Oil Palm AP | పామ్ ఆయిల్‌పై సుంకం తగ్గింపుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక అప్ డేట్

Oil Palm AP | పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలో చూడాలని..వీలైనంత మెరుగైన మద్దతు ధర అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరతో పాటు వివిధ అంశాలపై సచివాలయంలో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పండించిన పంటకు సరైన ధర దక్కాలంటే.. ఆ పంటకు మార్కెట్‌లో ఎలాంటి డిమాండ్ ఉందనే సమాచారం రైతులకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
పామ్ ఆయిల్‌పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడానని చంద్రబాబు స్పష్టం చేశారు. మామిడికి కిలోకు 4 రూపాయల చొప్పున అదనంగా మద్దతు ధర ఇస్తున్నామని.. ప్రాసెసింగ్ యూనిట్లు 8 రూపాయలకి తగ్గకుండా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచాలని.. మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డీ బర్లి పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. కాగా 33 మిలియన్ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు. మరో 20 మిలియన్ కేజీల పొగాకును ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.