Techie | ఐటీ జాబ్ వదిలేసి రైతుగా మారాలని అనుకున్న ఓ టెక్కీ కథ విషాదాంతంగా ముగిసింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి వ్యవసాయంలోకి అడుగుపెట్టిన కొంతకాలానికే పిడుగుపడి మృతిచెందాడు. కర్ణాటకలోని మైసూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళ్తే.. కొడుగు జిల్లా మడికేరి చెందిన రోషన్ బాలకృష్ణ (43) ఐటీ ఉద్యోగి. వ్యవసాయంపై ఆసక్తితో ఇటీవల తన ఉద్యోగాన్ని వదిలేశాడు. స్నేహితుడితో కలిసి వ్యవయసాయం చేయడం మొదలుపెట్టాడు. దీంతో పాటు ఆధునిక వ్యవసాయ పరికరాలను మార్కెటింగ్ చేయడం సైడ్ బిజినెస్‌గా పెట్టుకున్నాడు. కొత్త పరికరాలపై రైతులకు అవగాహన కల్పించడం, మార్కెటింగ్ చేయడం చేసేవాడు.
ఇదిలా ఉండగా బుధవారంనాడు కుటుంబసభ్యులతో కలిసి రోషన్ బాలకృష్ణ మైసూర్‌లోని ఓ పొలం చూసేందుకు వెళ్లాడు. అక్కడ మామిడి చెట్ట వద్ద పండ్లు కోస్తుండగా.. ఒక్కసారిగా అతనిపై పిడుగుపడింది. దీంతో రోషన్ బాలకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు స్వల్పంగా గాయపడ్డాడు.
పిడుగుపడి మృతిచెందిన రోషన్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. ఎస్‌డీఆర్ఎఫ్ నుంచి రూ.4లక్షలు, ఎన్‌డీఆర్ఎఫ్ నుంచి రూ.లక్ష అందజేయనున్నట్లు వెల్లడించాయి. కాగా, వర్షాకాలంలో బహిరంగ ప్రదేశాలు, వ్యవసాయ భూముల్లో పిడుగుపాటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
