవ్వలేదు. కొట్టారు కూడా!” అని చెప్పాడు. ఆ ఆడియో తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఈ ఫిర్యాదు అందుకున్న వెంటనే, 112 సిబ్బందిలోని యుమేష్ విశ్వకర్మ అనే పోలీస్ అధికారి బాలుడి ఇంటికి వెళ్లారు. ఆ బాలుడిని, అతని తల్లిని పిలిపించి ప్రేమగా మాట్లాడి, తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చారు. “పిల్లలను అలా కొట్టకూడదు కదా, శాంతంగా మాట్లాడాలి” అని తల్లికి సలహా ఇచ్చారు.
తర్వాత బాలుడిని ఓదార్చి, తనే ఒక కుర్‌కురే ప్యాకెట్ కొనిచ్చి నవ్వించాడు. చిన్నోడి ముఖంలోని ఆ చిరునవ్వే ఈ కథకు అద్భుతమైన ముగింపుగా మారింది. ఈ ఘటన చోటుచేసుకున్న చిటార్వాయి కళా గ్రామం ఖుటర్ ఔట్‌పోస్ట్ పరిధిలోని కోట్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. చాలామంది యూజర్లు “పోలీసుల మానవత్వం మిగతా వారికి ఆదర్శం” అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు “ఇది చైల్డ్ హెల్ప్‌లైన్ 112 ఎలా పని చేస్తుందో చూపించింది” అని అభిప్రాయపడ్డారు.
సింగ్రౌలి పోలీసులు “చిన్న సమస్యకైనా పెద్ద మనసుతో స్పందించాలి — అదే నిజమైన పోలీసింగ్” అంటూ ఈ సంఘటనను సామాజిక అవగాహనపై ఒక పాఠంగా చెప్పుకున్నారు.