శ్రీశైలంలో జల విన్యాసం.. 8 గేట్ల ద్వారా సాగర్‌కు కృష్ణమ్మ పయనం

శ్రీశైలం ప్రాజెక్టులో జల విన్యాసం కనువిందు చేస్తోంది. కృష్ణా నది నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నుంచి ఎనిమిది గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలంలో జల విన్యాసం.. 8 గేట్ల ద్వారా సాగర్‌కు కృష్ణమ్మ పయనం

మంగళవారం రాత్రి వరద పెరగడంతో పది గేట్ల ఎత్తివేత
బుధవారం సాయంత్రం 2.84 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 884.50 అడుగులు..
పూర్తి స్థాయి నీటి మట్టం 885.8 అడుగులు
ఎగువ నుంచి తగ్గుతున్న వరద ప్రవాహం..
గురువారం నుంచి తగ్గనున్న వరద

(ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ప్రత్యేక ప్రతినిధి) : శ్రీశైలం ప్రాజెక్టులో జల విన్యాసం కనువిందు చేస్తోంది. కృష్ణా నది నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నుంచి ఎనిమిది గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి వరద పెరగడంతో ప్రాజెక్టు పది గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. బుధవారం సాయంత్రం కొద్దిగా వరద ప్రవాహం తగ్గడంతో రెండు గేట్లు మూసివేసి, ఎనిమిది గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 212.9 టీఎంసీల నీరు నిలువ ఉంచి, వచ్చిన నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.8 టీఎంసీలు ఉంది. మంగళవారం సాయంత్రం వరకు ప్రాజెక్టులో 209 టీఎంసీల నీరు నిలువ ఉంచారు. బుధవారం వరద ప్రవాహం తగ్గడంతో రెండు గేట్లు మూసి, నీటిని ప్రాజెక్టులో నిలువ ఉంచారు. వరద ప్రవాహం తగ్గుతుండటంతో ప్రాజెక్టులో నీటిని నిలువ ఉంచుతున్నారు. ప్రస్తుతం 212.9 టీఎంసీల నీటిని ప్రాజెక్టు అధికారులు నిలువ ఉంచారు. ఎగువ నుంచి 2.93 క్యూసెక్కుల వరద నీరు రావడంతో దిగువకు 2.84 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నీటితో ఉంచే అవకాశం ఉంది.

గురువారం శ్రీశైలం కు సీఎం చంద్రబాబు రాక :

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ప్రాజెక్టు సందర్శనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రానున్నారు. ముందుగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకొని జలహారతి ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిసరాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువ కావడం, సీఎం చంద్రబాబు రావడం మూలంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.