Pawan Kalyan | మంత్రిగా చెబుతున్నా.. క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే, తెలంగాణలో నీ సినిమాలు ఆడ‌వు

Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన 'కోనసీమ–తెలంగాణ దిష్టి' వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి.

  • By: sn |    movies |    Published on : Dec 02, 2025 1:16 PM IST
Pawan Kalyan | మంత్రిగా చెబుతున్నా.. క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే, తెలంగాణలో నీ సినిమాలు ఆడ‌వు

Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ‘కోనసీమ–తెలంగాణ దిష్టి’ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. కోనసీమ పర్యటనలో ఆయన ‘కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలింద’ని చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు తెలంగాణ మంత్రులు, నాయకులు ఘాటుగా స్పందించారు. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేదంటే పవన్ నటించిన ఒక్క సినిమా కూడా తెలంగాణలోని ఏ థియేటర్‌లోనూ విడుదలయ్యే పరిస్థితి ఉండదు అని హెచ్చరించారు. కోనసీమ కొబ్బరి చెట్ల పరిస్థితికి తెలంగాణ ప్రజలను కారణం చూపడం పూర్తిగా అనుచితమన్నారు.

“తెలంగాణ వెనుకబాటుకు కారణం ఆంధ్ర పాలకులే” – కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి ఇంకా మాట్లాడుతూ .. దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ నీరు తాగాల్సి వచ్చిన పరిస్థితుల‌కి ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యమే కారణం. వారిని ఎందుకు ప్రశ్నించరు?” అని అన్నారు. పవన్ కల్యాణ్‌కు పరిపాలనా అనుభవం లేకపోవడం వల్లే ఇటువంటి అపరిపక్వ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌తో పాటు అనేక రాజకీయ పార్టీలు స్పందిస్తూ క్షమాపణల డిమాండ్‌ను మరింత బలపరిచాయి. ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న రాజకీయ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

కోనసీమ పర్యటనలో చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు ఏపీ–తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. మరి వివాదం ముదురుతున్న వేళ ప‌వన్ క‌ళ్యాణ్ త‌న వ్యాఖ్య‌ల‌పై క్లారిటీ ఇస్తారా, లేకుంటే క్ష‌మాప‌ణ‌లు చెబుతారా అనేది చూడాలి. ఇక ప‌వ‌న్ న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ వ‌చ్చే ఏడాది విడుదల కానున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే తెలంగాణ‌లో ఆయ‌న సినిమా విడుద‌ల‌ని ఆపేస్తారా అని ముచ్చ‌టించుకుంటున్నారు.