గంగా ఘాట్ లో కొట్టుకపోతున్న భక్తుడిని రక్షించిన జవాన్

హరిద్వార్ గంగానదిలో వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న భక్తుడిని ఎస్డీఆర్ఎఫ్ జవాన్ ప్రాణాలకు తెగించి రక్షించాడు. ఈ సాహస ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ప్రశంసలు అందుకుంటోంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 30, 2026, 2:54 pm IST
Read Time: 3 mins
గంగా ఘాట్ లో కొట్టుకపోతున్న భక్తుడిని రక్షించిన జవాన్

ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ లో గంగానదిలో కొట్టుకుపోతున్న భక్తుడిని కాపాడేందుకు ఎస్డీఆర్ఎఫ్ జవాన్ చేసిన సాహసం అందరి ప్రశంసలను అందుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. హరిద్వార్‌లోని కాంగ్రా ఘాట్ వద్ద ఉత్తరప్రదేశ్ నోయిడాకు చెందిన శివ భక్తుడు గంగా నదిలో పుణ్య స్నానం చేస్తున్న క్రమంలో నది వరద ఉదృతిలో కొట్టుకుపోసాగాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఉత్తరాఖండ్ ఎస్డీఆర్ఎఫ్(SDRF) జవాన్ వెంటనే గంగానదిలోకి దూకి భక్తుడిని రక్షించేందుకు నదిలో దూకాడు. ఈదుతూ నదిలో కొట్టుకపోతున్న భక్తుడిని పట్టుకుని తీవ్రంగా శ్రమించి ఆ యువకుడిని సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చాడు.

జవాన్ కు సహాయంగా రెండు సార్లు ఘాట్ గట్టుపై నుంచి సహచర సిబ్బంది తాడుతో కూడిన లైఫ్ జాకెట్ ను విసిరినప్పటికి వరద ప్రవాహ వేగానికి అది దూరంగా పడిపోవడంతో జవాన్ కు భక్తుడితో పాటు ప్రవహానికి ఎదురీదక తప్పలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ జవాన్ ధైర్యానికి ఆన్‌లైన్‌లో ప్రశంసలు అందిస్తున్నారు.

తాజాగా అమెరికాలో సముద్రంలో మునిగిపోతున్న బాలుడిని యువ లైఫ్ గార్డు రక్షించిన ఘటనను జవాన్ సాహసం గుర్తు చేసిందని..ఇతనికి కూడా ప్రభుత్వం తగిన పురస్కారం అందించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. భక్తుల రద్దీగా ఉండే కార్యక్రమాలలో వారి భద్రతలో ఎస్డీఆర్ఎఫ్ పాత్ర ఎంత కీలకమైందో ఈ వీడియో చాటిందని వారు గుర్తు చేస్తున్నారు.