ఏపీలో రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఉప ఎన్నిక … పోలింగ్ తేదీలు ప్రకటించిన ఈసీ
మ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ సీట్లకు ఉప ఎన్నికలు జూలై 12న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. సీ రామచంద్రయ్యపై అనర్హత వేటు, షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా నేపథ్యంలో ఈ రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి

అమరావతి:ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ సీట్లకు ఉప ఎన్నికలు జూలై 12న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. సీ రామచంద్రయ్యపై అనర్హత వేటు, షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా నేపథ్యంలో ఈ రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2021లో వైసీపీ టికెట్‌పై ఎమ్మెల్సీగా గెలిచి, ఈ ఏడాది మార్చిలో తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించినందుకుగాను ఆయనపై అనర్హత వేటు పడింది. వైసీపీ నుంచి గెలిచిన ఇక్బాల్.. ఆ పార్టీకి రాజీనామా చేసి, ఏప్రిల్‌లో టీడీపీలో చేరారు. అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29 వరకు ఉన్నది. ఈ రెండు సీట్లకు ఉప ఎన్నికల నిమిత్తం జూన్ 25న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించనున్నది.
జూలై 2 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. మరుసటి రోజు నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి జూలై 5 వరకూ గడువు ఉంటుంది. 12న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఏపీ అసెంబ్లీలో ఎన్డీయే కూటమికి 164 మంది సభ్యుల మద్దతు ఉన్న నేపథ్యంలో రెండు సీట్లూ కూటమికే దక్కనున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు గాను టీడీపీ 135, దాని మిత్రపక్షాలు జనసేన 21, బీజేపీ 8 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్‌పైనా అనర్హత వేటు పడింది. ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ స్థానానికి త్వరలో పోలింగ్ తేదీని ప్రకటించనున్నారు.