sriSIIM Baba | “బేబీ..ఐ లవ్ యు..”, దిల్లీలో విద్యార్థినులపై స్వామి చైతన్యానంద సరస్వతి లైంగిక వేధింపులు
SRISIIM డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతిపై 17 మంది విద్యార్థినులు లైంగిక వేధింపుల కేసు. ఢిల్లీలో సంచలనం. వేధింపులు, బెదిరింపులతో అమ్మాయిల జీవితాలు దుర్భరం. 16 ఏళ్లుగా నిరాటంకంగా జరుగుతున్న దారుణాలు. పరారీలో ఉన్న స్వామీజీ. పోలీసుల వెతుకులాట

- శ్రీ శారదా ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్
- విద్యార్థినులపై హేయమైన వేధింపులు
- మూకుమ్మడిగా పోలీసు ఫిర్యాదులు, పరారీలో స్వామిజీ
- SRISIIM – శృంగేరీ శారదాపీఠానికి అనుబంధ విద్యాసంస్థ
sriSIIM Baba | ఢిల్లీలోని ప్రముఖ విద్యా–ఆధ్యాత్మిక సంస్థలో చోటుచేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి (అసలు పేరు పార్థసారథి, ఒడిశా)పై లైంగిక వేధింపులు, బలవంతం, బెదిరింపులు వంటి ఘోరమైన ఆరోపణలు నమోదయ్యాయి. గతనెలలో 17 మంది విద్యార్థినులు, సిబ్బంది కలసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. దాంతో కేసు తీవ్రత మరింత పెరిగింది. ఈ విద్యాసంస్థ శృంగేరి శారదా పీఠానికి అనుబంధంగా కొనసాగుతోంది. దాంతో ఈ మచ్చ మఠానికి కూడా పాకింది.
బాబా పేరుతో వికృత చేష్టలు – విద్యార్థినులకు అసభ్య సందేశాలు పంపిన వైనం
పోలీసులు సేకరించిన సాక్ష్యాలు భయంకరమైన వాస్తవాలను బయటపెట్టాయి. వాట్సాప్‌లో విద్యార్థినులకు “Baby, I love you, I adore you” అంటూ మెసేజ్‌లు పంపడం, వారి శారీరక సౌందర్యంపై అసభ్యంగా వ్యాఖ్యలు చేయడం వెలుగులోకి వచ్చాయి. 2024లో ఒక విద్యార్థిని హాస్టల్‌లో గాయపడినప్పుడు ఆమె ఎక్స్‌రే రిపోర్ట్‌ను తన వ్యక్తిగత ఫోన్‌కి పంపాలని బలవంతం చేసి, ఆ తర్వాత నుంచి నిరంతరంగా అసభ్య సందేశాలు పంపడం మొదలుపెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రతిస్పందన ఇవ్వకపోతే మార్కులు తగ్గిస్తానని, పరీక్షలకు కూర్చోనివ్వనని కూడా బెదిరించాడని విద్యార్థినులు వాంగ్మూలం ఇచ్చారు. 2025 హోలీ వేడుకల్లో విద్యార్థినులను లైన్లో నిలబెట్టి తనపై రంగులు చల్లించుకోవడం, అనంతరం గదిలోకి పిలిచి వీడియోలు తీయడం, రిషికేశ్ ట్రిప్ సమయంలో రాత్రివేళల్లో పిలిచి లైంగికంగా వేధించడం హేయమైన ఆరోపణలు బయటపడ్డాయి. ఈ బాబా నేరాలు కేవలం వేధింపుల వరకే పరిమితం కాలేదు, ప్రతిఘటించిన అమ్మాయిల భవిష్యత్తును నాశనం చేసే స్థాయికి చేరాయి.
గతంలో కూడా స్వామి గ్రంథసాంగుడే – ఈసారి మాత్రం మూడింది
2009, 2016లో కూడా ఈ స్వామి చైతన్యానంద సరస్వతి ఇలాంటి కేసులు ఎదుర్కొన్నప్పటికీ, తన పలుకుబడి, సంబంధాలను ఉపయోగించి బయటపడినట్టు తెలుస్తోంది. ఈసారి మాత్రం విద్యార్థినులు, సిబ్బంది కలసి ఫిర్యాదు చేయడంతో ఎవరూ తలదూర్చలేకపోయారు. స్వామి ఇరుక్కోక తప్పింది కాదు. ప్రస్తుతం పరారీలో ఉన్న స్వామిజీ గురించి పోలీసులు ఢిల్లీ, హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో తీవ్రంగా గాలిస్తున్నారు. దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీస్ జారీ చేశారు. అయినప్పటికీ తన ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. శృంగేరీ శారదాపీఠం వెంటనే స్వామీజీతో ఉన్న సంబంధాలను తెంచుకుని, అతనికిచ్చిన పవర్ ఆప్ అటార్నీని రద్దు చేసింది. గత 16ఏళ్లుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ హేయమైన క్రీడ ఇప్పటిదాకా బయటపడకపోవడం పెను విషాదం. ఎంతమంది అమ్మాయిల జీవితాలిలా నాశనమయ్యాయో ఇంకా తెలియదు. ఒక వాయుసేన అధికారం ఈమెయిల్ ద్వారా ఈ స్వామీజీ బాగోతం బయటపడటంతో ఇంకా 32 మంది బాధితులు ఫిర్యాదుకు ముందుకు వచ్చారు.
ఆధ్యాత్మిక ముసుగులో నేరాలు, ఘోరాలు ఈ దేశంలో కొత్తేం కాదు. ఈ దొంగస్వాములు,బాబాలకు రాజకీయ అండ కొండంత ఉంటుంది. లేకపోతే ఎవరూ ఇంతకాలం బతికి బట్టకట్టలేరు. ఇవన్నీ గతంలో నిరూపించబడ్డవే. ప్రజలు మూఢనమ్మకాలు వదిలేయనంతకాలం ఇలాంటి ఘోరాలు తప్పవు.