గోదావరిలో తొలి పులస చిక్కింది..భారీ ధర పలికింది !

తాజాగా వర్షాలతో అంబేద్కర్ కోనసీమ జిల్లా యానాంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పులస చేపల సీజన్ మొదలైంది. గోదావరికి ఎర్రనీరు చేరడంతో ఈ ఏడాది కోటిపల్లి రేవులో గౌతమి గోదావరిలో చిక్కిన తొలి పులస చేప యానాం మార్కెట్‌కు చేరింది. రూ.14500 ధరకు అమ్ముడుపోయింది.

గోదావరికి వర్షకాలంలో వచ్చే తొలి వరదలకు మత్స్యకారులకు చిక్కే పులస చేపలకు మార్కెట్ లో వేలాది రూపాయల ధర పలుకడం తెలిసిందే. గోదావరి పులస చేప రుచికి, డిమాండ్‌కు పెట్టింది పేరు. ఇది వర్షాకాలంలో మాత్రమే దొరికే అరుదైన చేప. దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ‘పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే’ అని గోదారి జిల్లాల్లో చెబుతుంటారు. ప్రతి ఏటా జులై నెలలో తొలి వర్షాల వరదలతో గోదావరిలో పులస చేపలు సీజన్ మొదలవుతుంది.

తాజాగా వర్షాలతో అంబేద్కర్ కోనసీమ జిల్లా యానాంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పులస చేపల సీజన్ మొదలైంది. గోదావరికి ఎర్రనీరు చేరడంతో ఈ ఏడాది తొలి పులస చేప యానాం మార్కెట్‌కు చేరింది.
సుమారు కిలోన్నర బరువున్న ఈ పులస యానాం సమీపంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు చిక్కింది. దీంతో మత్స్యకారుల్లో ఆనందం నెలకొంది. కోటిపల్లి రేవులో గౌతమి గోదావరిలో చిక్కిన తొలి పులసను భార్యాభర్తలు రత్నం, భద్రం రూ.14వేలకు దక్కించుకున్నారు. అనంతరం రూ.14500కు విక్రయించారు. ఈ ఏడాదికి ఇదే తొలి పులస కావడం విశేషం.

పులస చేపలు అంటే గోదారోళ్లకు చాలా ఇష్టం. వాటిని భారీ ధరలకు వెనుకాడకుండా కొనుగోలు చేసి బంధువులు, స్నేహితులకు పంపిస్తుంటారు. ప్రతి ఏటా జులైలో ఉభయ గోదావరి జిల్లాలో పులస చేపల సీజన్ మొదలవుతుంది. ఈ చేపలు సముద్రంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి గోదావరి వరదల సమయంలో ఎదురీదుకుంటూ ఎక్కువగా అంతర్వేది, యానాం వంటి సముద్ర సంగమ ప్రాంతాల నుంచి గోదావరిలోకి చేరుతాయి. ధవళేశ్వరం బ్యారేజి, రాజమహేంద్రవరం వరకు పులసలు గోదావరిలో ఎదురీదుతాయి. జులై నుంచి సెప్టెంబర్ వరకు ఈ చేపలు గుడ్లు పెట్టడానికి వెళతాయి. పులస శాస్త్రీయ నామం హిల్సా (టెనులోసా ఇలిషా). ఈ చేపలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా నుంచి హిందూ మహాసముద్ర ద్వారా బంగాళాఖాతంలోకి వస్తాయి. ఆ సమయంలో ఈ చేపలను ఇలసగా పిలుస్తారు. ప్రతి ఏటా వర్షాకాలంలో గోదావరికి కొత్త నీళ్లు వచ్చినప్పుడు ఎర్రటి మట్టి నీరు సముద్రంలో కలిసే సమయంలో నదిలోకి ఈ చేపలు ఎదురీదుతాయి. సముద్రం నుంచి గోదావరిలోకి వచ్చిన సమయంలో ఇలస చేపల శరీరంలో మార్పులు చోటుచేసుకుని ఇలస కాస్తా పులసగా మారుతుందని స్థానికుల కథనం.

 

Latest News