అమరావతి : ఏపీ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ఎక్స్‌లో చేసిన పోస్టు వీడియో వైరల్ గా మారింది. ‘ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా..?’ అంటూ లోకేశ్ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. ‘Guess who’s coming to AP?’ అంటూ వీడియోను పోస్ట్ చేసిన లోకేశ్.. అందులో టక్ వేసుకుని, కళ్లజోడు పెట్టుకుని.. న్యూ లుక్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్(బుల్లెట్) డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నట్లు కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
వీడియోలో మంత్రి లోకేశ్ లుక్‌ను పరిశీలించిన నెటిజన్లు ఏపీకి ఎవరు వస్తున్నారో పసిగట్టేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌కు రాబోతున్నట్లు అర్థం చేసుకున్నారు. ఈ క్రమంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఏపీకి రాబోతోందంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్..
బుల్లెట్ బండి డగ్ డగ్ మంటూ ఏపీకి రాబోతుంది. తిరుపతిలో రూ.2,508 కోట్ల పెట్టుబడితో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ బుల్లెట్ మోటార్‌సైకిళ్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) బుధవారం అమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్‌ఐపీబీ) సమావేశంలో భారీగా పెట్టుబడులకు ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు విశాఖపట్నంలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్ల పెట్టుబడితో డేటాసెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇంకా.. శ్రీసత్యసాయి జిల్లాలో రూ.51వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను ఆ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడప జిల్లాలో రూ.12వేల కోట్ల పెట్టుబడితో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. పలు సంస్థలకు చెందిన రూ.2,00,964.10 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) బుధవారం ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 38,722 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థలు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి :
దిగొచ్చిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి గ్రీన్ సిగ్నల్
తమిళనాడులో మారుతున్న పరిణామాలు..మరోసారి గవర్నర్ వద్దకు విజయ్
