భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి
కరోనా బాధితులతో ఎమ్మెల్యే అనంత – కోవిడ్ సర్వజనాస్పత్రిలో వార్డుల పరిశీలన – ఆక్సిజన్ సరఫరాపై వైద్యులు, బాధితులతో ఆరా – ఐసీయూలో ఏసీల ఏర్పాటుకు ఆదేశం – బాధితుల వద్దకు బంధువులను పంపొద్దని సూచన కరోనా బాధితులు ఎవరూ భయపడొద్దు. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత త్వరగా కోలుకుని ఇంటికెళ్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు’’ అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం అనంతపురం సర్వజనాస్పత్రిలోని కోవిడ్ వార్డులను […]

కరోనా బాధితులతో ఎమ్మెల్యే అనంత
– కోవిడ్ సర్వజనాస్పత్రిలో వార్డుల పరిశీలన
– ఆక్సిజన్ సరఫరాపై వైద్యులు, బాధితులతో ఆరా
– ఐసీయూలో ఏసీల ఏర్పాటుకు ఆదేశం
– బాధితుల వద్దకు బంధువులను పంపొద్దని సూచన
కరోనా బాధితులు ఎవరూ భయపడొద్దు. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత త్వరగా కోలుకుని ఇంటికెళ్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు’’ అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం అనంతపురం సర్వజనాస్పత్రిలోని కోవిడ్ వార్డులను జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరితో కలిసి ఆయన పరిశీలించారు. ఐసీయూ, ఛెస్ట్, ఎఫ్‌ఎం, ఆర్థో వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వైద్య సేవలపై ఆరా తీశారు. ఆక్సిజన్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అటు వైద్య సిబ్బంది, ఇటు కోవిడ్ బాధితులను ఎమ్మెల్యే అనంత అడిగి తెలుసుకున్నారు.

ఐసీయూలో ఏసీలు పనిచేయకపోవవడంతో రెండు ఏసీలను తక్షణం ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావును ఆదేశించారు. కోవిడ్‌తో ఆస్పత్రికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకోవాలన్నారు. కొన్ని వార్డుల్లో బాధితులతో కలిసి బంధువులు ఉండడాన్ని గమనించి.. ఇకపై బంధువులను లోపలికి అనుమతించవద్దని తెలిపారు. వైద్య సిబ్బందే బాధితుల పర్యవేక్షణ చూసుకోవాలన్నారు. అత్యవసరమైతే వారికి రక్షణ కవచాలు అందించి పంపాలని సూచించారు.

ప్రస్తుతం చాలా మంది కోవిడ్ బాధితులు అనంతపురం సర్వజనాస్పత్రి, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల్లో చికిత్స పొందడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే అనంత తెలిపారు. ఇతర ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో తగినంద మంది సిబ్బంది లేకపోవడంతో తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్న భావన బాధితుల్లో ఉందన్నారు. దీన్ని తొలగించడానికి కొంత మంది సిబ్బందిని కోవిడ్ కేర్ సెంటర్లలో ఉంచి బాధితులకు మనోధైర్యం కల్పించేలా చూడాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరికి సూచించారు. కాగా ఆస్పత్రిలో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల పార్కింగ్‌ను డీఎంహెచ్‌ఓ కార్యాలయం పక్కనున్న బాలభవన్ మైదానంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌కు సూచించారు.