నిబంధనలు పాటించే ఏ ఒక్క ఆసుపత్రి జోలికి వెళ్లం: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి
నిబంధనలు పాటించే ఏ ఒక్క ఆసుపత్రి జోలికి తమ ప్రత్యేక బృందాలు వెళ్లవని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. మంచి సేవలు అందించే ఆసుపత్రుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉంటుందని హామీ ఇచ్చారు. నిబంధనలు పాటించకపోతే చట్టరీత్యా చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను అతిక్రమించి ప్రజలను ఇబ్బందులుకు గురి చేస్తున్న ఆసుపత్రుల మీదే కఠినంగా వ్యవహరిస్తామని, నిబంధనలు పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు […]

నిబంధనలు పాటించే ఏ ఒక్క ఆసుపత్రి జోలికి తమ ప్రత్యేక బృందాలు వెళ్లవని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. మంచి సేవలు అందించే ఆసుపత్రుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉంటుందని హామీ ఇచ్చారు.
నిబంధనలు పాటించకపోతే చట్టరీత్యా చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను అతిక్రమించి ప్రజలను ఇబ్బందులుకు గురి చేస్తున్న ఆసుపత్రుల మీదే కఠినంగా వ్యవహరిస్తామని, నిబంధనలు పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న ఆసుపత్రులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులు కూడా కోవిడ్ బాధితులను కాపాడేందుకు శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్నాయని అభినందించారు. సకాలంలో వైద్యం అందక బాధితులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొద్ది రోజులుగా అనేక చర్యలు చేపట్టిందని వివరించారు. అలుపెరుగని సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి అండగా ఉంటూనే మరోవైపు బాధితులను ఇబ్బందులకు గురిచేసే వారిపైన దృష్టి సారించామని వెల్లడించారు.
కరోనా మహమ్మారిని అడ్డుపెట్టుకుని డబ్బులు దండుకునేందుకు అక్రమాలకు పాల్పడేవారిపై మరింత నిఘా పెంచామని తెలిపారు. ప్రాణాధార మందులకు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలను పేషంట్ల నుంచి వసూలు చేయడం, ఆక్సిజన్ సిలిండర్ల వినియోగం మీద జవాబుదారీతనం లేకుండా వ్యవహరించిన ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని గుర్తుచేశారు. అవసరమైన చోట్ల రోగులకు అందాల్సిన రెమిడెసివిర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని, ఆక్సిజన్ కొరతను కూడా కొందరు సొమ్ము చేసుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకు మించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపైన ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు.
డబ్బులకు కక్కుర్తిపడి కొందరు చేస్తున్న ఇలాంటి పనులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంచి వైద్యులకు, సిబ్బందికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు చెక్ పెట్టడం ద్వారా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు అందుకోగలుగుతారని ప్రభుత్వం భావించిందని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో వైద్యసేవల్లో అక్రమాలకు తావులేకుండా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా స్థాయిల్లోని అధికారులతో కలిపి 18 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ ప్రత్యేక టీమ్‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు ఉన్న ఆసుపత్రులపై మూడు రోజులుగా దాడులు నిర్వహించి, రికార్డులు పరిశీలించి, రోగులు, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ నిల్వలు, వాటి వినియోగాన్ని పరిశీలించాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన 412 కోవిడ్ ఆసుపత్రులు ఉన్నాయని కానీ, కేవలం 35 ప్రైవేటు ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించినప్పటికీ అక్రమాలకు పాల్పడిన 9 ఆసుపత్రులపైనే కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రులపై ప్రత్యేక బృందాల సోదాలను నిరసిస్తూ వైఎస్సార్ కడప జిల్లాలో కోవిడ్ సేవలు నిలిపివేయాలని ప్రైవేటు హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న విషయం తమ దృష్టికి రాగా అధికారులు వారితో చర్చించి.
అక్రమాలకు పాల్పడని ఆసుపత్రులకు ఇబ్బందులేమీ ఉండవని హామీ ఇచ్చామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ నేటి నుంచి యథావిధిగా సేవలు కొనసాగించడానికి అంగీకరించిందని తెలిపారు.