విధాత : వృద్ధాశ్రమానికి నేను నా జీవితాంతం సంపాదించిన ఆస్తులను అన్నింటిని దానం చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్త పూర్తి అవాస్తవం అని సీపీఐ సీనియర్ నేత కె. నారాయణ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. సీపీఐ నేత నారాయణ దంపతులు తమ కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను సమాజానికి రాసిచ్చేశారు” అంటూ ఒక ఫేక్ పోస్ట్‌ను సృష్టించి వైరల్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. అనేక మంది ఫోన్లు చేసి నారాయణను అభినందించడం మొదలు పెట్టారు. అసలు ఇదేమిటో అర్థం కాక ఆయన తలపట్టుకుని విషయం తెలిసి వివరణ ఇచ్చారు.
ఆసలు నిజం ఇదే..
కడపకు చెందిన దంపతుల దాతృత్వాన్ని కొందరు సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేశారని, దీంతో నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా చుట్టేసినట్లయ్యిందని నారాయణ అసహనం వ్యక్తం చేశారు. కడపకు చెందిన మాచిరెడ్డి సంజీవమ్మ, ఆమె భర్త మాచిరెడ్డి సమాజ సేవ కోసం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని, వారు తమ జీవితకాలపు కష్టార్జితం, సంపాదన అయిన దాదాపు రూ. 3 కోట్ల విలువైన ఆస్తులను సమాజ సేవకు అంకితం చేయాలని నిర్ణయించారని నారాయణ వెల్లడించారు. ఇందుకోసం వారు నివసిస్తున్న సొంత ఇల్లు, 25 సెంట్ల భూమిని కూడా విక్రయించారు. ఆ డబ్బుతో కడపలోని బాకరాపేట రోడ్డులో 3 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి, వృద్ధుల ఆశ్రయం కోసం “జీవనీ వృద్ధాశ్రమాన్ని” నిర్మించారని తెలిపారు.
అయితే వయోభారం రీత్యా భవిష్యత్తులో ఈ ఆశ్రమాన్ని నిరాటంకంగా, నిరంతరాయంగా నిర్వహించడం తమ వల్ల కాకపోవచ్చని భావించిన ఈ దంపతులు.. ఈ 3 ఎకరాల స్థలాన్ని, వృద్ధాశ్రమాన్ని, దానికి సంబంధించిన మొత్తం ఆస్తిని అధికారికంగా “చండ్ర రాజేశ్వరరావు (CR) ఫౌండేషన్”కు అప్పగించారని నారాయణ వెల్లడించారు.
మార్ఫింగ్ తో తప్పుడు ప్రచారం
సీఆర్ ఫౌండేషన్ కు ఆస్తుల దానం విషయాన్ని వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో దాత సంజీవమ్మ మాట్లాడారు. సీ.ఆర్. ఫౌండేషన్ ప్రతినిధిగా నారాయణ ఆమె పక్కనే కూర్చుని, ఈ దంపతుల అపార దాతృత్వాన్ని కొనియాడారు. ఈ ప్రెస్ మీట్ తాలూకు విజువల్స్ ఆధారంగా కొందరు సోషల్ మీడియాలో ఒక తప్పుడు ప్రచారానికి తెరలేపారు. ప్రెస్ మీట్‌లో నారాయణ పక్కన కూర్చున్న దాత సంజీవమ్మ ఫోటోను గ్రాఫిక్స్/మార్ఫింగ్ ద్వారా తొలగించి, ఆ స్థానంలో నాలుగేళ్ల క్రితమే మరణించిన నారాయణ భార్య వసుంధర ఫోటోను అతికించి..నారాయణ దంపతులు ఆస్తులను దానం చేసినట్లుగా ఫేక్ పోస్టు సృష్టించారు.
ఈ తప్పుడు ప్రచారం తన దృష్టికి రావడంతో డాక్టర్ కె. నారాయణ తీవ్రంగా స్పందించారు. “నాపై అతిప్రేమతో చనిపోయిన నా భార్య ఫోటో మార్ఫింగ్ చేశారు” అని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. “నిజం గడప దాటకముందే అబద్ధం ఎల్లలు దాటుతుంది” అని గుర్తు చేస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆదర్శానికి ముందే అబద్దం… సోషల్ మీడియా ఎఫెక్ట్
ఆస్తుల దానం ప్రకటనతో ..నేను, మా ఆవిడ ఉన్నట్టుగా వస్తున్న ఫోటోలో ఎలాంటి వాస్తవం లేదు అని, నేను, సంజీవమ్మ ఉన్న వీడియో మాత్రమే వాస్తవం అని, సంజీవమ్మ, మాచిరెడ్డి దంపతులు తమ కష్టార్జితంతో ‘జీవనీ వృద్ధాశ్రమం’ నిర్మించి, వయోభారం రీత్యా దాన్ని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌కు ఇచ్చేశారు. వారికి ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని నారాయణ గుర్తు చేశారు. నాపై మరీ అతిప్రేమ వలకపోస్తూ.. 4 సంవత్సరాల క్రితం చనిపోయిన మా ఆవిడ ఫోటో పెట్టి, సంజీవమ్మ ఫోటోను తొలగించి మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇదీ అసలు వాస్తవం అని నారాయణ వివరణ ఇచ్చారు.
మాచిరెడ్డి, సంజీవమ్మ దంపతులు రూ. 3 కోట్ల ఆస్తిని, తాము కట్టుకున్న వృద్ధాశ్రమాన్ని దానం చేయడం సమాజంలో ఎందరికో ఆదర్శం. అలాంటి గొప్ప దాతల త్యాగాన్ని గుర్తించాల్సింది పోయి.. ఒక రాజకీయ నేతపై ఉన్న ఉత్సాహం లేదా ‘అతి ప్రేమ’ కొద్దీ, ఏకంగా ఆయన మరణించిన భార్య ఫోటోను మార్ఫింగ్ చేసి వాడుకోవడం సామాజిక మాధ్యమాల దుర్వినియోగానికి అద్దం పడుతోంది. నారాయణ ఇచ్చిన స్పష్టతతో కడప దంపతుల అసలు దాతృత్వం బాహ్య ప్రపంచానికి తెలిసింది, ఫేక్ ప్రచారానికి తెరపడినట్లయ్యింది.
