• Telugu News
  • /National

ఎమర్జెన్సీ లో జైలుకెళ్లిన బెంగాళీలకు పెన్షన్లు

ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లిన 325 మందికి నెలకు రూ.10 వేల పెన్షన్‌ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో 13వ రాష్ట్రంగా ఈ పథకం అమలు కానుంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Aug 11, 2026, 3:02 pm IST
Read Time: 10 mins
ఎమర్జెన్సీ లో జైలుకెళ్లిన బెంగాళీలకు పెన్షన్లు

పశ్చిమ బెంగాల్ సీఎం నిర్ణయం
325 మందికి ప్రతి నెలా రూ.10వేలు
13వ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెన్షన్లు అమలు

దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలు చేస్తున్న విధంగా పశ్చిమ బెంగాల్ లో ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లిన వారికి ప్రతినెలా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేంధు అధికారి ప్రకటించారు. రాష్ట్రంలో ఇకనుంచి 325 మందికి ప్రతి నెలా రూ.10వేల చొప్పున పెన్షన్లు చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర సచివాలయం నబన్న లో సువేంధు అధికారి మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పలువురు పోరాడారన్నారు. ఆ సమయంలో ఎంతో ధైర్యం చూపడంతో పాటు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆయన కొనియాడారు. ఇందిరా గాంధీ అమలుచేసిన ఎమర్జెన్సీ మూలంగా పశ్చిమ బెంగాల్ లో 325 మంది జైలుకు వెళ్లారన్నారు. కొందరు నెల రోజులు, మరికొందరు ఆరు నెలలు జైలులో నరకం అనుభవించారన్నారు. దేశం కోసం, ప్రజల హక్కుల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారిని తమ ప్రభుత్వం గుర్తిస్తున్నదని ఆయన అన్నారు. పశ్చిమ బంగా లోకతంత్ర సేనాని సమ్మాన్ పథకం కింద వీరిని ఎమర్జెన్సీ వ్యతిరేక యోధులుగా గుర్తించామని తెలిపారు. 1975 లో జరిగిన ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్యా దివస్ గా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. పలు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారికి అవార్డులు ఇవ్వడంతో పాటు పెన్షన్లు కూడా ఇస్తున్నాయని సువేంధు తెలిపారు.

12 రాష్ట్రాలలో ఇప్పటికే అమలు…

ఇందిరా గాంధీ జూన్ 25, 1975 నుంచి మార్చి 31, 1977 వరకు ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో విపక్ష పార్టీలకు చెందిన పలువురిని జైలులో వేశారు. 2018 లో మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చన బీజేపీ ప్రభుత్వం ఎమర్జెన్సీలో జైలు జీవితం అనుభవించిన వారికి ప్రతి నెలా రూ.10వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. వారు చనిపోయినట్లయితే భార్య లేదా భర్తకు రూ.5వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఒక నెల కన్నా తక్కువ రోజులు జైలు జీవితం గడిపిన వారికి రూ.5వేలు, వారు చనిపోయినట్లయితే భార్య లేదా భర్తకు రూ.2,500 చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే 2020 లో అధికారంలోకి వచ్చిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం ఈ గౌరవ వేతనాన్ని రద్ధు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఆధ్వర్యంలో ఎంవీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ రాష్ట్రమే కాకుండా ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిశా, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, అసోం, జార్ఖండ్ రాష్ట్రాలలో పెన్షన్లు ఇస్తున్నారు. ఈ పెన్షన్ విధానాన్ని తొలుత 2006 సంవత్సరంలో సమాజ్ వాదీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వాలు మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్ లో అమలు చేయడం ప్రారంభించాయి. బిహార్ లో లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జెడీ ప్రభుత్వం, జార్ఖండ్ లో జేఎఎం ప్రభుత్వం అమలు చేసింది. అయితే బీజేపీ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లో నిలిపివేశాయి. ఒడిశాలో ప్రతినెలా రూ.20వేలు, మధ్య ప్రదేశ్ లో రూ.30 వేలు (6 నెలలు మించి జైలులో ఉంటే), ఒక నెల లోపు జైలు జీవితం గడిపితే రూ10వేలు, ఉత్తరప్రదేశ్ లోరూ.20వేలు, చత్తీస్ గఢ్ లో రూ.25 వేలు (6 నెలలు జైలు జీవితం), ఆరు నెలల లోపు అయితే రూ.8వేలు చెల్లిస్తున్నారు. బిహార్ లో జయప్రకాశ్ నారాయణ్ సేనానీ సమ్మాన్ కింద 2009 నుంచి రూ.15వేల చొప్పున పెన్షన్ తో పాటు ఉచిత వైద్య సౌకర్యం అమలు చేస్తున్నారు. హర్యానాలో లోక్ తంత్ర సేనానీ పథకం కింద 2017 నుంచి రూ.20వేల పెన్షన్ ఉచిత వైద్యం, రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2017 నుంచి రూ.16వేల చొప్పున చెల్లిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో 2021 లో నుంచి రూ.11వేల చెప్పున చెల్లిస్తుండగా, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రద్ధు చేసింది. దీనిపై కొందరు హైకోర్టు కు వెళ్లగా పథకాన్ని పునరుద్ధరించారు. 2008 సంవత్సరం నుంచి రాజస్థాన్ లో రూ.20వేల పెన్షన్ తో పాటు ప్రతి నెలా వైద్య ఖర్చులకు రూ.4వేల చెప్పున విడుదల చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రద్ధు చేయగా, మళ్ళీ 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని పునరుద్ధరించింది. మహారాష్ట్రలో 2008 లో లోక్ తంత్ర సేనా పేరుతో పెన్షన్ పథకాన్ని ప్రారంభించి, ఆరు నెలల పాటు రూ.10వేల చొప్పున విడుదల చేసింది. 2020 లో అధికారంలోకి వచ్చిన మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని రద్ధు చేసింది. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ల నేతృత్వంలో ఎంవీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. అసోం లో 2023 నుంచి రూ.15 వేలు, జార్ఖండ్ లో రూ.5వేల చొప్పున చెల్లిస్తున్నారు. ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లిన వారితో పాటు జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వారికి కూడా ఈ పథకం వర్తింప చేస్తున్నారు. ఇదే తరహాలో ఢిల్లీ, కేరళం, కర్నాటక రాష్ట్రాలలో అమలు చేయాలని లోకతంత్ర సేనానీ సంఘ్ పోరాడుతున్నది. అయితే కేరళం తో పాటు కర్నాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి.