ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా చర్యలు..అన్నపర్రు విద్యార్థుల ఆరోగ్య స్థితి తెలుసుకున్న సీఎం చంద్రబాబు
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాలుర హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సవిత, అధికారులతో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విద్యార్థుల అనారోగ్య కారణాలను అడిగి తెలుసుకున్నారు.
అన్నపర్రు విద్యార్థుల ఆరోగ్య స్థితి తెలుసుకున్న సీఎం
మంత్రి, అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకోవాని ఆదేశం
అమరావతి, అక్టోబర్ 11(విధాత): గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాలుర హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సవిత, అధికారులతో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విద్యార్థుల అనారోగ్య కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు జనరల్ ఆస్పత్రిలో 24 మంది విద్యార్థులు ఉన్నారని.. వీరిలో ఒక విద్యార్థికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్టు సీఎంకు అధికారులు వివరించారు. పెదనందిపాడు వైద్య శిబిరంలో చికిత్స పొందిన వారిలో ఇద్దరు మినహా అందరిని డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని సీఎం అడిగారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి తెలిపారు. ఐసీయూలో ఉన్న ఓ విద్యార్థికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని… అయితే నిపుణుల సూచనలతో ఆ విద్యార్థిని మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పూర్తిగా మెరుగైన తర్వాతే ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అన్నపర్రు హాస్టల్లోని సౌకర్యాలు, ఆహారంలో నాణ్యత, మంచి నీటి సరఫరా వంటి అంశాలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం అన్నపర్రు గ్రామంతో సహా హస్టల్లో శానిటేషన్ కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి సవిత తెలిపారు. ఫుడ్ పాయిజన్ వల్ల ఈ ఘటన జరిగిందని వైద్యులు ప్రాథమికంగా చెప్పారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నీటి, ఆహార నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబుకు పంపామని మంత్రి సవిత సీఎం దృష్టికి తెచ్చారు. ఆస్పత్రిలో ఉన్న విద్యార్థుల పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని మంత్రి, అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆస్పత్రిలో ఉన్న విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేలా తాము చర్యలు తీసుకుంటున్నామని సీఎం భరోసా ఇచ్చారు.