ఒంటిమిట్టలో 600 అడుగుల శ్రీ రాముడి భారీ విగ్రహం

ఒంటిమిట్టలో 600 అడుగుల శ్రీరాముడి విగ్రహం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా అభివృద్ధి.

విధాత: ఏపీ ప్రభుత్వం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఒంటిమిట్ట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయం చెరువు మధ్యలో భక్తులను ఆకట్టుకునే రీతిలో 600అడుగులు భారీ శ్రీ రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు టీటీడీ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను అందజేశారు. ఒంటిమిట్టలను ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్దం చేస్తుంది.

రాష్ట్ర విభజనానంతరం ప్రముఖ శ్రీరామ పుణ్యక్షేత్రం భద్రాచలం తెలంగాణ పరిధిలో ఉండిపోవడంతో ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఒంటిమిట్టలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ఆలయ నిర్వహణను ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు అప్పగించింది. అప్పటి నుంచి ఆలయ నిర్వహణతో పాటు సీతారామ కల్యాణ వేడుకలను టీటీడీనే నిర్వహిస్తూ వస్తోంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు.

ఒంటిమిట్ట ఆలయ ప్రశస్తి

ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ప్రాచీనమైన హిందూ దేవాలయం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఒంటిమిట్ట ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే శిలలో దర్శనమిస్తారు. ఈ కారణంగా ఈ ప్రాంతాన్ని ఏకశిలానగరమని కూడా పిలుస్తారు. భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటిగా గుర్తింపు పొందింది. చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుత శిల్పకళతో గోపురం ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణాన్ని చోళులు ప్రారంభించగా..విజయనగర రాజులు పూర్తి చేశారు. అందుకే ఇక్కడ చోళ, విజయనగర వాస్తుశైలితో ఆలయ నిర్మాణం..శిల్పాలు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది.

ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణుల పక్కన హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది. కానీ, ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం ఉండదు. ఎందుకంటే అప్పటికి రాములవారికి ఆంజనేయస్వామి పరిచయం కాలేదు కాబట్టి ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం ఉండదని చెబుతారు.

ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజున తెలంగాణ భద్రాచలంతో సహా అన్ని రామాలయాల్లో మధ్యాహ్నం పూట, అభిజిత్ ముహూర్తంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తుంటారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో మాత్రం శ్రీరామ నవమి పర్వదినాన కాకుండా నాలుగైదు రోజులు (తిథుల ప్రకారం) ఆలస్యంగా చతుర్దశి పౌర్ణమి రోజున కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అది కూడా సంధ్యకాలంలో, వెన్నెల వెలుగుల్లో కల్యాణం నిర్వహిస్తారు.