ఏపీ రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3 రెండో దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. 21.77 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.1,519 కోట్లు ఖర్చు చేశారు. 60 మీటర్ల వెడల్పుతో 3 దశల్లో నిర్మిస్తున్న ఈ కారిడార్‌లో 9 లేన్ల రహదారి ఉంటుంది. ఇందులోభాగంగా బీఆర్‌టీఎస్ కారిడార్, సర్వీసు రోడ్లను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఇ-3 రోడ్డును విజయవాడ-మంగళగిరి హైవేతో అనుసంధానానికి బ్రిడ్జి నిర్మించారు.
సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జీల ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద శిలాఫలకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం స్టీల్ బ్రిడ్జిలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన రైతులు, స్థానికులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ నిర్మించాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని, శివరామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ వేయగా.. మెజారిటీ ప్రజలు అమరావతినే సూచించారని గుర్తు చేశారు.
రాజధాని లేకపోతే మనం ఏమీ చేయలేమని గ్రహించి నిర్మాణానికి సంకల్పించామని,మహానగరంగా భూముల సేకరణకు ల్యాండ్‌పూలింగ్ కాన్సెప్ట్ కు రైతులు ముందుకొచ్చి రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారని కొనియాడారు. ఒక్కమాట చెప్పగానే.. నన్ను నమ్మి భూములిచ్చేందుకు అన్నదాతలు ముందుకొచ్చారు అని, నోటిఫికేషన్ ఇచ్చిన 58 రోజుల్లోనే రైతుల నుంచి విశేష స్పందన వచ్చిందని గుర్తు చేశారు. 33వేల ఎకరాలు ఇచ్చేందుకు.. 29వేల మంది రైతులు ముందుకొచ్చారు. అమరావతి రైతాంగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, నాదెండ్ల మనోహర్, తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నేను కూడా గుంటూరు, విజయవాడలో ఒక 50 ఎకరాలు తీసుకుని కట్టొచ్చు..
కానీ, మహానగరం ఎప్పుడు అవుతుందని అమరావతి ఆలోచన వచ్చింది- @ncbn pic.twitter.com/Kul6ukZz4z
— greatandhra (@greatandhranews) August 13, 2026
