Balakrishna Vs Jagan | జగన్ ఒక సైకో: బాలకృష్ణ
బాలకృష్ణ అసెంబ్లీ వేదికపై జగన్ పై సంచలన వ్యాఖ్యలు: "జగన్ ఒక సైకో", సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం.

అమరావతి : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సైకో అని అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ల వివాదం సమయంలో అప్పటి సైకో సీఎం జగన్ ను కలిసినప్పుడు చిరంజీవి గట్టిగా మాట్లాడారని వస్తున్న వార్తలు అవాస్తవం అని చెప్పారు. చిరంజీవి గట్టిగా అడగడం వల్లే జగన్ దిగివచ్చారనడం అబద్ధమని స్పష్టం చేశారు.
అంతకుముందు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శాంతిభద్రతల సమస్యలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ సమస్యలు, టికెట్ల రేట్ల వివాదంపై వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ ను చిరంజీవి, ప్రభాస్ వంటి పెద్దలంతా వెళ్లి కలిస్తే ఆయన అవమానించారన్నారు. ఇప్పడు కలవడం కుదరదని చెప్పించారని.. సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమని చెప్పారన్నారు. దీంతో చిరంజీవి గట్టిగా మాట్లాడితే జగన్ వచ్చి కలిశారని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై బాలకృష్ణ సీరియస్ గా స్పందించారు. చిరంజీవి సహా అప్పుడు ఎవరు గట్టిగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ వచ్చి కలిశారని..అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పడం అంతా అవాస్తవమన్నారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఆహ్వానించిన సినీ పరిశ్రమ పెద్దల సమావేశానికి తన పేరు తొమ్మిదోదిగా ఉంచడంపై కూడా బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. నా పేరు 9వ ప్లేస్ లో వేసిందెవరని మంత్రి కందులను అడిగానన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.