NRI lands Encroached | ఎన్‌ఆర్‌ఐల భూములు భద్రమేనా? వారికి భరోసా ఇచ్చేదెవరు? 

వాళ్లు విదేశాల్లో ఉంటారు. భూములు ఇక్కడ కొంటారు. కానీ.. అవి ఖాళీగా ఉండటం చూసి కొందరు అక్రమణదారులు వాటిని కబ్జా చేస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఎన్నారైలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ భూములకు భరోసా ఇచ్చేవారెవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

NRI lands Encroached | ఎన్‌ఆర్‌ఐల భూములు భద్రమేనా? వారికి భరోసా ఇచ్చేదెవరు? 

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 (విధాత):

NRI lands Encroached | హైదరాబాద్‌లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయడానికి ఆక్రమణదారులు సిద్ధంగా ఉంటారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కీసర మండలం రాంపల్లిలో ఎన్ఆర్ఐ రజితా రెడ్డి భూ వివాద అంశం తెరమీదికి రావడం ఇలాంటి ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎన్ఆర్ఐలపై ఎఫ్ఐఆర్‌ నమోదౌతున్న ఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని అంటున్నారు. చట్టాల్లో ఉన్న లొసుగులు, రాజకీయ అండ ఉండటంతో అధికారులు కూడా అక్రమార్కులకే వంత పాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ఆర్ఐలు అంతగా ఆసక్తిని చూపరు. ఎన్ఆర్ఐలు కొనుగోలు చేసిన ఆస్తులకు రక్షణ ఉంటుందనే భరోసా ఇవ్వగలిగితే పెట్టుబడులు ప్రోత్సాహకరంగా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గతంలో కూడా ఇలాంటి ఆరోపణలే

హైదరాబాద్‌లో గతంలో కూడా ఎన్ఆర్ఐలు కొనుగోలు చేసిన భూములు ఆక్రమణలకు గురయ్యాయనే ఆరోపణలున్నాయి. హయత్ నగర్‌కు సమీపంలోని కుంట్లూరు గ్రామ శివారులోని ఒక ఓపెన్‌ ప్లాట్‌ను ఒక ఎన్ఆర్ఐ కుటుంబం కొనుగోలు చేసింది. ఈ భూమిని కొందరు కబ్జా చేశారు. విషయం తెలిసిన ఎన్ఆర్ఐ కుటుంబం అక్రమార్కుల చెర నుంచి తమ భూమిని కాపాడుకొనే ప్రయత్నం చేసింది. అమెరికాలో ఉంటున్న ఆ కుటుంబం ఇదే తమ పనులను వదులుకొని ఈ ప్లాట్ కోసమే ఇండియాకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ భూమిని ఎంతో కొంతకు విక్రయించేందుకు సిద్దమయ్యారని తెలిసింది. ఇదే తరహాలో పెద్ద అంబర్ పేటలో కూడా ఘటన చోటు చేసుకుంది. ఎన్ఆర్ఐ తన భూమిని కాపాడుకోవడానికి ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. చాలా సందర్భాల్లో ఎన్నారైలను బెదిరించి, ఎంతో కొంత ముట్టచెప్పి పంపించేస్తున్నారని తెలుస్తున్నది. దీంతో చాలా ఘటనలు వెలుగు చూడటం లేదు. బయటకు వచ్చిన ఘటనలు మాత్రం అరుదు.

భూముల కబ్జాలను ఆపకపోతే నష్టమా?

ఎన్ఆర్ఐలు కొనుగోలు చేసిన భూములకు రక్షణ కల్పించకపోతే అది భవిష్యత్తులో ఇబ్బందులకు కారణమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎన్ఆర్ఐలు కొనుగోలు చేసిన భూములకు రక్షణ ఉండదనే పరిస్థితి ఏర్పడితే భూములపై పెట్టుబడి పెట్టేందుకు ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అది పరోక్షంగా ఎంతో కొంత మన దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అసలు యజమాని ఎవరో నకిలీ యజమాని ఎవరో తేల్చాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కపెట్టడం పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. క్షేత్రస్థాయి అధికారుల స్థాయిలోనే ఇలాంటి ఘటనలకు బ్రేక్ పడాలని, అప్పుడే కబ్జాకోరులు ఇలాంటి ఘటనలకు దూరంగా ఉంటారని రిటైర్డ్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.. ఒకటి తర్వాత ఒకటి ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తే అది పరిస్థితి తీవ్రతను తెలుపుతుంది.

చట్టాల్లోని లొసుగులు అక్రమార్కులకు కలిసి వస్తున్నాయా?

వ్యవసాయ భూమి లేదా ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేసి చాలా కాలం వరకు అటు వైపు వెళ్లకపోతే ఆ భూమిపై కబ్జాకోరుల కన్ను పడుతుతున్నది. ఆ భూమిని దక్కించుకొనేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఆ భూమి యజమానికి అంగ బలం, రాజకీయ పలుకుబడి, అధికారులతో పరిచయాలు ఉంటే ఈ సమస్య నుంచి కొంత సులువుగా బయటకు రావచ్చు. ఎలాంటి పలుకుబడి లేని వాళ్లైతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముందుగా ఖాళీ స్థలంలో ప్రహారీగోడ నిర్మిస్తున్న ఆక్రమణదారులు తదుపరి ఫోర్జరీ పత్రాలు సృష్టించి అసలు యజమానులకు ఇబ్బందులు సృష్టిస్తారు. ఇక రాజకీయ అండ ఉంటే ఇక తిరుగే ఉండదు. అధికారులు కూడా వారికే అండగా నిలుస్తారనే ఆరోపణలు లేకపోలేదు. అసలు యజమానికి ఎవరో తేల్చాల్సిన అధికారులు రాజకీయ జోక్యం కారణంతోనో ఇతరత్రా కారణాలతో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. వెంచర్లలో కూడా ఇదే తరహా ఘటనలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఒక వెంచర్ చేసిన స్థలం తనదని ముందుకు వస్తే ఆ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా చందాలు పోగు చేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఉదంతాలు కూడా లేకపోలేదు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే హైడ్రా చర్యలు తీసుకుంటుంది. ఖాళీ స్థలం లేదా ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసిన భూములు ఆక్రమణలకు పాల్పడేవారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, అక్రమార్కులు ఉపయోగించుకుంటున్న లొసుగులను గుర్తించి అవసరమైన చట్ట సవరణలు చేయాలని ప్రజలు, బాధితులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Land Grabbers Rampalli Village | ఎన్ఆర్ఐ మ‌హిళకు చెందిన భూమి.. దర్జాగా క‌బ్జా! మంత్రి అండతోనే?
Kavitha Fires On Hydra Demolition | పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా? : హైడ్రాపై కవిత మండిపాటు
HYDRA Land Protection| రూ.15వేల కోట్ల భూములను పరిరక్షించిన హైడ్రా