నెట్టింటా..చంద్రబాబు సంతాన పథకంపై ట్రోలింగ్ వార్!

జనాభా సమస్య కాదు..ఇప్పుడు సంపదగా పరిగణించాలని...ఏపీలో మూడో సంతనానికి రూ.30వేలు, నాల్గవ సంతనానికి రూ.40వేలు ఇస్తామన్న సీఎం చంద్రబాబు జనాభా ప్రోత్సాహక పథకంపై సోషల్ మీడియా వేదికగా అనుకూల, వ్యతిరేక వాదనల వార్ కొనసాగుతుంది

విధాత : జనాభా సమస్య కాదు..ఇప్పుడు సంపదగా పరిగణించాలని…ఏపీలో మూడో సంతనానికి రూ.30వేలు, నాల్గవ సంతనానికి రూ.40వేలు ఇస్తామన్న సీఎం చంద్రబాబు జనాభా ప్రోత్సాహక పథకంపై సోషల్ మీడియా వేదికగా అనుకూల, వ్యతిరేక వాదనల వార్ కొనసాగుతుంది. సంతానోత్పత్తి రేటు పడిపోయి..వృద్దుల జనాభా పెరుగడంతో దేశం ఎదుర్కొనేందుకు జపాన్ ప్రతి ఏటా రూ.3 లక్షల కోట్లు ఖర్చు పెడుతోందని టీడీపీ అనుకూల వర్గాలు ఉదహరిస్తూ..జపాన్ ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అని.. అయినా జనాభా కుదించుకపోతూ కుంగిపోతోందంటూ పోస్టులు పెడుతున్నారు.

సిక్కిం టీఎఫ్ఆర్ రేటు 1.05 ఉందని, అక్కడ జనాభాను ప్రోత్సహించేందుకు రెండవ బిడ్డకు రూ.1 లక్ష, మూడవ బిడ్డకు రూ.1.5 లక్షలు, 365 రోజుల ప్రసూతి సెలవు, 30 రోజుల పితృత్వ సెలవు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత IVF, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు జీతం పెంపు వంటి చర్యలు తీసుకున్నారని, అయినా ఫలితం లేదని, ఏపీ టీఎఫ్ఆర్ రేటు 1.5ఉందని, 2040 నాటికి ఏపీ టీఎఫ్‌ఆర్ 1.2కు పడిపోనుందని గుర్తు చేస్తున్నారు. ఒక సమాజం 1.5 టీఎఫ్ఆర్ కంటే దిగువకు పడిపోతే, డబ్బుతో దాన్ని తిరిగి పైకి లేపలేరని వాదిస్తున్నారు.

జనాభా పెరుగుదల కోసం ఏపీ మేల్కొనకపోతే.. ప్రతి ముగ్గురు ఆంధ్రులలో ఒకరు 60 ఏళ్లు పైబడినవారు ఉంటారని, పాఠశాలలు మూతపడతాయి అని, కర్మాగారాలలో కార్మికులు ఉండబోరని, పెన్షన్లు బడ్జెట్‌ను తినేస్తాయి అని, వృద్ధ రాష్ట్రాన్ని పోషించడానికి యువ ఆంధ్రులపై పన్నులు వేయాల్సి వస్తుందని, అంతిమంగా యువత కొరతతో ఉత్పాదక రంగం క్షిణించి రాష్ట్రం, దేశం ఆర్థికంగా, సామాజికంగా పతనమవుతుందని చెబుతున్నారు.

రూ.30–40 వేల కోసం ఆశపడి పిల్లలను కంటే కష్టాలే

అయితే రూ.30–40 వేల కోసం ఆశపడి పిల్లలను కనొద్దు అని, వారికి సరైన పోషకాహారం ఇవ్వగలనా? లేదా? ఆలోచించుకోవాలని, మంచి ఆరోగ్య సంరక్షణ అందించగలనా?
నాణ్యమైన విద్య ఇవ్వగలనా? సురక్షితమైన ఆశ్రయం కల్పించగలనా? బాధ్యతగా, మంచి భవిష్యత్తుతో పెంచగలనా? అనే విషయాలపై సీరియస్ గా ఆలోచించుకోవాలని మరికొందరు నెటిజన్లు సలహా ఇస్తున్నారు. పిల్లలను కనడం మాత్రమే కాదు…వారికి మంచి జీవితం ఇవ్వడం కూడా తల్లిదండ్రుల బాధ్యత అని డాక్టర్ శివరంజని సంతోష్ వంటి వారు గుర్తు చేస్తున్నారు.

ఆ దేశాలకు బెటర్..మనకు సరికాదు..

ఇప్పటికే 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో ముగ్గురు నలుగురు పిల్లలని కంటూ పొతే మరో 50 ఏళ్లలో 350-400 కోట్లకి పోతాం అని, అప్పుడు ఉపాధి, తిండి దొరక్క చస్తామని మరికొందరు చంద్రబాబు ప్రతిపాదనలను తప్పుబడుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. చంద్రబాబు చెప్పే జనాభా పెంచే ఆలోచన జపాన్, యూరోప్, ఆస్ట్రేలియా, చైనా, అమెరికాకి మంచిదే కాని మనకు కాదంటున్నారు.

రూ.30-40వేలకు పురుటి ఖర్చులకే చాలవు

అసలు ముందు నాయకులు అధిక సంతానాన్ని కని..ప్రజలకు నీతులు చెప్పాలంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. లోకేష్, చంద్ర బాబు లాంటి వారికి ఒక్కరే సంతానం ఉండాలిగాని జనం మాత్రం అధిక సంతానంతో బాధ పడాలా అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నవారికి ఉద్యోగాలు, తిండి, మౌలిక వసతులు కల్పించలేకపోతున్నామని, ధరలు ఆకాశన్నంటుతున్నాయని, విద్య, వైద్యం లక్షలలో ఉందని..రూ.30-40వేలకు బిడ్డలను కని వారిని పేదరికం పాలు చేయాలా అని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.30-40వేలకు పురుటి ఖర్చులకే చాలవన్న సంగతి మరువరాదని చురకలేస్తున్నారు.

విద్య, వైద్యానికి లక్షలు ఎక్కడి నుంచి తేవాలో..?

1995కి ముందు చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేవారని, పెద్దగా ఖర్చు అయ్యేది కాదు అని, చంద్రబాబు విజన్ 2020తో మొత్తం ప్రభుత్వ విద్యాసంస్థలు నిర్వీర్యం అయిపోయాయని, ఇప్పుడు ఒక్కో సంవత్సరానికి లక్ష పైన ఖర్చు అవుతూందని, అధిక సంతానాన్ని కని వారి విద్య, వైద్యానికి లక్షలాది రూపాయాలు ఎక్కడ నుంచి తెచ్చిపెట్టాలని నిలదీస్తున్నారు.

ప్రభుత్వమే విద్య, వైద్యం అందిస్తే ఆలోచించవచ్చు..

చంద్రబాబు చెప్పింది తప్పు కాకపోవచ్చని..రూ.30వేలతో అసలు పిల్లలకి ఏం కొనొచ్చు ఎన్ని రోజులు కొనొచ్చు అన్నదే మా ప్రశ్న అని, 3,4 వ బిడ్డకి విద్య, వైద్యం ప్రభుత్వమే అందిస్తుందని, కార్పోరేట్ లో చదివినా ప్రభుత్వమే ఖర్చు చెల్లిస్తుందని హామీ ఇవ్వమనండి అప్పుడు జనం ఆలోచిస్తారని మరికొందరు నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడున్న వారికే సరైన జాబ్, ఉపాధి లేక విదేశాలకు తరలి పోతుంటే..ఇంకా అధిక జనాభా మాటలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చెప్పింది జరుగాలంటే ముందుగా ప్రెవేట్ హాస్పిటల్స్, ప్రెవేట్ స్కూల్స్, కాలేజీస్ అన్ని పోయి..విద్య, వైద్యం ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.

జపాన్ లో పిల్లల బాధ్యత ప్రభుత్వానిదే..

ఏపీ జనాభా పాలసీకి జపాన్ తో కంపెరిషన్? చేసే ముందు అక్కడా జనాభా పెంపు పాలసీ ఇక్కడి అమలు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. జపాన్ లో బిడ్డ పుట్టినప్పటి నుంచి విద్య, వైద్యం, తిండి, వసతి, ఉద్యోగం అన్ని ప్రభుత్వమే చూస్తుందన్న సంగతి మరువరాదని హితవు చెబుతున్నారు. జపాన్ లో ఒక బిడ్డ ను కంటే 3లక్షల రూపాయలు ఇస్తారు, టెస్టులు మొత్తం ఫ్రీ, కార్పోరేట్ స్థాయి స్కూల్ ఎడ్యుకేషన్ , వైద్యం అందిస్తారని, ఇక్కడ అన్ని నాసిరకమేనని గుర్తు చేస్తున్నారు.

 

Latest News