బాలకృష్ణకు మార్గాని భరత్.. జూపూడిల స్ట్రాంగ్ వార్నింగ్
బాలకృష్ణ వ్యాఖ్యలపై మార్గాని భరత్, జూపూడి ప్రభాకర్ స్ట్రాంగ్ వార్నింగ్. అసెంబ్లీలో పూర్వ సీఎం జగన్‌పై పరుష పదజాలం వివాదం రేపింది.

అమరావతి : అసెంబ్లీలో మాజీ సీఎం వైఎస్.జగన్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడిన పరుష పదజాలం పట్ల వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో బాలకృష్ణ ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని..అహంకార పూరితంగా వ్యవహారించిన విధానం చట్టసభల ప్రతినిధుల స్థాయిని తగ్గించేదిగా ఉందన్నారు. బాలకృష్ణ సినిమా ఫంక్షన్లకు తాగి వెళ్లినట్లుగా అసెంబ్లీకి వచ్చినట్లుగా ఉందని..అసెంబ్లీలోకి అనుమతించే ముందు ఆయనకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలని భరత్ ఎద్దేవా చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో ఇలా మాట్లాడి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారు? అని ప్రశ్నించారు. మీ పార్టీలో ఏదైనా సమస్య ఉంటే మీ బావకో.. అల్లుడికో చెప్పుకోవాలని..అంతేగాని అసెంబ్లీలో తన పేరు తొమ్మిదవదిగా వేశారంటూ అసహనం వెళ్లగక్కడం ఎందుకని భరత్ ప్రశ్నించారు. మీ స్థాయి ఏమిటో మీ ప్రభుత్వ భాగస్వామి పార్టీ జనసేన చూపించిందంటూ సెటైర్లు వేశారు. బాలకృష్ణ మానసిక స్థాయిపై అనుమానం ఉందన్నారు.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ స్పందిస్తూ.. బాలకృష్ణని మించిన సైకో మరొకరు లేరని.. బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపిన కేసులో మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న సంగతి బాలకృష్ణ మరిచిపోరాదన్నారు. అలాంటి మెంటల్ వ్యక్తి బాలకృష్ణ మాజీ సీఎం జగన్‌ని సైకో అంటారా? అని మండిపడ్డారు. సైకో అనే పదం బాలకృష్ణకే కరెక్టుగా సరిపోతుందన్నారు. జనంలోకి వస్తే సైకోలాగ ప్రవర్తించేదెవరో జనానికి బాగా తెలుసని..బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మనసులో ఏదో బాధ పడుతున్నట్లుగా ఉందని..చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌కి ఇచ్చే ప్రాధాన్యత తనకు ఇవ్వటం లేదన్న బాధ ఆయనలో కనపడుతుందన్నారు. చిరంజీవి, పవన్, బాలకృష్ణ మధ్య ఏవైనా గొడవలు ఉండవచ్చు. ఆ గొడవల మధ్యకు జగన్‌ని ఎందుకు తెస్తున్నారని జూపూడి ఆక్షేపించారు.