Life Imprisonment to Dogs | ఇక కుక్కలకు జీవిత ఖైదు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
Life Imprisonment to Dogs | మనషులు అతి క్రూరమైన నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు విధించడం చూశాం. కానీ మూగ జీవాలు మనషులపై దాడులకు పాల్పడినా వాటిపై ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. కానీ తొలిసారి కుక్కలకు జీవిత ఖైదు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెండోసారి కుక్క కరిస్తే దానికి జీవిత ఖైదు విధించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

Life Imprisonment to Dogs | హైదరాబాద్ : వీధి కుక్కల( Dogs ) పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం( Uttar Pradesh Govt ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల కుక్క కాటు( Dog Bite ) బాధితుల సంఖ్య అధికమైపోతున్న క్రమంలో యోగి సర్కార్( Yogi Govt ) ఈ నిర్ణయం తీసుకుంది. చాలా మంది పిల్లలు కుక్క కాటుకు గురై రేబిస్ వ్యాధి బారిన పడుతున్నారు.
ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా వీధి కుక్కల బెడద ఎక్కువైందని, వీటి కాటు వల్ల పిల్లలు రేబిస్ వ్యాధి బారిన పడుతున్నారని యూపీ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో రెండవసారి కరిస్తే కుక్కకు జీవిత ఖైదు విధించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
వీధి కుక్కలను నియంత్రించడానికి జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని యూపీ సర్కార్ నిర్మించింది. మొదటిసారి మనిషిని కరిచిన కుక్కను 10 రోజుల పాటు జంతు జనన నియంత్రణ కేంద్రంలో ఉంచి.. టీకా వేసి, శరీరంలో మైక్రో చిప్‌ను అమర్చి విడుదల చేయనున్నారు. రెండో సారి అదే కుక్క కరిస్తే దాన్ని అదే కేంద్రంలో జీవితాంతం ఉంచేటట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కుక్క కాటుపై పశుసంవర్ధక అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, SPCA సభ్యుల కమిటీ దర్యాప్తు చేయనుంది. కరిచినట్లు పూర్తి ఆధారాలు ఉంటేనే కుక్కకు జీవిత ఖైదు విధించనున్నారు.