Telangana land disputes | తెలంగాణ భూ సమస్యల పరిష్కారానికి అదే కీలకం..
దశాబ్దాలుగా తెలంగాణ రైతులను వేధిస్తున్న భూమి సమస్యల పరిష్కారానికి సమగ్ర భూ సర్వే ఒక్కటే మార్గమని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. సమగ్ర సర్వేతో ప్రస్తుతం ఉన్న సమస్యల్లో 90 శాతం వరకూ పరిష్కారం అయిపోతాయని తేల్చి చెబుతున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Telangana land disputes | హైదరాబాద్, జూలై 29 (విధాత): ప్రభుత్వాలు వస్తున్నాయి.. పోతున్నాయి.. కానీ.. తెలంగాణ రైతుల (Telangana farmers) భూమి వివాదాలకు (land disputes) మాత్రం ఒక సమగ్ర పరిష్కారం లభించడం లేదు. ప్రభుత్వాధినేతలు భూమి సమస్యలను పరిష్కరిస్తామని (solution) హామీలు ఇస్తున్నారు కానీ.. క్షేత్రస్థాయిలో అందుకు అవసరమైన నిర్ణయాలు, ఏర్పాట్లు చేయడం లేదని రెవెన్యూ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. సమస్య ఎక్కడ ఉన్నది? దానిని పరిష్కరించడం ఎలా? అనే దిశలో ఆలోచించకుండా.. పాలకులు ఆదేశాలు ఇస్తే.. అధికారులు ఆఫీసులో కూర్చొని కాగితాలు అటూ ఇటూ మార్చడంతోనే సరిపెడుతున్నారని, దీనితో సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ఒక రైతు అసహనం వ్యక్తం చేశారు. భూమి సమగ్ర సర్వే చేయకుండా కాగితాలు ప్రక్షాళన చేస్తే సమస్య ఎలా పరిష్కారం అవుతుందని సదరు రైతు ప్రశ్నించారు. అయితే.. భూమి సమస్య భూమి వద్దకు వెళితేనే పరిష్కారమవుతుందని ఒక న్యాయవాది స్పష్టం చేశారు (explained). తెలంగాణలో అన్నిరకాల భూముల సమస్యలు క్రోడీకరిస్తే.. 42 క్యాటగిరీలుగా ఉంటాయని, వాటిని సమగ్ర సర్వేతోనే (comprehensive land survey) పరిష్కరించడానికి వీలుంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఈ దిశగా ప్రయత్నాలు సాగాలని ఆయన అన్నారు.
రికార్డుల ప్రక్షాళనతో సరి
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తరువాత సీఎం పదవిని చేపట్టిన కేసీఆర్.. ఉమ్మడి రాష్ట్రం నుంచి నలుగుతున్న భూమి సమస్యలన్నింటినీ వంద రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పి 2017 ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 31 వరకు షెడ్యూల్ ప్రకటించారు. ఈ వంద రోజుల్లో భూమి రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. తరువాత 2020 సెప్టెంబర్ 11 నుంచి ధరణి చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. అవినీతి వీరే కారణమంటూ నాటి క్షేత్రస్థాయిలో పనిచేసిన వీఆర్వోల వ్యవస్థనే రద్దు చేశారు. ఇంతజేసీ.. భూమి సమస్యల మాత్రం పరిష్కారం కాలేదని, పైగా కొత్త సమస్యలు వచ్చాయని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. దానికితోడు సమస్య పరిష్కరించే అధికారాలను తాసిల్దార్లు, ఆర్డీవోల నుంచి తీసేయడంతో రైతుల పరిస్థితి ఆనాడు ఘోరంగా తయారైందని వారు గుర్తు చేస్తున్నారు.
కేంద్ర పథకాన్ని వాడుకోలేదు
భూమి రికార్డులను డిజిటలైజ్ చేయాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు నిధులను కూడా విడుదల చేసింది. ఆ నిధులను వెచ్చించి రికార్డులు డిజిటైజ్ చేసి ఉంటే.. సమస్యలన్నీ అప్పుడే పరిష్కారమై ఉండేవి. ఎవరు ఏ భూమిపై పొజిషన్‌లో ఉన్నారో గుర్తించి, రికార్డులను సరి చేస్తే తెలంగాణ యావత్ భూమికి సమగ్ర రికార్డు ఉండేది. ఇందుకోసం ఆనాడు సుదీర్ఘ కాలం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బీఆర్ మీనా, 7 నెలల కాలం సీసీఎల్ఏగా ఉన్న రేమండ్ పీటర్ వివిధ రాష్ట్రాలలో, దేశాలలో సర్వే జరిగిన తీరును అధ్యయనం చేశారు. సర్వేతో ప్రయోజనాలను వివరించి, కేసీఆర్‌ను ఒప్పించే ప్రయత్నాలు కూడా చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ.. ఏమైందో ఏమోగానీ.. నాటి కేసీఆర్ సర్కార్ ఆ అంశాన్ని పక్కకు పెట్టేసింది. దీర్ఘకాలిక కసరత్తులతో కంటే ఇన్‌స్టంట్‌గా పేరు రావాలని భావించి.. రికార్డుల ప్రక్షాళనకే పరిమితం కావడంతో అది కాస్తా బూమరాంగ్ అయింది. ఈ పరిస్థితిని సావకాశంగా చేసుకున్న నాటి ప్రతిపక్ష కాంగ్రెస్.. ధరణి సమస్యలపై ప్రత్యేక ఎజెండాతో పనిచేసింది. తాము అధికారంలోకి వస్తే.. ధరణిని బంగాళాఖాతంలో పడేసి.. కొత్త చట్టం తీసుకొస్తామని ప్రకటించింది. ఇది కూడా ఆ పార్టీ పట్ల సానుకూలతను కల్పించి.. గత ఎన్నికల్లో విజయం సాధించేందుకు దోహదం చేసింది.
రేవంత్ సర్కారుదీ నాన్చుడు ధోరణే?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా భూ సమస్య పరిష్కారానికి ఆసక్తిగా లేదన్న చర్చలు కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వినిపిస్తున్నాయి. ధరణి స్థానంలో భూభారతిని తీసుకొచ్చి మమ అనిపించారని, చట్టం గట్టిగానే ఉన్నా.. అమలులో పాత ధరణిలానే తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నింటికి మించి సమగ్ర భూ సర్వేకు రేవంత్ సర్కారు కూడా వెనుకాడటంపై సర్వత్రా సందేహాలు వెలువడుతున్నాయి. ‘రాచకురుపు మానాలంటే మందులు వేయాలి. కానీ.. పైపై పూత మందులతో సరిపెడితే.. లోపలంతా కుళ్లిపోయి.. పరిస్థితి చేయి దాటి పోతుంది. రేవంత్ రెడ్డి సర్కారు తీరు కూడా అలానే ఉన్నది’ అని న్యాయ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు.
నిజాం హయాం తర్వాత సమగ్ర సర్వే లేదు
తెలంగాణలో భూమి సమగ్ర సర్వే నిజాం కాలంలో జరిగింది. వాస్తవంగా భూమి సమగ్ర సర్వే ప్రతి 30 ఏళ్లకు ఒకసారి చేయాలి. కానీ హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం అయిన తరువాత ఒక్కసారి కూడా సమగ్ర సర్వే చేపట్టలేదు. ఒక్క కమతం.. పంపకాలతో అనేక కమతాలుగా చీలిపోయి ఉన్నది. రికార్డులు సరిగ్గా లేవు. తాజాగా పొజిషన్‌లో ఎవరున్నారు.. ఎంత భూమిలో ఉన్నారు? ఒక్కో సర్వే నంబర్‌లో వాస్తవంగా ఉన్న భూమి ఎంత? రికార్డులో ఉన్నదెంత? ఇలా అనేక వివరాలు సమగ్ర సర్వేతోనే వెలుగులోకి వస్తాయి. పైగా ఆనాడు మాన్యువల్‌గా భూమిని కొలిచారు. నేడు డిజిటల్ పద్ధతిలో కొలవడానికి కావాల్సిన టెక్నాలజీ అందుబాటులో ఉన్నది. అయినా.. ప్రభుత్వాలు సమగ్ర సర్వేకు ఎందుకు ముందుకు రావడం లేదన్న సంశయాన్ని యావత్ రైతాంగం వ్యక్తం చేస్తున్నది.
సమగ్ర సర్వేతో 90 శాతం సమస్యల పరిష్కారం
భూమి సమగ్ర సర్వే చేస్తే 90 శాతం భూమి సమస్యలు పరిష్కారం అవుతాయని పదవీ విరమణ చేసిన సర్వే సెటిల్‌మెంట్ అధికారి ఒకరు అన్నారు. సమగ్ర సర్వేతో అనేకమంది భూ కబ్జాల వ్యవహారం బయట పడుతుందనే వెనుకాడుతున్నారా? అన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి సర్వే జరిగితే రెవెన్యూ శాఖ లంచాలకు పుల్‌స్టాప్ పడుతుందని సదరు రిటైర్డ్ అధికారి అభిప్రాయపడ్డారు. మరోవైపు అవసరమైన వారికి సర్వే చేయడానికి లైసెన్డ్స్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకు వస్తున్నారని, ఇది మంచిదే కానీ వీరికి నిత్యం ఉపాధి కలిగేలా చూడాలన్నారు. లేదంటే వేరే మార్గం చూసుకొని మరో వృత్తికి వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లైసెన్డ్స్ సర్వేయర్ల వ్యవస్థ ఉందని కానీ దీనిని మన రెవెన్యూ వ్యవస్థనే బతకనీయలేదని విమర్శించారు. కర్ణాటకలో లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. కంప్యూటర్‌లో భూ యజమాని దరఖాస్తు చేసుకోగానే.. ఆటోమెటిక్‌గా ఒక లైసెన్డ్స్ సర్వేయర్‌కు అది అలాట్ అవుతుంది. ఆయన వచ్చి సర్వే చేస్తారు. ఇలాగైతేనే ఈ వ్యవస్థ బతుకుందని, లేకుంటే గతంలో మాదిరిగా ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. దానికి కూడా ముందుగా భూ సమగ్ర సర్వే అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. సర్వేయర్లు.. దరఖాస్తు చేసుకున్నవారి భూములు మాత్రమే సర్వే చేసే అవకాశం ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ముందుగా సమగ్ర సర్వే చేసిన తర్వాత ఈ వ్యవస్థ ఉపకరిస్తుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Bhu Bharathi | భూమి సమస్యా? మంత్రిగారు చెప్పాలె! తప్పించుకుంటున్న జిల్లాల కలెక్టర్లు.. 30% కమీషన్‌పై రంగంలోకి బ్రోకర్లు!
Bhu Bharati | తెలంగాణలో భూమి చట్టాలు ఘనం.. అమలు శూన్యం!
Bhu Bharati: భూ భారతి..10లక్షలకు పైగా భూ సమస్యల దరఖాస్తులు