Kannappa Vishnu Team| శ్రీశైలం మల్లన్న సేవలో కన్నప్ప మంచు విష్ణు

విధాత : శ్రీకాళహస్తీశ్వరుడి భక్తుడు..కన్నప్ప సినిమా హీరో, నిర్మాత మంచు విష్ణు బుధవారం శ్రీశైలంమల్లన్నను దర్శించుకున్నారు. మంచు విష్ణు శ్రీస్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వదించగా, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ కన్నప్ప సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనంతో నా 12 జ్యోతిర్లింగాల యాత్ర పూర్తి చేసుకున్నానని తెలిపారు. శుక్రవారం 27వ తేదీన నేను నటించిన కన్నప్ప సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతుందని..ప్రజలందరూ కన్నప్ప సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానన్నారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. పరమ శివభక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా మంచు విష్ణు ఈ సినిమా కథను అందించడం విశేషం. ప్రముఖ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా తెరకెక్కించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తిన్నడు అలియాస్ కన్నప్పగా మంచు విష్ణు నటిస్తుండగా, రుద్ర పాత్రలో ప్రభాస్, కిరాత వేషంలో మోహన్‌లాల్, పరమశివుడిగా అక్షయ్‌కుమార్, పార్వతి దేవిగా కాజల్ అగర్వాల్, మహదేవ శాస్త్రిగా మోహన్‌బాబు కీలక పాత్రలు పోషించారు.
దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత కృష్ణంరాజు నటించిన ‘భక్త కన్నప్ప’ అనంతరం మళ్లీ కన్నప్ప కథ వెండితెరపైకి వస్తుండటంతో ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తుది రన్‌టైమ్ 3 గంటల 2 నిమిషాలుగా ఖరారైంది. సెన్సార్ బోర్డు సూచనలతో 12 కట్స్ చేశారు. బుధవారం నుంచి తెలుగులో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభంకానుంది.