ప్రకాశం, మార్కాపురం నెల్లూరు, కడప జిల్లా వాసుల తలరాతలు మార్చే భాగ్య విధాత వెలిగొండ తాగు, సాగు నీటి ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం మార్కాపురం జిల్లాలో పర్యటించిన ఆయన వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్‌కెనాల్ పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులు, నిర్వాసితులతో మాట్లాడారు. కరువు ప్రాంతం మార్కాపురం ప్రాంతానికి కృష్ణా నీళ్లిచ్చేందుకు ఎన్టీఆర్ 1985లోనే ఆలోచన చేసి..ఓ కమిటీని వేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, 1996లో వెలిగొండకు శంకుస్థాపన చేశామని, ప్రాజెక్టుకు ప్రస్తుత లెక్కల ప్రకారం రూ. 10,580 కోట్లు ఖర్చు అవుతుందని, ఇప్పటి వరకు రూ. 6,736 కోట్లు ఖర్చు చేశాం అని వెల్లడించారు. ఇంకా రూ.3,844 కోట్లు ఖర్చు పెట్టాలని, 2024లో ప్రభుత్వం వచ్చాక రూ.759 కోట్లు ఖర్చు చేశాం, నిర్వాసితుల కోసం రూ.905 కోట్లు మంజూరు చేసి..ఇవాళ 2,351 మంది నిర్వాసితులకురూ.300 కోట్లు విడుదల చేస్తున్నాం అని తెలిపారు. రెండు రోజుల్లో నిర్వాసితుల ఖాతాల్లో ఆర్ అండ్ ఆర్ డబ్బులు జమ అవుతాయి అన్నారు. మంత్రి నిమ్మల వెలిగొండ ప్రాజెక్టు వద్దే ఉంటారు.. టన్నెల్లోకి రోజు వెళ్తున్నారు.. పుట్టిన రోజు కూడా ఇక్కడే జరుపుకున్నారని గుర్తు చేశారు. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం, ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన రైతులు, నిర్వాసితుల జీవితాలు మెరుగ్గా ఉంటాయి అని స్పష్టం చేశారు.
నిర్వాసితుల త్యాగాలతోనే ప్రాజెక్టుల కల సాకారం
నిర్వాసితుల త్యాగం వల్ల వెలిగొండ ప్రాజెక్ట సాకారం అవుతుందని, 4.47 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని, 23 లక్షల మందికి తాగునీరు లభిస్తుందని చంద్రబాబు తెలిపారు జూలై 31 నాటికి వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 నీళ్లను త్వరితగతిన ఇస్తాం.ఫేజ్-1 కింద 1.19 లక్షల ఎకరాలకు నీళ్లు, 4 లక్షల మందికి తాగునీరు అందిస్తాం. ఫేజ్-2 కింద 3.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 11.25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ఓ చరిత్రగా నిలుస్తుందన్నారు. కలనూతల, సుంకేశుల, చింతలముడిపి, బుడుంచెర్ల, కాటంరాజు తండా, సాయిరాం నగర్, మెట్టి గొంది, బసవాయిపల్లి, లక్ష్మీపురం, అక్కచెరువు, గొట్టిపాడు గ్రామాల నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ నిధులు ఇస్తున్నాం, కలెక్టరేట్ పక్కన కొన్ని గ్రామాలకు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నాం అని తెలిపారు. కొత్త జిల్లా ఏర్పాటు చేయడంతోపాటు.. నిర్వాసితుల కాలనీలో కలెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నాం అని నిర్వాసితుల కాలనీల్లో మౌళిక సదుపాయాలు పూర్తి చేస్తాం అని తెలిపారు.
మా హయాంలోనే వెలిగొండ పనులు వేగవంతం
2014-19 మధ్య కాలంలోనే సొరంగాల పనులు చాలా వరకు పూర్తి చేశాం.వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో 7,225 మంది నిర్వాసితులు ఉన్నారు… ప్రతి ఒక్కరి వెనుకా ఓ విషాద గాధ ఉంటుందని, పుట్టిన ఊరు నుంచి వెళ్లిపోవాలంటే చాలా బాధేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంత మంది నిర్వాసితులుంటే గత ప్రభుత్వం కేవలం 96 మందికి మాత్రమే పునరావాసం ఇచ్చిందని, నిర్వాసితుల గోడు వెళ్లబోసుకోవాలని వస్తే కేసులు పెట్టించారని విమర్శించారు. కానీ మాది ప్రజా ప్రభుత్వం.. ఏ ఒక్కరూ నష్టపోకుండా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం.. ఇది నా గ్యారెంటీ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు లబ్దిదారులతోపాటు.. నిర్వాసితులు కూడా ఆనందంగా ఉండేలా చూడడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని, హైదరాబాద్ నగరంలో తెచ్చిన ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులు కోట్లాది రూపాయలు గడించారన్నారు. అభివృద్ధి చేస్తేనే ఆదాయం వస్తుంది.. వెలిగొండ ప్రాజెక్టు వల్ల నాలుగు జిల్లాల పరిధిలో భూముల ధరలు పెరుగుతాయని, గత ప్రభుత్వం పెట్టిన రూ.140 కోట్ల పెండింగ్ బిల్లులను కూడా చెల్లించాం అన్నారు.
వైసీపీ పాలకులతో రాష్ట్రం విధ్వంసం
వైసీపీ పాలకులతో ఏపీ రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైందని, శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం కలిగించేలా వ్యవస్థలను నిర్వర్యం చేశారని, పరిశ్రమలను తరిమేశారని,పెట్టుబడులు రాకుండా అడ్డుకున్నారని,అప్పుల భారాన్ని పెంచారని చంద్రబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. పెద్ద ఎత్తున పనులు చేపట్టాం.గడచిన ప్రభుత్వాలు ఇలాగే పనులు చేపట్టి ఉంటే నీళ్లు ఎప్పుడో వచ్చేవి. త పాలకులు వెలిగొండ ప్రాజెక్టు విషయంలో డ్రామాలాడారు.. మోసం చేశారు. మోసం చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట.. కళ్లార్పకుండా అబద్దాలు చెబుతారు… తేరుకునేలోపే మోసం చేసేస్తారు అని చద్రబాబు హెచ్చరించారు. గొడ్డలి పార్టీకి బుద్ది చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం కేవలం రూ.980 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని, కూటమి ప్రభుత్వం 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందన్నారు. • నిర్వాసితులకు గత ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు.. సొరంగాల్లో తవ్విన మట్టిని కూడా తీయలేదు.. ఫీడర్ కెనాల్ పనులను చేయలేదు. ిరుక్కుపోయిన టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని తీయకుండానే జాతికి అంకితం అని మోసం చేశారని చెప్పి మోసం చేశారని విమర్శించారు. .రభుత్వాన్ని నమ్మి అమరావతికి రైతులు భూములిస్తే.. దాన్ని నిర్వీర్యం చేశారు… రాజధాని లేకుండా చేశారు… మూడు ముక్కలాట ఆడారు. అమరావతిని రాజధానిగా కేంద్రం చట్టం చేస్తే… మావిగన్ అంటున్నారని విమర్శించారు. గత పాలకులు పోలవరం ప్రాజెక్టులో డయా ఫ్రం వాల్ పడగొట్టేలా చేశారని ఆరోపించారు.
నదుల అనుసంధానంతో అభివృద్ది
జల వివాదాలకు స్వస్తి పలకాలని నిర్ణయించాం అని, ముగ్గురు సీఎంలు కలిసి తుంగభద్ర గేట్లను ప్రారంభించడం జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. గంగా-కావేరి నదుల అనుసంధానం జరగాలి.పోలవరం ప్రాజెక్టులు పూర్తి అయితే.. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార, పెన్నా, కావేరి నదులు అనుసంధానం అయ్యేందుకు అవకాశం ఉంది. నదుల అనుసంధానంతో పాటు భూగర్భ జలాలు పెంచాలి.. అందుకే జలధార కార్యక్రమం చేపట్టాం అన్నారు. హంద్రీ-నీవా ద్వారా కుప్పం చివరి భూముల వరకు నీళ్లిచ్చాం. భూగర్భ జలాలు పెరిగితే.. విద్యుత్ భారం తగ్గుతుందని, మార్కాపురాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది… సహకరించే బాధ్యత ప్రజలదని తెలిపారు. నన్ను చూడండి.. పార్టీని చూడండి.. ఎన్డీఏను చూసి సహకరించండి. ప్రజలు ఆమోదించే వ్యక్తులనే నేను ఆమోదిస్తానని, ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తాం.. మీ నుంచి సహకారాన్ని కోరుతున్నానని చెప్పారు.
